అంతస్థులు ఎన్ని ఉన్నా,
ఆఖరిస్నానం ఆరుబయటే !
వివాహాస్పదం
కొత్త సంవత్సరంలో అప్పుడే జనవరి నెల అయిపోయి ఫిబ్రవరి నెల వచ్చేసింది । మనకంటే అప్పుడే వచ్చేసింది అనిపిస్తుంది గాని కొంతమందికి మాత్రం జనవరి నెల అంతా క్షణమొక యుగంగా గడిచి కానీ ఫిబ్రవరి నెల వచ్చి ఉండదు। వంద శకాల పెట్టున ఉన్న జనవరి నెలని దాటి ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి లోకి దూకుతామా అని ఎదురు చూసి ఉంటారు ।
ఎందుకంటారా ?
మరి ఫిబ్రవరి అంటే ఏంటి? మాఘమాసపు సమయం ! మాఘమాసం అంటే పెళ్లిళ్ల నెల। అందుకే కొన్ని నెలల ముందు పెళ్లి కుదిరి, మాఘమాసంలో పెళ్లి ముహూర్తం నిశ్చయం అయి, అప్పటినుండి 'మాఘమాసం ఎప్పుడొస్తుందో' అని పాడుకుంటూ ఎదురుచూస్తూ ఉంటారు కొందరు పసిమొగ్గలు!
కానీ మాఘమాసంలోనే కాదు ఏ మాసంలో ముహూర్తం కుదిరినా ఆరోజు జరిగేది కేవలం పరిణయాలు, పరాగసంపర్కాలు కాదనీ కొన్ని పరమాణు విస్ఫోటనాలు అనీ ఆ మొగ్గలు ఊహించవు ।
పెళ్లికుదిరిన మరుక్షణం నుంచీ కాబోయే వధూవరులిద్దరూ పెళ్లిరోజు గురించి ఎన్నో కలలు కంటూ ,
పెళ్ళిలో బాగా కనబడాలనీ,పెళ్లి ఫోటోలలో ,వీడియోలలో అందంగా పడాలని తెగ పాట్లు పడుతుంటారు।
ఆ పెళ్లి ఫోటోలు, వీడియోలు చూసుకుంటూ, జీవితాంతం తమ పెళ్లి తాలూకు మధుర అనుభూతులని నెమరువేసుకుని ఆస్వాదించాలని ఆరాటపడతారు ఆ పిచ్చిమొహాలు ।
అమ్మాయిలు గోళ్ళనీ అబ్బాయిలు జుట్లనీ బాగా పెంచుకుని, కోరినట్లు షేప్ చేయించుకుని ముస్తాబై మురిసిపోతుంటారు।
ఇంతా చేస్తే ఆ పెళ్ళిలో జరిగేదేమిటి? మగా ఆడా పెళ్ళివాళ్ళ మధ్య గోళ్ళరక్కులాటల, జుట్ల పీకులాటల స్థాయిలో వాదులాటలు, పోట్లాటలు, కొండొకచో కాట్లాటలూనూ!!!
ఈ గొడవలతో మగపెళ్లివారు ఆడపెళ్ళివారిని నిర్లక్ష్య ,నిర్లిప్త, నిరాసక్త జీవులని తిట్టి పోయడమూ , ఆడపెళ్ళివారు మగపెళ్ళివారిని , నిర్దాక్షిణ్య , నిర్దయ , నిరంకుశ పిశాచులని ఆడిపోసుకోవడమూ సదరు నిర్భాగ్య వధూవరుల ముందే జరుగుతాయి।
ఇంతా జరిగేసరికి ఆ నవదంపతులకి ఇన్నాల్టి విరాహమూ వైరాగ్యంగా మారడం ఖాయం!
ఏ పెళ్లికోసమైతే మధురోహలతో ఎదురు చూసారో...
ఆ పెళ్లి రోజు ఒక మధుర స్మృతిగా మారకపోగా ఆ మధురోహలన్నియు మాడి మసిబారిపోయి ,..
ముందు ముందు ఆ పెళ్లిరోజు గుర్తొస్తేనే మెదడులో ముళ్ళు గుచ్చుకున్నంత విలవిలలాడుతారు।
ఆ రోజు మీ పిన్ని అలా అంది అంటే మీ మామయ్య అలా చేసాడు అంటూ ఒకరిపై ఒకరు మండిపడుతుంటారు ।
మీకో విషయం చెప్పనా।।
చాలారోజుల తర్వాత నా బాల్య స్నేహితురాలి ఇంటికి వెళ్ళాము మొన్నీమధ్య। ముఖ్యమైన కబుర్లన్నీ అయ్యి , భోజనాలు ముగిశాక "నీ పెళ్లి వీడియో చూద్దాం పెట్టు "
అని అడిగా,...అప్పట్లో నేనెలా వుండేదాన్నో ఆ వీడియోలో చూసుకుని ఆగతవైభవానికి మురిసిపోదామన్న ఆశ కూడా రేకెత్తడంతో!! అంతే! నేనామాట అనగానే నా స్నేహితురాలు ఆకస్మిక మౌనవ్రతం స్వీకరించింది। వాళ్ళాయన మాత్రం ఖంగారుగా "ఆబ్బె ! ఇప్పుడీ ఆనంద సమయంలో ఆ హారర్ ఫిలిం చూడడం ఎందుకండీ? హాయిగా వేరే ఏదైనా సినిమా చూద్దాం" అనేశాడు। పైకి అనలేదు కానీ నాస్నేహితురాలు కూడా కళ్ళతో అదే భావాన్ని పలికించి, మౌనవ్రతం విరమించింది।
ఆపెళ్లిక్యాసెట్, ఆల్బమ్‌ల వల్ల తామిద్దరి మధ్య ఎన్ని పానిపట్టు యుద్దాలు జరిగాయో తాము లెక్క కూడాపెట్టలేక పోయామని, చివరికి ఆ క్యాసెట్, ఫోటోలు చూసి తమ మనసులనీ, బంధాన్నీ చెడగొట్టుకోకూడదని ఒప్పందం చేసుకుని.., తమపెళ్లి వీడియో మరియు ఫోటో ఆల్బంల ప్రదర్శనని ఇంట్లో నిషేధించామనీ నాఫ్రెండ్ తర్వాత నాకు రహస్యంగా చెప్పింది।
నిజం ! ....
నాకుచాలా బాధ కలిగింది। ఆపెళ్ళికి ముందుకొన్ని నెలలనుండీ వాళ్ళు ఆరోజుని జీవితకాలపు తీయని జ్ఞ్యాపకంగా మలచుకోవడానికి వాళ్ళు పడ్డ తాపత్రయంనాకుతెలుసు। కేశ-చర్మ సౌందర్యజాగ్రత్తలు,। ।పెళ్లిబట్టలు, నగలు, నుండి శుభలేఖ , కల్యాణ మంటపం డెకొరేషన్ వరకూ ఇద్దరు చర్చించుకుని మరీ, ఎన్నెన్నో కలలతో ఆపెళ్లిరోజుకోసం ఎదురుచూసారు।
అలాఅనిఇప్పుడు వాళ్లిద్దరూ అన్యోన్యంగా లేరని కాదు , వాళ్ళిద్దరి మధ్యఎంత ప్రేమ ఉన్నా , వారి బంధానికి ముడివేసిన పెళ్ళినీ, ఆరోజునీ తలచుకుంటే మాత్రం హడలిపోతున్నారు।
ఆ పెళ్లితంతు తమమధ్య పెట్టిన తంపులనీ, పెళ్లి తర్వాత ఆ తతంగం గుర్తొచ్చినప్పుడల్లా తగవులుపడి తాము తగలేసుకున్న విలువైన సమయాన్నీ గుర్తు తెచ్చుకుని తల్లడిల్లిపోతున్నారు।
వాళ్ళే కాదు, చాలా మంది జంటల పరిస్థితి ఇంతే!!
అసలు పెళ్లిళ్లలో ఈ గొడవలు ఏమిటి ? ఎక్కడ , ఎందుకు మొదలౌతాయి? వాటికి బాధ్యులు ఎవరు? నివారణ చర్యలు ఏమిటి? అవి ఎలా చేపట్టాలి లాంటి వాటి గురించి చర్చించి రచించడం మొదలు పెడితే అది రాజ్యాంగం అంత పెద్ద పుస్తకం అవుతుంది।
అసలు మగపెళ్లివారు పెళ్లి బస్సో కారో దిగడం దగ్గరే పెళ్లిగొడవలకి శ్రీకారం చుట్టబడుతుంది।
ఆర్టీసీ బస్సులు, ట్రైన్ల టైమింగ్ లకి సంబంధించి ఒక రూల్ ఉందని నేను విన్నా, అదేంటంటే।। ఆ బస్సులు ,ట్రైన్ లు అవసరమైతే ఒక గంట లేట్‌గా అయినా రావచ్చు కానీ ఒక్క నిమిషం కూడా ముందు రాకూడదని।
నా ఉద్దేశ్యం ప్రకారం ఆ రూల్ పెట్టాల్సింది పెళ్లి బస్సులకు ।।।।
మామూలు బస్సులు ముందొచ్చిపోయి ఎక్కాల్సిన వాళ్ళు ఆ బస్సు మిస్ అయితే కొంపలు తగులబడే ప్రమాదాలు జరిగే అవకాశం 1% మించి ఉండకపోవచ్చు కానీ మగపెళ్లివారి బస్సులు అనుకున్న టైంకి ముందో అనుకోలేనంత ఆలస్యంగానో వస్తే మాత్రం ఆ వధూవరుల జీవితాలు తగులబడే అవకాశం 100 % ఉంటుంది। ఉదాహరణకు మగపెళ్లివారు ఫలానా టైమ్‌కి వాళ్ళ ఊర్లో బయలు దేరి , ఫలానా టైంకి వస్తాం అని చెప్పారనుకోండి। వాళ్ళు చెప్పినదాని ప్రకారమే కదా ఆడపెళ్ళివాళ్ళు స్వాగత సన్నాహాలు చేసుకునేది।కానీ మగపెళ్లివారు ఏవో కారణాలవల్ల ఆ డిపార్చర్ & అరైవల్ టైంలని మార్చేసి ఆ ఏకపక్ష నిర్ణయం గురించి ఆడపెళ్ళివారికి కనీసం సమాచారం అందించకుండా ఊహించిన సమయానికి ముందుగానే అనూహ్యంగా వచ్చారనుకోండి।
ఆ సమయానికి కన్యాదాత పెళ్లి పనులకోసం ఏ మార్కెట్ కో వెళ్ళుంటాడు। మేనమామ ఇంకేదో పనితో హడావిడి పడుతుంటాడు। అన్నగారు మరో పనిలో ఎక్కడో ఉండుంటాడు। పెళ్లి బస్సు వచ్చేప్పటికి రమ్మన్న సన్నాయి, బ్యాండ్ మేళం వాళ్ళు ఇంకా టైం ఉందని ఇంటి దగ్గరే హాయిగా తమ వాయిద్యాలని 'పిప్పీ' అంటూ సరి చేసుకుంటుంటారు. అదే టైమ్ కి 'పిప్పీ' అంటూ పెళ్ళి బస్సు వచ్చి ఆగుతుంది.
ఇంకేముంది, ఆదిలోనే హంసపాదు.
మగపెళ్లివారిని ఆహ్వానించడానికి వియ్యాలవారిలో ముఖ్యులు ఎవరూ రాలేదు, అనామకులనెవరినో పంపారు అంటూ.....
అసలే తమని పెళ్ళి బస్సు నుండి సవినయంగా ఆహ్వానించుటా, విడిది గృహమునకు తొడ్కొనిపోవుట ఇత్యాది స్వాగత సన్నాహాల మీద మగపెళ్లివారికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చూశారూ...
భారతరత్న సాధించిన వాళ్ళు ఆ పురస్కారం అందుకోవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా తమకి అంత చేటు స్వాగతం కావాలని కోరుకోరు.
ఏ అమెరికన్ ప్రెసిడెంటో , ఆయన కూతురో వస్తే మన ప్రభుత్వం చేసే ఏర్పాట్లు, మన వెఱ్ఱి జనాలు చూపించే ఆత్రం, 'మీ రాకతో మా జన్మ ధన్యం అన్న భావన ' ఇవన్నీ కలగలిపపిన భావ & క్రియా ప్రకటన ఆడపెళ్ళివారిలో తమ ఆగమనం పట్ల వ్యక్తం అవ్వాలని ఆకాంక్షిస్తూ ఉంటారు మగపెళ్ళి వారు.
"మన వాడేమైనా శివధనస్సు విరిచాడా? , మత్స్య యంత్రం కొట్టాడా?, వాళ్ళంతా అంతేసి సంభ్రమాశ్చర్యాలు కురిపించడానికీ? మామూలుగా సమీకరణ పూర్వకంగా జరుగుతున్న పెళ్లేగా" అన్న ఆలోచన మగపెళ్ళివారికి ఉండదు.
దానికి తగ్గట్టుగా మగపెళ్లివారి బంధువులలో కొంతమంది ఇలాంటి వాటి కోసమే ఎదురుచూస్తూ ఎప్పుడెప్పుడు తొలి నిప్పురవ్వ విసిరి పెళ్ళిగొడవల కార్యక్రమానికి దీప ప్రజ్వలననం చేద్దామా అని ఎదురు చూస్తుంటారు.అంతే... మగపెళ్ళివారు అంటే ఆ మాత్రం గౌరవం లేదు ఆడపెళ్ళివారికి, సరిగా స్వాగతం కూడా చెప్పలేదు అని గొడవ మొదలౌతుంది.
ఇహ గొడవల అగ్నికి ఆజ్యం అందించే అత్తయ్యలు, అక్కయ్యలు,.... పెట్రోల్ పోసే పిన్నులూ పెదనన్నలూ ...ఆ అఖండ జ్వాల ఆరకుండా ఎగదోసే బామ్మలు, బాబాయిలూ ఉండనే ఉంటారు.
అంతే... ఇక మగపెళ్ళివారు పెళ్ళి మూడ్‌లో నుంచి పేలుళ్ళ మోడ్‌లోకి వెళ్ళిపోతారు.
.
ఇక ఆడపెళ్ళివారు చేసిన మిగతా ఏర్పాట్లు, వారిచ్చిన & ఇవ్వబోయే కానుకలు ఏవీ కనబడవు వారి కళ్ళకి.
పెళ్ళంతా హండ్రెడ్ వాలా, తౌజన్డ్ వాలా లాగా ... కాదు కాదు కరోడ్ వాలాలాగ ఆగకుండా పేలుతుంటారు.
అందువల్ల మనమందరం ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చెయ్యాలి.ఈ మగపెళ్లివారు తరలి వెళ్లే బస్‌లూ కార్లూ తదితర వాహనాల కోసం ప్రత్యేక తనిఖీ సిబ్బందిని చెక్‌పోస్ట్‌లు , టోల్ గేట్ల దగ్గర నియమించాలి. ఈ మగ పెళ్ళివారు తాము బయలుదేరిన సమయాన్ని ఆడపెళ్ళివారికి సరిగ్గా చెప్పరా, లేదా? ముందు/ వెనుక అయితే ఆ విషయం ఆడపెళ్ళివారికి తెలియ చేశారా ..? అన్న విషయాన్ని రూఢీ చేసుకున్న తర్వాతే ఆ సిబ్బంది మగపెళ్ళివారిని అనుమతించాలి. తద్వారా వివాహ వేడుకలకు పోయె బస్ విస్ఫోటక పదార్థాల తరలింపు బస్‌గా మారే ప్రమాదాన్ని అరికట్టి, ఆ వధూవరుల జీవితాలని ఆదుకోవాలి.
అయ్యిందా....
ఇక పెళ్ళి బస్సు వచ్చి ఆగాక అందులోనుండి, దాని వెనక ఇతర రవాణా సదుపాయాలను వినియోగించుకుని మొత్తం ఎంత మంది మగపెళ్లివారి తరపున పెళ్లికి వేంచేస్తారు అన్నది ఓ పెద్ద విషయం.
ముందుగా మాట్లాడుకున్నప్పుడే మగపెళ్ళివారు , మా తరపున ఇంతమందిమీ పెళ్లికి వస్తాము అని చెప్పడం, ఆ సంఖ్యకు అనుగుణంగా ఆడపెళ్లివారు విడిది, వంటల ఏర్పాట్లు చేసుకోవటం జరుగుతుంది. ఆ సంఖ్య ఓ పదో ,ఇరవయ్యో, నలభయ్యో అటూ ఇటూ అయితే పర్వాలేదు కానీ వందల్లోకి దూకితే మాత్రం చాలా కష్టం. అక్కడ విషయం ఎక్కువ మందికి పెడితే ఎక్కువ ఖర్చు అవుతుంది అని కాదు, పెళ్ళి ఏర్పాట్లకు కుదుర్చుకున్న వంటవాళ్లు, వాళ్ళ హెల్పర్ల స్థాయినుంచి విడిది, పెళ్ళిమంటపాల సైజుల వరకూ ముందనుకున్న సం ఖ్యే దిక్సూచి కావడంతో ఈ అనూహ్య అధిక సంఖ్య పెళ్ళి అంతటినీ అతలాకుతలం చేసేస్తుంది.
ఒకానొక పెళ్ళిలో ఏమయ్యిందట అంటే...
పెళ్లికి రెండు నెలల ముందే తమ తరపున ఎంత మంది వస్తారో పెళ్ళికొడుకు తండ్రి చెప్పడంతో తమతరపున చుట్టాల సంఖ్యని కూడా కలుపుకుని ఆ సంఖ్యలకు అనుగుణంగా పెళ్ళి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు ఆడపెళ్ళివారు.
అయితే ... భర్త తో కలిసి ఒక సంస్థ ద్వారా పల్లెటూళ్లలో సేవా కార్యక్రమాలను జీవన ' వ్యాపారంగా ' మలుచుకున్న పెళ్ళికొడుకు సోదరీమణికి పెళ్లికి 15 రోజుల ముందు ఓ అద్భతమైన ఆలోచన వచ్చింది.
"తామెలాగో ఆ సంస్థలో ఉన్నత పదవికోసం ఇతరులతో పోటీలో వెనక పడివున్నారు. తమ్ముడి పెళ్ళి అనే ఈ అవకాశాన్ని వాడుకుని ఊరిలో వారందరినీ పెళ్లికి తీసుకెళ్ళితే పెళ్ళి జరిగే ఊరెలాగో ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ కనుక అన్దరినీ ఆ ఊరు చూపించి మచ్చిక చేసుకుంటే తాము సంస్థా పరంగానే కాక రెప్రొడ్డున రాజకీయంగానూ ఉపకరిస్తుంద "ని ప్రణాళిక వేసింది.
అంతే.. తను స్పెషల్ గా శుభలేఖలు ప్రింట్ చేయించి మరీ ఊరంతా, పంచి ఊరు ఊరందరినీ ఆహ్వానించింది. టికెట్ల కోసం ఆ సేవాసంస్థ ఏ సేవా కార్యక్రమానికై కేటాయించిన నిధులు నొక్కేశారో లేక ఏ రైల్వే రాయితీ పథకాన్ని దుర్వినియోగం చేశారో కానీ కంపార్ట్మెంట్ల లెక్కన జనాలని నింపి పెళ్లికి తోలుకొచ్చింది ఆ మహాతల్లి. ఈ విషయం ఆడపెళ్ళివారికి కాదు కదా చివరికి తన తండ్రి, తమ్ముడికి కూడా తెలియనియ్యలేదు.. తల్లికి తెలిసినా కూతురు చేసే ప్రతీ తప్పునీ 'అరగిద్ద లో గిద్ద వేసి దాచే' ఆ తల్లీ చివరి క్షణం వరకూ వందలమందిని తన కూతురు తీసుకొచ్చే విషయం బయటకు పొక్కనీలేదు. తనలాంటి మరో ఆడపిల్ల, ఆమెని కన్నవారిని కష్ట పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడకుండా "మనకెందుకు, ఆడపెళ్ళి వాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు చస్తారని " నిస్సిగ్గుగా అనుకున్నారు ఆ సంఘసేవకురాలూ, ఆమెను తీర్చి దిద్దిన తల్లీనూ...
అంతమంది, అనుకన్నదానికన్నా వందల సంఖ్యలో అధికంగా పెళ్ళివారు వచ్చేటప్పటికి పాపం ఆ ఆడపెళ్లివారికి మూర్ఛ వచ్చినంత పనైంది. లెక్క ప్రకారం ఏర్పాటు చేసుకున్న విడిది గదులు సరిపోనంతమందీ... కళ్యాణ మంటపం పట్టనంతమందీ, వంటవాళ్లూ " "ఇంతమందికా! , మేము వండలేము, పో" మ్మనేంతమందీ.... జనాన్ని తెచ్చారాయే మగపెళ్లివారు!!!!
ఆ పెళ్లిళ్ల సీజన్లో , అదీ అసంఖ్యాక పెళ్లిళ్లు జరుగుతున్న ఆరోజు, అప్పటికప్పుడు కావాలంటే అంతమందికి వండేన్డుకు సరిపడా , గాస్ సిలిండర్లు, పాల పాకెట్స్, వంటవాళ్ళు, వాళ్ళ సహాయకులు దొరక్క నానా ఇబ్బంది పడి , ఆడపెళ్ళివాళ్ళలోని మగ వాళ్ళంతా రోడ్ల మీద వాటికోసం తిరుగుతూనే ఉన్నారు.
ఆడవాళ్లేమో కనీసం మంచి చీరలైనా కట్టుకోకుండా వంటహాల్ లో పడి కూరలుకొయ్యటం, చపాతీలు వత్తటం లాంటి వంట పనులు చేస్తూ ఉన్నారు.
ఇంతా చేస్తే.. 'అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకి సరిపోయింది' అని మగపెళ్లివారి తెచ్చిన ఆ విచిత్ర 'బంధువులు కాని బంధువులు' అంతా... చేసిన స్వీట్లు అన్నీ వంటగది దగ్గరకి వచ్చి మరీ పార్సెల్ లు కట్టిన్చుకుని తీసుకుపోయారు.
అసలు అన్నిటికన్నా హైలైట్ అంటే ఏమిటంటే..... తమ్ముడి పెళ్ళికి ఇంతమందిని తాను తీసుకొచ్చినందుకు తనకు ఎంతో ఖర్చయిన కారణం చూపుతూ దానికి పరిహారం పేరుతో పెళ్ళిలో పెళ్ళికొడుకుకీ పెళ్లికూతురుకీ వచ్చిన విలువైన బహుమతులను తరలించుకుపోయింది ఆ ఆడపడుచు.
ఇంత జరిగినా, ఈనాటికీ ఆ అత్తగారు పెళ్ళిలో ఏవేవో చిన్నచిన్న లోపాలు జరిగాయని కోడల్ని, ఆమె పుట్టింటి వారిని ఆడిపోసుకుంటూ ఉంటుంది, ఆ ఆడపడుచు తల్లిని ఎగదోస్తూంటుంది.
అత్తగార్లకీ , ఆడపడుచులకీ వ్యతిరేకంగా ఉన్న సామెతలు అన్నీ ఇలాంటి వారిని చూసే పుట్టాయనిపిస్తుంది.
అందువల్ల ఈ మగపెళ్ళివారు తరలించుకు వచ్చే జనసంఖ్య మీద కూడా నియంత్రణ విధించేందుకు ప్రభుత్వం ఒక విభాగాన్ని నియమిస్తే బాగుంటుంది అనిపిస్తోంది.
ఇక పెళ్ళి గొడవల్లో ముఖ్య పాత్ర వహించేది. భోజనాల తంతు!!!
ఎందుకంటే, పెళ్లికి వచ్చే ప్రతివారూ తాము వధూవరులను ఆశీర్వదించటానికి వచ్చామన్న విషయం మర్చిపోయి, తామేదో వంటల పోటీకి జడ్జిగా ఆహ్వానింపబడ్డామన్న భ్రమలో ఉంటారనిపిస్తుంది. మగపెళ్ళివారి బంధువుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు ఎవరికీ ఆ వంటలు నచ్చవు. అది వంట బాగోకపోవడం వల్ల కాదు, "తాము వండుకునే విధానానికి కొంచెం విభిన్నంగా ఉండడం వల్ల, " అన్న విషయం వారెవరికీ అర్థం కాదు. ఇంట్లో ఒక తల్లి దగ్గరే వంట నేర్చుకున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే కూర వండితేనే రెండు వేర్వేరు రుచులు వస్తాయి కదా! అలాంటప్పుడు ఊళ్లు, జిల్లాలు, ఒక్కోసారి రాష్ట్రాలు దాటి జరిగే పెళ్ళిళ్ళలో మనం గుత్తొంకాయలో కూరే పొడిలోనిపాళ్లు, ఆడపెళ్లివారి వంటవాళ్ళ పాళ్ళతో సమానంగా ఉండలేదని, అదేదో ఆడపెళ్ళివారు తమకి ఏరికోరి చేసిన అవమానంగా భావించి అఘాయిత్యంగా గొడవ చేస్తే ఎలా? అంతంత ఖర్చు చేసి పెళ్ళి చేసే వధువు తల్లిదడ్రులు తమ కుమార్తె వివాహంలో భోజనాలు బాగున్నాయని అందరూ మెచ్చుకోవాలని కోరుకుంటారు, తమకు తెలిసిన మంచి వంటవాళ్ల చేతనే వంట చేయిస్తారు కానీ వంటలు పాడు చేయమని తమంత తాముగా వంటవాళ్లకు పురమాయించరుగా??
మనం ఏదైనా విహార యాత్రలకో తీర్థ యాత్రలకో వెళ్ళినప్పుడు ఆ ఊరంతటికీ పేరుపొందిన హోటల్ కి వెళ్ళినా రుచుల తేడా వల్ల మనకు అక్కడి భోజనం మనకి నచ్చదు . అప్పుడు మనం ఆ భోజనం గురించే ఆలోచిస్తూ బుఱ్ఱ పాడుచేసుకుని, సాటివారితో గొడవ పెట్టుకుంటూ, యాత్ర అంతా పాడుచేసుకోము కదా? చూడ వచ్చిన విహార స్థలం మీదనో పుణ్యక్షేత్రం మీదనో మనసు లగ్నం చేసి, వాటికోసం ఈ భోజనపు ఇబ్బందిని పక్కన పెట్టేసి అడ్జస్ట్ అవుతాం కదా.. మరి అదే వివేకం మగపెళ్లివారమై పెళ్ళికి పోయినప్పుడు పెళ్ళి భోజనాల దగ్గర ఎందుకు చూపించము? మహా అయితే 4 పూటల భోజనం. సర్దుకు పోయి హుందాగా ప్రవర్తిస్తే....
4 పూటల మన సర్డుకుపోయే స్వభావం,
40 ఏళ్లు కోడలితో సత్సంబంధాలకు పునాది.
ఇక పెళ్ళిళ్ళలో జరిగే అన్ని రకాల గొడవలకూ కారణ భూతమై నిలిచేవి.... పాతకక్షలు. కక్షలు అంటే ఫ్యాక్షన్ సినిమాలలో చూపినట్లు కొడవళ్ళు, గొడ్డళ్ళలాంటి కక్షలే అనుకోవక్కర్లేదు.
ఇవి ఇంకో రకం....
అవి పెళ్ళివారు, వారి బంధువుల
మధ్య లో ఉండే అంతర్గత కక్షలు.
అప్పుడెప్పుడో ప్రస్తుత పెళ్ళి కొడుకు అమ్మో, అక్కో, బామ్మో... వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడేవో వంకలు పెట్టి, తమ బందువులని ఎగతాళి చేసి, చిన్నబుచ్చి, వచ్చి ఉంటారు.
సదరు బంధువులు ఆనాటి నుండి వీరిపై ప్రతీకారం తీర్చుకోడానికి పగపట్టిన పాముల్లా ఎదురుచూస్తుంటారు. " అబ్బో! వాళ్లబ్బాయి పెళ్ళి ఇంతకంటే ఘనంగా జరుగుతుందా, అదీ చూద్దాం" అని అనేసుకుని ఉంటారు. అంతర్గతంగా మాత్రం"జరగనివ్వం" అని ఓ మంగమ్మ శపథం చేసుకుని పైకి మాత్రం ఆప్యాయతానురాగాల ప్రదర్శన కొనసాగిస్తుంటారు.
ఎదురు చూసిన ఎన్నాళ్ళకో ప్రస్తుత పెళ్ళికొడుకుకి పెళ్ళిరోజు మూడుతుంది.
అంతే! సదరు బంధువులు కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంనాటి సైంధవుడులాగా చెలరేగి పోతారు.
ఆ రోజుకు వారివే బలపరాక్రమాలన్నీ మరీ! ఇంకేముంది,!
ఆడపెళ్ళివారిని అర్జునరహిత పాండవులను చేసి ఆటాడేసుకుంటారు. పెళ్ళిబస్సు దిగి, విడిదిలో చేరినప్పటి నుండీ అప్పగింతలు అయ్యి మళ్ళీ బస్సెక్కే వరకూ ఆడపెళ్ళివారు చేసిన ప్రతీ ఉపచారంలోనూ అపచారాన్ని వెతుకుతూ నానా యాగీ చేస్తుంటారు. ఎప్పుడైనా పెళ్ళికొడుకు తల్లి, తండ్రి, అక్క, అన్న లాంటి ప్రధాన పాత్రధారులకి ఆడపెళ్లివారిపట్ల సద్భావన కలిగి తెల్ల జండా ఊపేయబోయినా సదరు పగబట్టిన మంగమ్మ/ మంగయ్యలు శకుని పాత్రను పోషించి మరీ కళ్యాణమండపం లో కురుక్షేత్రం సీన్ ని పునరుర్థరిస్తారు. తద్వారా ఆ పెళ్ళిలో 'ఎవరికీ సంతోషం కలగగూడద'న్న లక్ష్యాన్ని సాధిస్తారు. పోనీ మిగిలినవారు ఎవరైనా వీరికి మంచి చెప్పి ఊరకుండబెడతారా అంటే నూటికి 99% మంది 'ఇల్లు కాలిపోతోందిరా ఈర్రాజు అంటే నాదేం పోయిందిరా నరసరాజూ' అనే రకమే.
మగపెళ్ళివారిలోనే ఇలాంటి శకునిలు ఉంటారనుకుంటే పొరపాటే..ఈ శకునిత్వం అన్నది సర్వవ్యాప్తిత్వం కలిగినది.
ఆడపెళ్ళివారిలోని పెళ్ళికూతురి దగ్గర బంధువులు అంతా మగపెళ్లివారికీ సేవలు చేస్తూ, వాళ్ళ అలకలు తీరుస్తూ, వాళ్ళతో మాటలు పడుతూ నానా ఆపసోపాలు పడుతుంటే 'ఇదే అదున"ని విజృంభిస్తారు ఆడపెళ్ళివారిలోని శకునిలు(ఆ. పె. శ.లు).
"అబ్బో! మేము ముందే అనుకున్నాము, ఆ జిల్లా వారితో చాలా కష్టం. వాళ్ళ తిండ్లే అలాంటివి, మనం పడలేం.."
"శుభలేఖ చూసినప్పుడే అనుకున్నాము, పోయి పోయి ఆ వంశం వాళ్ళకి ఇస్తున్నారేంటా పిల్లని అని, ఆ ఇంటిపేరు వాళ్ళు చాలా గయ్యాళివాళ్ళు, ఆడవాళ్ళని అయితే అసలు భరించలేము. "
"అయినా ఎవరూ దొరకనట్లు ఈ సంబంధం తెచ్చారేన్టమ్మా పిల్లకు? 'కాకి ముక్కుకు దొండపండు అన్నట్లు'!, అసలు మన అమ్మాయి ముందు వాళ్ళ అబ్బాయి ఏం బాగున్నాడని ఆ మగపెళ్ళివారికి అంత అహంకారం?"
ఇలాంటి మాటలన్నీ అంటుంటారు ఈ 'ఆ.పె.శ.' లు.
తాము అనేది పెళ్ళికూతురి ముందే అనీ, తెల్లవారితే ఆ అమ్మాయి జీవితాంతం కలిసి ఉండవలసిన వారి గురించి తన ముందే ఇలా మాట్లాడితే ఆ అమ్మాయి మనసు విరిగిపోయే ప్రమాదం ఉంది, అని తెలియక కాదు, తెలిసే మాట్లాడతారు.
ఎందుకంటే వీరు కూడా అంతర్గత కక్షల బాచ్కి చెందిన వారే కనుక!!!
సదరు పెళ్ళికూతురికి తమ కొడుకుని కాదని ఈ సంబంధం చేసుకుంటున్నారని కక్ష కట్టిన వారో....
లేదా...
ఆ పెళ్ళికూతురికి తాము తెచ్చిన సంబంధాన్ని తిరస్కరించారు అని ఈగో హార్ట్ చేసుకున్న వారో...
కాకపోతే...
అసలు తమ సహాయ సహకారాలు, తమతో సంప్రదింపులు అయినా లేకుండా ఇంత మంచి సంబంధం తెచ్చేసుకున్నారని ఓర్వలేని వారో...
లేకపోతే...
తమ కూతుళ్ళ కన్నా ఈ పిల్లకి మంచి సంబంధం వచ్చిందని ఈర్ష్య తో రగిలిపోతున్న వారో..
ఏదో ఒకటి...
అసూయతో పొరుగింటి గుఱ్ఱాన్ని గాడిదనే వాళ్ళే ఈ ఆ.పె.శ సంఘ సభ్యులు.
మొత్తానికి ఏదైతేనేం..
ఈ ఆడపెళ్ళివారి శకునిలు, మగపెళ్ళివారిలోని శకునిలు రగిలించిన చిచ్చులకి వధూవరుల మనసులు దగ్ధమై, ఆశలు భస్మమౌతాయి.
చివరకు హనీమూన్‌కి వెళ్ళినా...
ఈ మహానుభావులను తలచుకొని నొచ్చుకునేట్లు చేస్తాయి. కొండకచో ఆ చిచ్చులు రావణకాష్ఠాలలా మండుతూ ఆ వధూవరులు షష్ఠిపూర్తినాడు కూడా పొట్లాడుకునేట్లు చేస్తాయేమో అంటే అతిశయోక్తి కాదు.
"ఉన్న ఖర్మ చాలక ఉపకర్మ ఇంకోట"న్నట్లు, ఈ మధ్య పెళ్ళిళ్ళలో ఉన్న దరిద్రాలు చాలక మరో అపర దారిద్ర్యము మొదలయ్యింది.
కన్యాదాత ఊరికి వెళ్ళి పెళ్ళిచేసుకుని రావలసిన పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఆ పెళ్ళి తమ ఊరిలోనే తమకిష్టమైన చోట జరపాలని ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆంక్షలు జారీ చేయడం.
అదేమంటే తాము ఏదో దేవుడికి మొక్కుకున్నామనో,
తమ వైపు ముసలివారు అంత దూరం ప్రయాణం చేయలేరనో,
తమ ఊరిలోనే పెళ్ళి జరిగితేనే తమ బంధువులంతా వస్తారనో....
ఏవో దిక్కుమాలిన సాకులు చూపుతారు.
అసలు శాస్త్ర విరుద్ధంగా ఉండే మ్రొక్కులు మ్రొక్కమని ఏ శాస్త్రాలు, ఏ దైవాలు చెప్పాయి వీళ్ళకి?
ఏం? ముసలివారు , ఆడపెళ్లివారిలో మాత్రం ఉండరా?ఆ వంశం ఏమైనా అప్పుడే అంకురించిందా?
తమ బంధువులు అంతా పెళ్లికి రావాలని ఆడపెళ్ళి వారికి మాత్రం ఉండదా?
ఆ కన్యాదాత 'అలో లక్ష్మణా!' అనుకుంటూ అలవాటులేని ఊరు వచ్చి, అన్ని ఏర్పాట్లూ చేసుకుని పెళ్ళి చేయాలి. కట్న కానుకలూ తానే ఇవ్వాలి, పెళ్ళిఖర్చులూ తానే భరించాలి. ఎందుకంటే అది సంప్రదాయం కనుక,
కానీ తన కుమార్తె పెళ్లి తన స్వంతఊరిలో తనకు అనుకూలంగా ఉన్నచోట, అన్నీ తెలిసినచోట, తనకు సహాయపడే తనవారి మధ్యలో జరుపుకునేందుకు శాస్త్రం ఇచ్చిన హక్కుని మాత్రం వినియోగించుకోవడానికి మగపెళ్లివారి అనుమతి ఉండదు.
మగపెళ్ళివారు మాత్రం 'మా ఇంటికొస్తే ఏమి తెస్తావ్, మీ ఇంటికొస్తే ఏమి పెడతావ్'? అన్న లెక్కన ఉండి, పెళ్ళి తమ ఊళ్ళో జరిపించుకున్నా, తామే అతిథిసత్కారాలు అందుకోవాలని, అందులో లేశమంతైనా లోటు రాకూడదనీ నిర్దేశిస్తూ ఉంటారు.
ఇలాంటి పెళ్ళిళ్ళలో ఆ పెళ్ళికూతురి తల్లితండ్రులు పడే పాట్లు పగవానికి కూడా రాకూడనివి.
ఇవ్వన్నీ కట్నం సరిపోలెదు అని పీటల మీదనుండి పిల్లాడిని తీసుకు పోయే సినిమా సీన్ల పెళ్లిళ్ల గురించో,
ఈవెంట్ మేనేజర్‌కే కోట్లల్లో గుమ్మరించగల అంబానీ స్థాయి పెళ్లిళ్ల గురించో కాదు.
అన్నీ అనుకున్నట్లు అందినా , అహంకారాలు వల్ల అనవసరమైన గొడవలు జరిగే మధ్య తరగతి పెళ్లిళ్ల గురించి!!
ఏమైతేనేం?
'ఆవులూ ఆవులూ పొట్లడుకుంటే లేగదూడ ల కాళ్లు విరిగినట్లు'..
తమముందే తనవారూ, తన కాబోయేవారూ తమ పెళ్ళి మూలాన తగవులాడుకుంటుంటే చూసి తల్లడిల్లి పోతారు వధూవరులు.
ఎన్నాళ్లనుంచో కలలు కన్న పెళ్లిరోజు కలలను కల్లలు చేస్తూ గడిచిపోతుంది వారికి.
ఆ ఆందోళనలో బితుకు బితుకు మంటూ పెళ్ళి చేసుకుంటుంటే....
పురోహితుడు చెప్పినదంతా యాంత్రికంగా చేస్తుంటారు .....,
ఫోటోగ్రాఫర్లు చెప్పినప్పుడల్లా కృత్రిమంగా నవ్వుతుంటారు.. తప్ప...
సుముహూర్త వేళ జీలకర్ర బెల్లం పెట్టుకుని, ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకునే వేళ ఇరువురి అంతరంగాలలో ఎటువంటి తన్మయత్వమూ ఉండదు.
తాళికట్టే శుభవేళ ఇరువురి తనువులలో ఎటువంటి పులకింతా ఉండదు.
తలంబ్రాలు పోసుకునేవేళ సాటివాళ్లు చెప్పారని ఎగిరెగిరి పోసుకున్నా, ఇరువురి మనసులలో ఎటువంటి తుళ్ళింతా కలుగదు.
మహా అయితే బిందెల్లో ఉంగరాలు తీయమన్నప్పుడు మాత్రం, లోపలున్న కసి అంతా భాగస్వామి చేతులపై నఖ క్షతాలుగా తెలుతుందేమో!!
ఈ విధముగా...
ఎన్నాళ్ళో ఎదురుచూసిన, మున్ముందు ఎన్నేళ్లో మధుర స్మృతిగా జరుపుకో వలసిన పెళ్ళిరోజు చేదు జ్ఞాపకాలకు చిరునామాగా మిగులుతుంది.
కోటి ఆశలతో వివాహ జీవితం లోకి అడుగు పెట్టే వధూవరుల మనసులలో ఎంతో అలజడి రేపడమే కాక రేపటి వారి వివాహజీవితం మీద కూడా పెను ప్రభావం చూపుతుంది ఈ పెళ్ళితంతు.
తనవారిని, తననీ అన్నన్ని మాటలని, పెళ్ళిలో అంతంత గొడవలు చేసిన అత్తింటి వారి మీద ఏహ్యభావంతోనే అత్తింట కాలిడుతుంది నవ వధువు.
'కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం' అనే పరిస్థితిలో ఇరుక్కుపోయి, కోరి చేసుకున్న భార్యను ఓదార్చాలో, కనిపెంచిన వారికి సర్దిచెప్పాలో తెలియక, 'అడకత్తెరలో పొకచెక్కలా' నలిగిపోతుంటారుడు నవ వరుడు.
తత్ఫలితంగా...
ఎంతో ఆనందంగా సాగాల్సిన వారి వివాహజీవితపు తొలిరోజు లు వివాదాస్పదంగా విచారభరితంగా తయారవుతాయి.
అప్పటికీ శాంతించని కొందరు అత్తామామలు, ఆడపడుచులూ , మ.పె.శకునిలు,.. పెళ్ళి ఫోటోలు, వీడియోలు వచ్చాక అవి చూసేటప్పుడు కూడా ఆ కొత్తపెళ్ళికూతుర్ని పద్మవ్యూహంలో అభిమన్యుడినిలా ఒంటరిని చేసి, చుట్టుముట్టి, మాటల ఈటెలుతో కుళ్ళబొడుస్తారు.
ఆ దెబ్బతో వాళ్ళకి తమ పెళ్ళి ఫొటోలూ , వీడియోలూ చూసుకోవాలి అన్నా పెళ్ళినాటి ముచ్చట్లు తలుచుకోవాలన్నా భయంతో ఝడుపు జ్వరం పట్టుకుంటుంది.
కనుక,
రాబోయే కాలంలో కాబోయే పెళ్లిపెద్దల్లారా!!
అనవసరపు అహంకారాలతో పిల్లల జీవితాలలో ఆరని చిచ్చులు రాజేయకండి.
ఆడపడుచుల్లారా!!
కొత్త కోడలు వచ్చినంత మాత్రాన మీ పుట్టింట్లో మీ స్థానం ఎక్కడికీ పోదు. ఆ భయంతో ...
మీ సోదరుడి పెళ్ళిలో ఎక్కడ లేని తప్పులనూ ఎంచి, నానా గొడవలు చేసి, వీలైతే తర్వాత కూడా ఫోన్ల ద్వారా మీ తల్లి దండ్రులకు, వారి కోడలికి మధ్య మీరు సృష్టించిన అగాధాన్ని విస్తృత పరచి....
పుట్టింట్లో మీ స్థానాన్ని పదిలం చేసుకోవాలి అనే దుర్బుద్ధికి పోకండి. 'స్త్రీకి స్త్రీయే శత్రువు' అన్న నానుడిని పెంచి పోషించకండి.
రోజులూ, సంవత్సరాలూ గిర్రున తిరిగి రేప్రొద్దున మీ ఆడపిల్లల పెళ్లి సమ
పరోపకారార్ధమిదం శరీరం
"ఏంటమ్మా,అలా వున్నావు?" దిగాలుగా మొహం పెట్టుకు కూర్చున్న తల్లి వైపు చూస్తూ అడిగింది అప్పుడే వచ్చిన ప్రణతి .
"ఏముందమ్మా , మానవ జాతి ఈ శాపం నుండి ఎన్నటికి విముక్తి పొందుతుందా, ఈ ప్రపంచం ఎప్పటికి మామూలు అవుతుందా అని ఆలోచిస్తున్నా" అంటూ నిట్టూర్చింది ప్రణతి తల్లి సౌభాగ్యలక్ష్మి గారు.
" ఇప్పుడు ఏమైందమ్మా?"
"ఏముంది , ఇంకో కరోనా వార్త, మన సెక్రటరీ గారు లేరూ, వాళ్ళ అబ్బాయికి కరోనా సోకి, వారం నుండి హాస్పిటల్లో ఉన్నాడట. పాపం , పరిస్థితి బాగా సీరియస్ అవడంతో మధ్యలో ICU కి మార్చారట, "
"అదేంటి ,సెక్రటరీ గారి అబ్బాయికి కరోనా సోకడమేమిటి!! ,వాళ్ళు భయంకరమైన జాగ్రత్తపరులు కదా.. కరోనా వచ్చిన వారిని కిలో మీటర్ దూరంలో కూడా ఉండనీరు, కరోనా పేషెంట్‌ని ఫోన్లో చూసినా కంటిచూపుతోనే కరోనా వస్తుందేమో అన్నట్లుంటారు కదా ?" వెటకారంగా అంది ప్రణతి.
"ఏమోనే పాపం, ఎలా అంటుకుందో ఏమో కానీ పాడు కరోనా వాళ్ళింట్లో వాళ్లందరికీ సోకిందట . ఇంట్లో మిగిలిన వాళ్లంతా లక్షణాలు కనబడగానే టెస్ట్ చేయించుకుని మందులు వాడారుట, వాళ్లందరికీ దరిదాపు తగ్గిపోయింది కూడానట . కానీ ఈ అబ్బాయి మాత్రం టెస్ట్ చేయించుకోవడానికి కూడా భయపడి, టెస్ట్ కి "వెళతా వెళతా" అంటూ తనకు తెలిసిన మందులేవో తెచ్చుకుని వాడుతూ వారంరోజులపాటు తాత్సారం చేసాడట. చివరికి దగ్గు ఎక్కువై, ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని హాస్పిటల్‌కి తీసుకు వెళ్తే అప్పటికే ఊపిరితిత్తుల్లో న్యూమోనియా బాగా పెరిగిపోయిందట. ICU లో కూడా పెట్టారు పాపం " బాధగా అన్నది సౌభాగ్యలక్ష్మి గారు.
"ఒకరికి మనం ఉపకారం చేస్తే దేవుడు మన పిల్లలకి ఉపకారం చేస్తాడని బామ్మ ఎప్పుడూ తనకి చెబుతూ ఉండేది అని నాన్న అంటారు కదా!. అలాగే 'మనం ఒకరిని ఏడిపిస్తే మనకీ మన పిల్లలకీ కూడా ఏడుపే మిగులుతుంది' అని ,ఇప్పుడు ఈ సెక్రటరీగారిని చూస్తే అర్ధమవుతుంది" నిష్టురంగా అంది ప్రణతి.
"పాపం ,అంత కష్టంలో ఉన్న వాళ్ళని పట్టుకుని ఏం మాటలు అవి ప్రణతీ" అంది సౌభాగ్యలక్ష్మి గారు విసుగ్గా
"ఏం మాటలా, అసలీ మాటలు నీతో కాదు, ఆ సెక్రటరీకి ఫోన్ చేసి ఆయనతోనే అనాలని ఉంది,అప్పుడైనా ఆయనకి తెలిసి వస్తుందేమో..
మర్చిపోయావా?, 2 నెలల క్రితం మనకి కరోనా సోకినప్పుడు ఆ మహానుభావుడు మనల్ని ఎంత హింసించాడో!
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా సోకిందో ఏమో మనకి సోకింది, మనం నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనబడంగానే వెళ్లి టెస్టులు చేయించుకున్నాము. బాధ్యత కల పౌరులుగా, అందరూ జాగ్రత్తగా ఉండాలని, అపార్ట్మెంట్ సెక్రెటరీ కదా అని ఆయనకి తెలియచేసాము. కష్టంలో ఉన్న సాటి మనిషిపట్ల మానవత్వం తో ప్రవర్తించాల్సిన ఆ పెద్దమనిషి ఏం చేసాడు అప్పుడు? వెంటనే అపార్ట్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టి మనం తక్షణం మన ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లాలని తీర్మానం చేయించాడు, కమిటీ మెంబెర్స్ అందరితోనూ కాన్ఫరెన్స్ కాల్స్ చేయించి మనల్ని వెళ్లిపొమ్మని వత్తిడి చేసాడు. "ఈ పరిస్థితిలో మేము ఎక్కడికి వెళ్లలేము , మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటీన్ లో ఉంటాము, మా ఫ్లాట్ డోర్ తెరిచి బయటకు కూడా రాము" అని మనం గట్టిగా చెప్తే...
మనమేదో కావాలని వెళ్లి కరోనాని కావలించుకున్నట్లు .."ఆ మాత్రం జ్ఞానం లేదా , జాగ్రత్తగా ఉండలేరా" అంటూ నానా దుర్భాషలాడాడు..
ఏదో దేశద్రోహులనో , బాంబు పట్టుకు తిరిగే ఉగ్రవాదులలాగానో, లేకపోతె హంతకుల్లానో మనని ట్రీట్ చేసి, అపార్ట్మెంట్లో అందరూ మనలని వెలివేసేలా చేసాడు.
చివరికి పాల ప్యాకెట్లు , కూరగాయలు కూడా అందకుండా చేసాడు.
ఈయన మాటలకి భయపడి అపార్ట్మెంట్ లో మనకి సహాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా దూరం నుంచైనా మన మొహం చూడటానికి భయపడ్డారు, మన ఫ్లోర్ లో వాళ్ళు అందరూ తలుపులు తాళాలు వేసి బంధువుల ఇళ్ళకి పారిపోయారు.
మీ ఇద్దరికీ ఇబ్బంది పెరిగి, హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి అంబులెన్సుని పిలిపిస్తే , ఆ సెక్రటరీ హాస్పిటల్ అంబులెన్సు అపార్ట్మెంట్ లోపలి కి రాకూడదని గేట్ బయటే ఆపించినప్పుడు అంత జ్వరం, నీరసం తో అపార్ట్మెంట్ గేట్ దాకా నడవడానికి మీరెంత నరకయాతన పడ్డారు?
పైగా మేము ఉండే అపార్ట్మెంట్ సెక్రటరీకి కూడా ఫోన్ చేసి మన విషయం చెప్పి, ఇటూ అటూ రాకపోకలు ఉండకూడదని ఆంక్షలు విధింప చేసాడు. మా ఆయనకి , పిల్లలకు, కరోనా సోకకపోయినా , వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా.. వాళ్ళ పట్ల కూడా అక్కడి వాళ్ళు అదే వైఖరి చూపడానికి కారణమయ్యాడు ఈ సెక్రెటరీ.
"ఓప్రక్క అన్నయ్య ఉద్యోగ రీత్యా విదేశంలో ఉండి, మీకోసం రావాలన్నా రాలేక అక్కడ ఇరుక్కు పోయాడు. మీ ఇద్దరూ హాస్పిటల్ లో ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఇంట్లో~ . మీ అంత కాకపోయినా నాకూ కరోనా వల్ల చెప్పలేనంత నీరసం కదా! సరిగ్గా తినడానికి తాగడానికి కూరలు , పాలు కూడా రానేలేదు. వెళ్లి తెచ్చుకోవడానికి నాకా ఓపిక ఉండేది కాదు. బయట నుండే ఇచ్చి వెళ్లిపోతానని మా ఆయన బ్రతిమాలినా ఇద్దరు సెక్రెటరీలు కలిసి, అటు వాళ్ళు ఇటూ, ఇటు వాళ్ళు అటూ రావద్దని ఆంక్షలు. అలాంటప్పుడు నేను మానసికంగా ఎంత కృంగిపోయానో తెలుసా ?
చివరికి నేను లిఫ్ట్ లో ఎక్కకుండా మన ఫ్లోర్లో లిఫ్ట్ ఆగకుండా చేయించాడు. మీకు అవసరమైనవి ఇవ్వడానికి హాస్పిటల్‌కి రావాలంటే ఇంత నీరసంలోనూ మెట్లెక్కీ దిగీ రావాల్సిందే. ఎంత ఏడుపొచ్ఛేదో అప్పుడు!
పైగా రోజూ ఫోన్ చేసి , ఒక్క మంచి మాట అయినా మాట్లాడక పోగా "ఇంకా ఎన్నాళ్ళు? ఎప్పుడు నెగటివ్ వస్తుంది నీకు" అని సాధించేవాడు.
అందరూ జాగ్రత్తగా ఉండాలి, సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించాలి, మాస్క్ లు పెట్టుకోవాలి, చేతులు శానిటైజ్ చేసుకోవాలి, కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టాలి . అది నేనూ ఒప్పుకుంటాను .కానీ ఖర్మ కాలి కరోనా వఛ్చిన వారి పట్ల అంత అమానుష ప్రవ్రుత్తి ఏంటమ్మా అసలు? నేను గట్టిదాన్ని కనుక తట్టుకున్నా, ఇంకెవరైనా బలహీన మనస్కులు నా స్థానంలో ఉంటె కరోనా వల్ల కాదు, ఈ కర్కోటకుడి వల్ల పోయేవాళ్లు అసలు."
నువ్వంటూ ఉంటావుగా అమ్మా 'ఎరిగి ఎరిగి చేసిన పాపాన్ని ఏడ్చి ఏడ్చి పోగొట్టుకోవాలి 'అని , అందుకనే ఆయనకి ఇలా అయ్యింది! కచ్చగా అంది ప్రణతి.
"తప్పు ప్రణతీ ,అలా అనకూడదు, ఆ సెక్రెటరీ గారు జ్ఞానం లేక తప్పు చేసాడే అనుకో , భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చ్చాడు కదా, మళ్ళీ మనం ఆ సెక్రెటరీ గారితో అజ్ఞానం లో పోటీ పడడం ఎందుకు?. మనకి ద్రోహం చేసే వాడైనా సరే, వాడూ సుఖంగా ఉండాలని కోరుకోవడమే మన ధర్మం నేర్పిన "సర్వ్ జనా సుఖినోభవంతు " అన్నదాని సారం. అందరి తప్పొప్పులు బేరీజు వేయడం, ఫలితాలు నిర్ణయించడం, మన పని కాదు, అది భగవంతుడి పని" .
తల్లీ కూతుళ్ళ సంభాషణను అక్కడే సోఫాలో కూర్చుని వింటున్న ప్రసాదరావు గారు తన ఫోన్లో ఏదో వాట్సాప్ మెస్సేజ్ వచ్చినట్లు శబ్దం రావడంతో ఫోన్ తీసుకుని మెస్సేజ్ చదివి, 'నువ్వూ చదువు' అన్నట్లు ప్రణతి చేతికి ఫోన్ ఇచ్చ్చారు.
"ఐ సి యూ లో కరోనా తో పోరాడుతున్న మా అబ్బాయి చికిత్స కొరకు బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా అత్యవసరంగా కావలెను, 10 _ 12 వారాల క్రితం కరోనా సోకి , కోలుకుని , గత నెల రోజులుగా ఎటువంటి లక్షణాలు లేని బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ వారు దయ చేసి ప్లాస్మా డొనేట్ చేసి మా కుమారుడి ప్రాణాలు రక్షించ ప్రార్ధన . ఈ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా దొరకడం చాలా కష్టంగా ఉన్నందున, మా అబ్బాయికి ప్లాస్మా డొనేట్ చేయ గలిగిన వారు వెంటనే స్పందించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను." అపార్ట్మెంట్ సెక్రటరీ నుండి వచ్చిన మెసేజ్ అది.
"అయ్యో !, అంత సీరియస్ గా ఉందా పాపం, ప్లాస్మా డొనేషన్ అడుగుతున్నారు" అనుకుంటూ పైకే అనేసారు ప్రసాదరావు గారు,.
"ఏమయ్యింది?" అని అడిగిన సౌభాగ్యలక్ష్మి గారికి మెసేజ్ విషయం వివరించారు ప్రసాదరావు గారు .
"ఇంతకీ ప్లాస్మా డొనేషన్ అంటే ఏంటండీ ?" అడిగింది సౌభాగ్యలక్ష్మి గారు .
"నేనూ ఈ మధ్యే పేపర్ లో చదివాను భాగ్యం, మన శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, ఆ ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షించడానికి శరీరంలోని రక్షణవ్యవస్థ కొన్ని రోగ ప్రతి రోధకాలని తయారు చేస్తుంది . వాటినే యాంటీ బాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ వల్లనే మన శరీరం కరోనా ఇన్ఫెక్షన్తో పోరాడి కోలుకోగలిగింది. కొంతమందిలో ఇన్ఫెక్షన్ బలం ఎక్కువైనప్పుడో లేక ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తీ సరిగ్గా లేనపుడో ఆ వ్యక్తి శరీరం సరిగా యాంటీబాడీస్ తయారు చేసుకోలేక పోతే , ఇన్ఫెక్షన్ నుండి కోలుకొని శరీరంలో యాంటీబోడీస్ తయారయి ఉన్న వారి శరీరంలోని ప్లాస్మా సేకరించి, రోగి శరీరంలోకి ఎక్కించడం ద్వారా బయటినుండి ఆ రోగులకు యాంటీబోడీస్ సప్లై చేస్తారు. అలా వారి శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడడానికి, తద్వారా ప్రాణాలు రక్షించబడడానికి ఉపయోగపడేదే ప్లాస్మా డొనేషన్.కాకపోతే రక్త మార్పిడి లాగానే ఈ ప్లాస్మా మార్పిడి కూడా వారి వారి బ్లడ్ గ్రూప్‌లను బట్టి వారికి సరిపడే బ్లడ్ గ్రూప్ ఉన్న దాతల నుండి జరగాల్సి ఉంటుంది. " వివరించారు ప్రసాద రావు గారు.
అంతా విని అర్ధం చేసుకున్నాక , " అయితే ఇప్పుడు ఆ అబ్బాయి బ్లడ్ గ్రూప్ కూడా బి నెగటివ్ ఆ !" అంది సౌభాగ్యలక్ష్మి గారు ప్రణతి వైపు చూస్తూ...
"ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు?" అనుమానంగా అడిగింది ప్రణతి.
"అదే ప్రణతీ, మనిద్దరి బ్లడ్ గ్రూప్ అదే కదా, పైగా ప్లాస్మా డొనేషన్‌కి వాళ్ళు అడిగిన వివరాలు అన్నీ మనకి సరిపోతాయి. మనిద్దరం ఇప్పుడే వెళ్లి ఆ అబ్బాయికి ప్లాస్మా డొనేట్ చేసి వద్దాం ప్రణతీ " ఆత్రంగా అంది సౌభాగ్యలక్ష్మి గారు.
"ఏంటమ్మా, నువ్వనేది? ఆ దుర్మార్గుల కోసం మనం ప్లాస్మా డొనేట్ చెయ్యాలా? వాళ్ళు చేసిన పనులకు ప్లాస్మా డొనేషన్ సంగతి అటుంచు, వాళ్ళ మొహం చూడాలన్నా నాకు అసహ్యం!.నేను అలాంటి వారికి ఛస్తే సహాయం చేయను" మొండిగా అంది ప్రణతి.
"సరే పోనీ నువ్వు చెయ్యకపోతే నేనుచేస్తా" అంటూ ప్రసాదరావు గారి చెతిలొనుంచి ఫోన్ తీసుకుని ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది సౌభాగ్యలక్ష్మి గారు.
"ఏంటి నాన్నా అమ్మ, పోయి పోయి అలాంటి వాళ్లకి సహాయపడతాను అంటుంది? వాళ్ళ మనని ఎంత బాధ పెట్టారు? తాగడానికి కనీసం గుక్కెడు పాలు లేకుండా చేసాడాయన , ఇప్పుడు వాళ్ళ కోసం ఈ 55 ఏళ్ళ మనిషి హాస్పిటల్ కి వెళ్తుందా, దాని వల్ల తనకేదైనా ప్రమాదం జరిగితే?"
"నువ్వు కంగారుపడకు ప్రణతీ , అన్నీ జాగ్రత్తగా కనుక్కునే చేద్దాం" అని ప్రసాద రావు గారు అనేంతలో సౌభాగ్యలక్ష్మి గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ.., "సరేనమ్మా ఉంటా మరి" అని ఫోన్లో వ్యక్తికి చెపుతూ వచ్చింది.
"ఇప్పుడే మా పెద్దక్క కూతురు ప్రవీణతో మాట్లాడా , తను డాక్టర్ కదా, అందుకే ఈ విషయాలన్నీ వివరంగా ప్రవీణని కనుక్కున్నా. 18 నుండి 69 సంవత్సరాల మధ్య వాళ్ళు ,కరోనా వచ్చి తగ్గి, నెల రోజులుగా ఎటువంటి వ్యాధి లక్షణాలు లేనివాళ్లు, HIV / హెపటైటిస్ లాంటి ఇతర ఇన్ఫెక్షన్స్ లేని వాళ్లు , బ్లడ్ కాన్సర్లు లేని వాళ్లు చక్కగా ప్లాస్మా డొనేట్ చేయొచ్చట. "
"మరి తమ ప్లాస్మా వేరేవాళ్లకి ఇచ్చేయడం వల్ల ఆ డొనేషన్ చేసిన వాళ్లకి ఏమీ ఇబ్బంది ఉండదా?"
"ఏమీ ఇబ్బంది ఉండదట , మనం ఇచ్చిన ప్లాస్మా కూడా మన శరీరంలో మళ్ళీ వెంటనే తయారయి పోతుందట , ఇప్పుడు మన శరీరంలో ఉన్న యాంటీబోడీస్ ద్వారా మనకు రక్షణ కవచం ఉంటుంది కనుక ఈ డొనేషన్ కోసం మనం హాస్పిటల్‌కి వెళ్లినా ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదట .
అంటూ ప్రణతి వైపు తిరిగి ,
"చూడు ప్రణతీ, నువ్వు చేస్తావో లేదో నీ ఇష్టం, పెద్ద పిల్లవి , నిన్ను నేను బలవంతం చేయను, నేను మాత్రం నాద్వారా ఒకళ్ళకి ప్రాణదానం చేసే అవకాశం ఒక్క శాతం ఉన్నా , ఆ అవకాశాన్ని వదలను. అలా చేస్తే రేపొద్దున దణ్ణం పెట్టుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్లినప్పుడు ఆయనకి నా మొహం చూపించలేను కూడా.." కొంచెం ఘాటుగా,నిక్కచ్చిగా అన్నది సౌభాగ్యలక్ష్మి గారు.
"చూడు నాన్నా, నేను ఆ సెక్రెటరీ లాంటి చెడ్డవాళ్లకి సహాయం చెయ్యొద్దన్నానని , నేనేదో ఎవరికీ సహాయమే చేయనిదానిలా నన్ను ఎంత చెడ్డగా సృష్టిస్తోందో అమ్మ! ,....మనల్ని హింసించిన వాళ్ళ కోసం మనం అంత చెయ్యాలా? ఏనాడైనా వాళ్ళు మనకి చీమ తలకాయంత సహాయం అయినా చేశారా? పోనీ .రేపొద్దున మళ్ళీ మనకి ఏదైనా అవసరం వస్తే మనకి ఉపకారం చేసే రకాలా వాళ్లు ? సహాయం చేస్తే మంచి వాళ్లకి చెయ్యాలి కానీ సాటి వారిని అమానుషంగా హింసించే అలాంటి వారికా?
"ప్రణతీ నీ బాధ నాకు అర్ధమయ్యింది , కానీ నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా" అంటూ గంభీరంగా గొంతు సవరించుకున్నారు ప్రసాదరావు గారు,
"ఈ విశ్వంలో జరిగే ఉపకార ప్రత్యుపకారాలు అనేవి ఎప్పుడూ 'one to one ' అనే ఫార్ములా ప్రకారం నడవవు తల్లీ . నువ్వు X కి సహాయం చేస్తే నీకు Y సహాయం చేస్తారు. నువ్వు సహాయం చేసిన X , ఇంకెవరో Z కి సహాయ పడతారు.ఈ విశ్వం అలాగే సంతులనమవుతుంది తల్లీ.మనకి సహాయం చేసిన వారికే మనం తిరిగి సహాయం చేయాలి అనో మననుండి సహాయం పొందిన వాళ్ళు తిరిగి మనకు సహాయం చేసి తీరాలి అనుకుంటేనో ఈ సృష్టి నడవదు .
నువ్వూ సైన్స్ లో చదువుకున్నావు కదా 'This universe doesn't saty constant. it keeps on changing through energy exchange " అని. ,ఎనర్జీ,' అంటే శక్తి అనేది ఎక్కువ శక్తి ఉన్న చోట నుండి తక్కువ శక్తి ఉన్నచోటకి నిరంతరం ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఈ విశ్వంలోని ప్రతీ వ్యవస్ధ ఆ సిధ్ధాంతం మీదే ఆధారపడి ఉంటుంది. ఆ శక్తి మార్పిడి సిధ్ధాంతంలో కూడా మనం అనుకునే ' one to one ' ఫార్ములా ఉండదు.
మానవాళి విషయంలో ఆ శక్తీ మార్పిడికే 'పరోపకారం 'అనే పేరుతో మార్గదర్శనం చేశారు మన పెద్దలు. నువ్వు పరులకి చేసే ఏ సహాయం అయినా సరే ,అది డబ్బు రూపంలో అయినా, జ్ఞానం రూపంలో అయినా , మాట సాయం రూపంలో అయినా ఏదీ కుదరకుంటే మనకు భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఉపయోగించడం ద్వారా ఇతరులకు ఉపయోగపడడం అయినా... అంటే.. ఉదాహరణకు ఈ రక్త దానం , నేత్ర దానం, ఈ ప్లాస్మా దానం..ఇవన్నీ energy transfer లే !
అందుకే ప్రతీ మనిషీ పరోపకారం చేసే తీరాలీ, "పరోపకారార్ధ మిదం శరీరం " అని చిన్నప్పటి నుండీ మనకి నూరిపోస్తారు..
అయితే ఈ పరోపకారం అనే పదంలో ఉన్న 'పర ' శబ్దం చూసావా.. దాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఆ 'పర ' శబ్దం లోకంలో ఉన్న అన్ని జీవులకీ వర్తిస్తుంది. మనకి ఇష్టమైన వారికో మనకి ఇంతకు పూర్వం సహాయపడ్డ వారికో లేక మనవాళ్ళకో మాత్రమే సహాయం చేస్తానంటే అది పరోపకారం అవ్వదు.
మనకు ఇష్టం లేని వారికీ, మనకు ఏ మాత్రం తెలియని వారికీ, మనకి ప్రత్యుపకారం చేస్తారు అన్న ఆశ లేని వారికీ , చివరకు మనకి అపకారం చేసిన వారికి కూడా సహాయపడడం అనేదే పరోపకారం.
ప్రకృతి నుండి నిరంతరం రకరకాలుగా లబ్ది పొందుతున్న మనం, మన సాటి జీవులకు మనకు చేతనైనంత పరోపకారం చేస్తూ ఉండడమనేదే ఈ ప్రకృతి పట్ల మనం చూపగలిగిన కృతజ్ఞత.
అలాంటి పరోపకార గుణం మానవులందరిలో పెరిగినప్పుడే మానవాళికి ఈ కరోనా లాంటి శాపాలనుండి విముక్తి.
అప్పుడే సాటి మానవుల పట్ల, పంచ భూతాల పట్ల మనం చేసిన అనేకానేక పాపాలకు నిష్కృతి.
ఇక వేరే వాళ్ళు మన పట్ల చేసిన అపకారాలు అంటావా..... వాళ్ళని పెద్ద మనసుతో క్షమించే అంత ఎత్తుకి నువ్వు ఎదిగినపుడు ... నీ ఔన్నత్యం ముందు ఆ తప్పులు పిపీలికాలు అయిపోతాయి. "
అని చెప్పి నవ్వుతూ ప్రణతి వైపు చూసారు ప్రసాదరావు గారు. అర్ధమయిందన్నట్లు తలపంకించింది ప్రణతి.
" ప్రణతీ , నేను మీ నాన్నగారు చదివినన్నిపుస్తకాలు , ఆధ్యాత్మిక గ్రంధాలు చదవలేదు కానీ, నాకు తెలిసినది చెప్తాను విను.
మనం పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్లి పళ్ళ కోసమని చెట్టుని కర్రతోనో, రాళ్ళతోనో కొడతాము . అయినా ఆ పళ్ళ చెట్టు మనకి పళ్లే ఇస్తుంది తప్ప మనని తిరిగి కొట్టదు కదా!.
మనం కూడా అందరికీ ఉపకరించే పళ్ళ చెట్టులా ఉండాలి కానీ మనసంతా వ్యతిరేక భావాలు నింపుకుని ముళ్లకంపలం కాకూడదు."
"ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ."
"ఈ పద్యం నేను చిన్నప్పుడు నేర్చుకున్నది .. దాని సారాంశం సాధ్యమైనంతవరకూ నేను ఆచరిస్తాను.
నేను ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల ఆ అబ్బాయికి ఉపకారం జరిగే అవకాశం ఒక్క శాతం ఉన్నా సరే , అలా చేయని నాడు నన్ను నేను క్షమించుకోలేను." అన్నది సౌభాగ్యలక్ష్మి గారు.
ఆవిడ మాటలు విన్న ప్రణతి కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లింది.
"చూశావా ప్రణతీ , నేను ఎక్కువ పుస్తకాలు చదవలేదు అంటూనే ఇందాకటి నుండి నేను చెప్పిన మాటల సారాంశాన్ని ఒక్క ముక్కలో ఎంత సులభంగా చెప్పిందో మీ అమ్మ !" పెద్దగా నవ్వేశారు ప్రసాదరావు గారు , వాతావరణాన్ని తేలిక చేయడానికి .
"నిజమే నాన్నా మీ ఇద్దరూ నాకు అర్ధం అయ్యేటట్లు ఎంతో బాగా చెప్పారు. నేనే, ఎవరో ఏదో
చేశారని, తల్లిదండ్రులు నేర్పిన విద్యనీ, భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్నీ విస్మరించి మాట్లాడాను.
మీరు నా కళ్ళు తెరిపించారు , ఇప్పుడే వెళ్లి ప్లాస్మా డొనేట్ చేసి వస్తాను " అన్నది ప్రణతి.
"నేను కూడా వస్తా ప్రణతీ, నా ప్లాస్మా కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడొచ్చు కదా" అన్నది సౌభాగ్యలక్ష్మి గారు.
"మీ ఇద్దరితో పాటు నేనూ కరోనా విజేతనే కదా! నేనూ ప్లాస్మా డొనేట్ చేస్తాను .కాకపోతే నాది కామన్ బ్లడ్ గ్రూప్ . రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ఎంతమందికి ప్లాస్మా అవసరం అవుతుందో ఏమో . అన్ని గ్రూపుల వాళ్లు ప్లాస్మా డొనేట్ చెయ్యాల్సిందే.
అసలు నేనేమంటా అంటే...
కరోనా నుండి కోలుకుని పునర్జీవన వరాన్ని ప్రకృతి నుండి పొందిన ప్రతి ఒక్కరూ ఆ ఋణాన్ని తీర్చుకునే మార్గమే ఈ ప్లాస్మా డొనేషన్."
"అవును నాన్నా, బాగా చెప్పారు... ఏది, ఒక్కసారి మీ ఫోన్ ఇటివ్వండి. సెక్రటరీ గారికి ఇప్పుడే మేము ప్లాస్మా డొనేట్ చెయ్యడానికి వస్తున్నాము అని మెసేజ్ పెడతాను" అంటున్న ప్రణతికి నవ్వుతూ ఫోన్ అందించి , సౌభాగ్యలక్ష్మి గారి వైపు ఆనందంగా చూసారు ప్రసాదరావు గారు.
సూపర్ వుమన్ - గాడిదగుడ్డేం కాదూ!
"ఈ ఒక్కరోజూ పనులేవీ చెప్పకుండా ఇంకొంచెంసేపు పడుకోనీవా..ప్లీజ్..."అలారం మోతకు , నిద్రాభంగం అయిన రాధికని బ్రతిమిలాడసాగాయి, అలసిపోయిన ఆమె మనస్సు, బడలిక తీరని శరీరమూనూ.
అసలే అర్ధరాత్రి 2గంటల వరకూ ఆఫీస్ పని చేసీచేసీ అలసిపోయిందేమో శరీరం,మనసు చెప్పిన మాట విని ఇంకొంచెం సేపు పడుకుందామని రాధిక అనుకుంటుండగానే ఎప్పుడు మొదలుపెట్టిందో ఆ రోజు చెయ్యవలసిన పనులన్నీ ఒక్కొక్కటీ గుర్తు చెయ్యడం మొదలుపెట్టింది ఆమె మెదడు.
"అమ్మో! ఆఫీస్ కి త్వరగా వెళ్లకపోతే ఎలా?ఈ రోజే ఖచ్చితంగా పూర్తి చెయ్యమని బాస్ చెప్పిన పని ఇంకా అవ్వలేదు. అసలే అప్రయజల్ దగ్గరలో ఉంది, ఇలాంటప్పుడు బాస్ కి కోపం వస్తే.. నా ప్రమోషన్ ఆగిపోతుంది.ఇప్పటికే ఉద్యోగంలో నేను ఎంతో వెనకబడి ఉన్నాను.. నాతో చదివిన ఆదిత్య, రమేష్ నా కంటే ఉన్నతస్థాయిలో ఉన్నారు, వాళ్ళకంటే ముందు పాస్ అయ్యీ, ఎక్కువ మార్కులు వచ్చి కూడా నేను వెనకబడి ఉన్నాను. రెండు డెలివరిలప్పుడూ అనవసరంగా ఒక్కో సంవత్సరం ఇంట్లో కూర్చుని సమయం వృథా చేశానేమో .. లేకపోతే ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని.
" మా అమ్మాయి అయితే మెటర్నిటీ లీవ్ అయిన మరుసటి రోజే ఆఫీస్ కి వెళ్ళింది, ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు నీలాగా" అని అత్తయ్యగారు దెప్పిపొడిచారు కూడా , అలా ఎలా మేనేజ్ చెయ్యగలిగిందో పెద్దవదిన గారు, తనకి వీలవ్వలేదు." దిగులు పడింది రాధిక.
"మర్చిపోయా, ఈ రోజు స్కూల్లో యశ్వన్త్ కి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది, ఆఫీస్ మధ్యలో వీలు చేసుకుని స్కూల్ కి వెళ్ళాలి. అసలే అల్లరి వెధవ, ఏమీ కంప్లైంట్స్ రాకపోతే బాగుండును. ఈ సారి పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో వాడికి? క్రిందటి సారే టీచర్ గట్టిగా చెప్పింది, "మీ అబ్బాయి తెలివైన వాడే , మీరే కొంచెం ఎక్కువ శ్రద్ద పెట్టి బాగా చదివించాలి "అని.. వీళ్ళ క్లాస్ లో అభినవ్ వాళ్ళ అమ్మ వాడి చదువు సంగతి బాగా చూసుకోవడమే కాక ఆ అబ్బాయిని దగ్గరుండి సంగీతం క్లాస్‌కి, చెస్ క్లాసుకి, అబాకస్ క్లాసుకి తీసుకెళ్తుందిట, అందుకే ఆ అబ్బాయి అన్నిట్లో ఫస్ట్ వస్తాడు, ఏమిటో నేనే పిల్లలకి సరైన న్యాయం చేయలేకపోతున్నాను. నా శ్రద్ద లోపించబట్టే పిల్లాడు క్లాస్ ఫస్ట్ రావట్లేదు " బాధపడింది రాధిక .
"బాబోయ్ , ఆలస్యం అయిపోతోంది, లేచి స్నానం చేసి వంట చేయాలి, దానికన్నా ముందుగా బయట ముగ్గు వేయాలి, నిద్ర లేవంగానే వాకిట్లో ముగ్గు వేయకపోతే చాలా తప్పని అమ్మ అరుస్తుంది. ప్రొద్దున్నే ఈ నొప్పుల శరీరాన్ని వంచి ముగ్గు వేయాలంటే కీళ్ళు అన్నే ఎక్కడికక్కడ విరిగిపోతాయేమో అనిపిస్తుంది, అయినా 38 ఏళ్లకే ఇలా అవడం నాదే తప్పు, ఆ కరీనా కపూర్, మలైకా అరోరా, శిల్పాశెట్టి వీళ్లంతా పిల్లల పుట్టాక కూడా ఎంత ఫిట్ గా ఉన్నారో? ముందునుంచే అందరిలా చక్కగా యోగ, ఎక్సరసైజ్లు చేసి ఉంటే బాగుండేది.
మొన్న శ్రీకాంత్ వాళ్ళ ఆఫీస్ పార్టీకి వెళితే వాళ్ళ ఆఫీసులో అమ్మాయిలు అందరూ స్లిమ్‌గా, ఫిట్ గా వుండి మంచిమంచి మోడరన్ డ్రెస్సుల వేసుకొస్తే...వాళ్లందరిలో నేనే ఫిట్నెస్ లేక, ఏ డ్రెస్సు ఫిట్ కాక, చీర కట్టుకుని ఒక అప్పలమ్మలా కనిపించాను . పాపం శ్రీకాంత్ కి అందరిలో ఎంత అవమానంగా అనిపించి ఉంటుందో నావల్ల?
పిల్లలు కూడా "అమ్మా ఆ సబ్బు యాడ్ లో ఆంటీచూడు, పెద్ద పిల్లలకి మమ్మీ అయినా కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందొ, నువ్వుకూడా లావు తగ్గి అలా అయిపోమ్మా" అని గొడవ.నేనిలా ఉంటే పాపం వాళ్ళకీ చిన్నతనమే.." దుఃఖం కలిగింది రాధికకి.
కనీసం చిన్నప్పుడు నేర్చుకున్న కూచిపూడి నృత్యం సాధన అన్నా కంటిన్యూ చేస్తే బాగుండేది.
నాతోపాటు కలిసిడాన్స్ నేర్చుకున్న రాగిణి ఎంతో పెద్ద డాన్సర్ అయ్యి,మొన్న తిరుపతిలో నాదనీరాజనం ప్రోగ్రాంలో కూడా డాన్స్ చేసింది.నేను కూడా అలా టీవీ ల్లో కనిపిస్తూ కీర్తిప్రతిష్టలు సాధిస్తే అమ్మానాన్న ఎంత గర్వపడేవాళ్లు?
ఛీఛీ ,నేనే ఎందుకూ కొరగాకుండా పోయాను, చిన్నప్పట్నుంచీ నన్ను ఎంతో కష్టపడి చదివించారు,, డాన్స్ నేర్పించారు , నన్ను ఎన్నో ఆశలతో పెంచారు,అయినా అమ్మా వాళ్లకి అలాంటి ఆనందాలు ఇవ్వలేకపోతున్నాను . రాగిణి వాళ్ళమ్మ కనిపించినప్పుడల్లా రాగిణి ఫోటోలు వీడియోలు చూపించి,కళాకారులు అంటే వాళ్ళ అమ్మాయిలాగా జీవితాంతం దీక్షగా సాధన చెయ్యాలి తప్ప మధ్యలో వదలకూడదని దెప్పి పొడుస్తూ, నేనేదో కళకే కళంకం అన్నట్లు వెక్కిరిస్తూ ఉంటుంది.
నిజమేగా మరి, నేను రాగిణిలా సాధన కొనసాగించి,కీర్తిప్రతిష్టలు పొందలేకపోయానుగా!" గుండె బరువెక్కింది రాధికకి.
"ఇంకా పడుకునే ఉన్నాను ఏంటి? 5 అయిపోయి ఉంటుంది,ఇంక లేవాలి, ఈ రోజు ఎంతో పర్వదినం అట,ఆకాశంలో వందల ఏళ్లకో సారి జరిగే ఏవేవో నక్షత్రాల - గ్రహాల కూటమి ఈ రోజు జరుగుతోందని ఆయనెవరో సిద్ధాంతి గారు టీవీ లో చెప్పారుట , అందుకని చిన్నవదినగారు ఆయన చెప్పినట్లు ఏవేవో పెద్దపెద్ద కలశపూజలుచేస్తున్నారుట ,"ఇంటి ఇల్లాలు ఇలాంటి పూజలు చేస్తేనే ఇంటికి కలిసి వచ్చేది" అని అత్తయ్యగారు అన్నారు కుడా . చిన్న వదిన గారిలా అంతంత పెద్ద పూజలు చేసే సీన్ నాకు ఎలాగో లేదు, రోజు చేసే పూజైనా కొంచెం ఎక్కువ సేపు చెయ్యాలి ".
"అయ్యయ్యో , పూజకి మడి చీర ఆరేసుకోవడం మర్చిపోయా,ఇప్పుడెలా? పోనీ ఉతికిన నైటీ వేసుకుని చేసేస్తే?తర్వాత పని చెయ్యడానికి కూడా ఫ్రీ గా ఉంటుంది ..."
అమ్మో ,వద్దులే, ..ఖర్మగాలి అదేటైంకి ఏ గుడికనో అత్తయ్యగారు కార్లో ఇటు వైపు వచ్చి, ఇంటికి వస్తే ఇంకేమైనా ఉందా? ఆవిడకసలే నైటీలంటే అసహ్యం.పెళ్ళైన కొత్తల్లోనే ఒక సారి నేను నైటీ వేసుకుంటే ఆవిడ చాలా రాధ్ధాంతం చేసింది.
"అంత చదువుకుని అమెరికాలో ఉద్యోగం చేసే మా అమ్మాయే ఏనాడూ నీలాగా అసహ్యంగా నైటీలు వేసుకోదు , నువ్వు నైటీలు వేసుకు మా ఇంట్లో తిరిగితే మేము ఒప్పుకోము " అని గట్టిగా చెప్పింది.
పోనీలే ,అత్తామామలని సంతోషపెట్టకుండా ఎన్ని పూజలు చేసినా లాభం ఉండదని ప్రవచనకారులు కూడా చెప్తున్నారు కదా, ఉతికిన చీర కట్టుకునే పూజ చేస్తే సరి .
కానీ మొన్న ఒక రోజు ఆ చీరలు అన్నీ సర్దుదామని తీసి పెట్టాను,తీరా ఆ టైంకి ఇంటికి ఎవరో వచ్చి, సర్దటం కుదరలేదు. తిరిగి అన్నీ అలమరలోనే కుక్కిపెట్టాను. ఇప్పుడు చీర,సరిపడే లంగా జాకెట్ వెతుక్కునేప్పడికి బోలెడు టైం వేస్ట్ అవుతుంది.
అబ్బబ్బా!ఏమిటో అన్నీ సమస్యలే నాకు, ఏది సరిగ్గా చెయ్యను, ఇల్లు, బట్టలు ఎప్పటికప్పుడు నీట్‌గా సర్దుకుంటే ఎంత బాగుంటుంది?
నాన్న కూడా ఎప్పుడూ కోప్పడతారు అందరిలా ఇల్లు ,వస్తువులు శ్రద్దగా సర్దుకోనని. పెద్దమామయ్య కూతురు రమ్య వదిన అయితే ఇల్లంతా ఎప్పుడూ అద్దంలా వుంచుకుంటుందట,ఎప్పటికప్పుడు సర్దుకుంటూనే ఉంటుందట, బుజ్జక్కయ్య అయితే నిద్రలో లేపి అడిగినా తన ఇంట్లో ఎన్ని సామాన్లు, వంటగిన్నెలూ ఉన్నాయో స్పూన్లతో సహా లెక్క చెప్పగలదట.
నిజమేఅందరూ వస్తువులు ఎంత శ్రద్దగా సర్దుకుంటారో! అందరి ఇళ్లు ఎంత నీట్‌గా ఉంటాయో. వీకెండ్స్ అన్నారెగ్యులర్ గా సర్దుదామ్ అంటే.. ఆ రోజే పిల్లల పరీక్షల చదువులు, ,తలంట్లు , వాళ్లకి ఇష్టమైన వంటలు,ఇంకా చుట్టాల ఇళ్లల్లో ఫంక్షన్లు అన్నీ వచ్చి పడతాయి నాకు .
పోనీ ఇద్దరం కలిసి సర్దుకుందాం అంటే.. ఆ రోజు శ్రీకాంత్ వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వెళ్తాడు.
ఒక్క వారం శ్రీకాంత్ తనకే ఓపిక లేక వెళ్లకపోతేనే ."ఆ ఒక్కరోజైనా మా వాడిని వదిలిపెట్టవా" అని అత్తయ్యగారు, ఆడపడుచు కలిసి తిట్టిపోశారు .
ఆ ఉరి చివర ఇంటి నుండి ఆఫీసులకి దూరం అవుతోందని మేము ఇటు వస్తే,పెళ్లయ్యినకొన్నాళ్లకే నేను వేరు కాపురం పెట్టించానని అనుకుని నా మీద కోపం పెట్టుకున్నారు వాళ్ళు , పోనీ వాళ్ళనీ ఇక్కడకురండి, కలిసి ఉందాం అంటే సొంత ఇల్లు వదిలి చస్తే రామంటారు.
"మేము అమెరికా లో ఎంతెంత దూరాలు పోతామో .ఏం పెద్దవాళ్ళకోసం ఆ మాత్రం దూరం వెళ్ళలేరా,ఆ మాత్రం దానికే వేరు కాపురాలు పెట్టాలా "అని పెద్దాడబడుచు ఫోన్ చేసి మరీ తిట్టింది.
ఏమిటో తన అసమర్ధత? ఎవరి తోనూ మంచి అనిపించుకోలేదు, అందరితో మాటలు పడడమే." విషాదం ఆవహించింది రాధికని.
"అమ్మో ఏంటి ఇలా ఆలోచిస్తూనే పడుకుంటున్నాను? అసలే పనమ్మాయి కూడా లేదు, ఈ పనివాళ్లంతా సర్ఫలు, సబ్బులు, డిష్‌వాష్ లిక్విడ్లూ, ఇష్టమొచ్చినట్లు పారబోసి వృధా చేసే వాళ్ళే. అదేమని అడిగితే కోపం వఛ్చి మానేస్తారు,
"వాళ్లు ఇష్టమొచ్చినంత వేస్ట్ చేస్తూ ఉంటారు , మనం జాగ్రత్తగా చూసుకోపోతే ఎలా? నువ్వు ఇంత కష్టపడి సంపాదించుకునేది వాళ్ళలా వృధా చెయ్యడానికేనా " అని అమ్మ కూడా బాధ పడింది.
వంట మనిషిని పెట్టుకున్నా అంతే! ఇష్టమొచ్చిన మందాన కూరగాయల తొక్కులు తీసి పారేసి, ఉల్లిపాయలు రెండువైపులా అటో పావు, ఇటో పావు తరిగి పారేసి, 4 రోజుల కొత్తిమీరని ఒక్క రోజులో అవగొట్టేసి...
ఆ వంటావిడ వంట చూసి అత్తయ్యగారు నీకసలు చేటూపాటు తెలియట్లేదని ఆ వంట మనిషిని తీసేసే వరకు నన్ను తిడుతూనే ఉంది.
అందుకే విసుగొచ్చి పనమ్మాయిని వంటఆవిడనీ మాన్పించేసా.
ఏమిటో.. మా కొలీగ్స్ అందరూ వాళ్ళిళ్ళల్లో పనివాళ్ళు ఏళ్ల తరబడి ఉన్నారని చెబుతుంటారు. కొంతమందికైతే ఫుల్ టైం పనివాళ్ళు కూడా ఉన్నారు, నా ఖర్మేమిటో సరైన పని వాళ్ళు కూడా దొరకరు నాకు,
అసలు నాలోనే ఎదో సమస్య ఉంది, పనివాళ్లని ఆకట్టుకుని,నా మాట వినేట్లు, ఎప్పటికీ మీ ఇంట్లోనే చేస్తాం అనేట్లు చేసే టెక్నిక్కే నాకు తెలియదు.
వంట మనిషి అంటే గుర్తు వచ్చింది.ఈ రోజైనా బ్రేక్‌ఫాస్ట్ కి,స్నాక్స్ కి, లంచ్ బాక్స్ లోకి మంచి వెరైటీలు చెయ్యాలి. వాళ్ళ ఫ్రెండ్ హరిణి వాళ్ళ అమ్మలాగా రకరకాల నార్త్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్ ఐటమ్స్ కాకుండా ఎప్పుడూ ఇడ్లీ, దోస, రైస్ అంటూ బోరింగ్ ఐటమ్స్ చేస్తానని మనస్విని గొడవ పెడుతోంది.ఆ అమ్మలంతా ప్రొద్దున్నే అవన్నీ ఎలా చేస్తారో? అత్తయ్యగారు కూడా ఎన్నెన్నో సంప్రదాయ పిండి వంటలు చేస్తారు, నాకు ఎదో రెగ్యులర్ వంటలు తప్ప పెద్ద పెద్ద పిండి వంటలు రావు. శ్రీకాంత్ కి కూడా నాతో ఎంత కష్టంగా ఉందొ?
చెప్పలేనంత దుఃఖం ముంచుకొచ్చి కృంగిపోయింది రాధిక.
ఛీ తనెందుకింత అసమర్ధురాలు?
అందరిలా అన్నీ సక్రమంగా ఎందుకు చెయ్యలేదు?
తనతోపాటు చదివిన ఆదిత్య, రమేష్ వాళ్ళలా అటు ఉద్యోగంలోనూ ఉన్నత స్థితికి వెళ్ళలేదు,
అభినవ్ వాళ్ళ అమ్మ లాగా పిల్లల్నీ వృద్ధిలోకి తేవట్లేదు,
హర్షిణి వాళ్ళ మ్మ లాగ రకరకాల వంటలు చేసి పిల్లలని సంతోషపెట్టడమూ రాదు,
ఫిట్నెస్ అందం మైంటైన్ చేస్తూ భర్త కళ్ళకి అందం గా కనబడడమూ కుదరదు..
రమ్యోదిన, బుజ్జక్కయ్యలాగా మంచి గృహిణిని అనిపించుకోవట్లేదు.
రాగిణిలా తల్లిదండ్రులకు గర్వకారణమూ కావట్లేదు,
అత్తమామలకు అనుగుణంగా ప్రవర్తించి వారి మెప్పు పొంది ఉత్తమ కోడలు అనిపించుకోవట్లేదు,
చక్కగా పెద్ద పెద్ద పూజలు,వ్రతాలూ చేస్తూ మంచి భక్తురాలినీ అవ్వట్లేదు.
చివరికి పనిమనుషులని ఆకట్టుకుని సరిగ్గా పనిచేయించుకోవడమూ రాదు...
ఛీ ఛీ , ఎంత చేతగాని దాన్ని నేను? ఎంతటి అసమర్ధురాలిని?
చిన్నప్పటినుంచీ జీవితాన్ని ఎంత సక్సెస్ ఫుల్ గా ఊహించుకున్నాను?
అన్నింటా ముందుండి,అందరితో శహభాష్ అనిపించుకుందాం అనుకున్నాను.
రాధిక అంటే ఒక సూపర్ వుమన్ ఒక సూపర్ మామ్ అని అందరితో పొగిడించుకోవాలనుకున్నాను.
కానీ ఇంతపనికిమాలిన దానిలా అన్నింటిలో పరాజయం పాలవుతాననుకోలేదు.
ఆఫీసులో అఖండ విజయాలు సాధించి, ఇంటికివచ్చాక ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి, భర్త అత్తమామలు,పిల్లలతో భేష్ అనిపించుకునే సూపర్ వుమన్ పాత్రలు టీవీల్లో, సినిమాల్లో చూస్తే తనకు ఎంత సుపూర్తిదాయకంగా ఉండేది? అలాంటిది ఇప్పుడు అలాంటి పాత్రలు చూస్తుంటే ఎంతో చిన్నతనంగా ఉంటోంది..ఆ టైములో పక్కన ఇంట్లోవాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్గుతో చితికిపోయినట్లు అనిపిస్తుంది."
ఆలోచించిన కొద్దీ దుఃఖం పెరిగిపోతోంది రాధికకి, మూసిఉన్న కనురెప్పల నుండే కన్నీళ్లు ధారగా కారిపోతున్నాయి. అంతులేని నిస్పృహ ఆవరిస్తోంది.
"ఇకనుంచి అయినా తాను మారాలి, అన్ని పనులు అద్భుతంగా చెయ్యాలి, అందరితో శహభాష్ అనిపించుకోవాలి, అసలు ఒక్కొక్క పనికి ఒక్కొక్క గంట చొప్పున కేటాయించుకుని చేసెయ్యాలి. తెల్లవారు ఝామున 3 గంటలకి లేచేసి,.. వ్యాయామం, పూజ, ఇంటిపని, వంటపని, ఇల్లు సర్దడం చేసి, కొంతసేపు డాన్స్ ప్రాక్టీస్ చేసేసి, పిల్లల లేచాక వాళ్ళని రెడీ చేసి, చక్కగా తయారైఆఫీస్ కి వెళ్ళాలి. రాత్రికి ఆఫీస్ నుండి వచ్చాక చక్కగా పిల్లలకి చదువు చెప్పి,వాళ్లకిష్టమైనవి అన్నీ వండిపెట్టి, అత్తమామలకు, ఆడపడుచులకు దగ్గర బందువులకు ఫోన్లు చేసి, ఆ తర్వాత భర్త కి కావలిసినవి చూసుకోవాలి.అందరినీ సంతోష పెట్టాలి, ఎవ్వరితో మాట అనిపించుకోకూడదు. అందరూ నన్ను శహభాష్ అనాలి.
నేను కూడా ఒక సూపర్ వుమన్ అనిపించుకోగలగాలి . అప్పుడే నా చదువుకు, నా తెలివితేటలకు ,నా జన్మకు సార్ధకత!"
"దానికి తగ్గ కృషి ఇవ్వాళ్టితోనే...ఇప్పుడే మొదలవ్వాలి...ఇప్పటికే లేట్ అయ్యింది...లేవాలి..."
మనసులో గట్టిగా అనుకుంటూ బలవంతంగా మంచం మీదనుండి లేచింది రాధిక.
లేస్తుంటేనే..
ఎవరో బలవంతం గా తోసేస్తున్నట్లు అనిపించింది.
వంద సుత్తులతో తలంతా బద్దలుకొడుతున్నట్లు అనిపించింది.
భూకంపం వచ్చి తాను ఉన్న గది తల్లక్రిందులౌతున్నట్లు అనిపించింది.
అంతే! ఆమెకంతవరకే తెలుసు.
*************************************************************************************
రాధీ.. నీకు బాగా స్ట్రెస్ ఎక్కువై, వెర్టిగో వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు అన్నారు డాక్టర్ గారు, బీపీ కూడా పెరిగింది. "ఇవన్నీ మానసిక వత్తిడి వల్లే ఆ అమ్మాయి సరిగా నిద్ర కూడా పోతున్నట్లు లేదు,. స్ట్రెస్ తగ్గించుకోవాలి వెంటనే" అని చెప్పారు డాక్టర్ గారు.
"నాకు చెప్పు, అసలు నువ్వు అంత మానసిక వత్తిడికి ఎందుకులోనయ్యావు? జాబ్ లో సమస్యలా లేక శ్రీకాంత్ నువ్వు ఏమైనా మాటా మాటా అనుకున్నారా?" అడిగింది ధీరజ.
రాధిక కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే హాస్పిటల్ లో చేర్చారు. చెల్లెలిని హాస్పిటల్ లో చేర్చారని తెలిసి, ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చింది అక్కయ్య ధీరజ.
హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక 2 రోజుల తర్వాత చెల్లెలి బాధ ఏమిటో తెలుసుకోవాలని అనుకుని, మెల్లిగా అడిగింది ధీరజ.
చ చ, అలాంటిదేమి లేదు అక్కా, నీకు తెలుసుగా శ్రీకాంత్ ఎంత మంచివాడో. ఆఫీసులో కూడా ఏమీ సమస్యలు లేవు "అన్నది రాధిక.
"మరి ఏమిటి నీ సమస్య, ఎవరితో నీకు టెన్షన్?"
"నాకేమి సమస్య లేదక్కా. ఎవరితోనూ నాకు టెన్షన్ లేదు, నాతోనే అందరికీ సమస్యలు, నేనే పెద్ద అసమర్ధురాలిని, ఎవరినీ సుఖపెట్టలేను, ఎవరికీ సంతోషాన్ని ఇవ్వలేను.." భోరుమంది రాధిక.
వివరంగా అంతా మాట్లాడి రాధిక బాధ ఏంటో తెలుసుకుంది ధీరజ.
నివ్వెరపోయింది. కొంచెసేపాగి...
"అంటే ఇప్పుడు నువ్వు,..
ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ ల స్థాయిలో టీవీ లో చూపించిన రకరకాల వంటలన్నీ చేయలేక పోతున్నాననీ...
వరలక్ష్మి వ్రత కథ పుస్తకం లో చారుమతిలాగా ఉత్తమ గృహిణి&కోడలు కాలేకపోతున్నాననీ..
పది ఏళ్ల కూతురున్నా పదహారు ఏళ్ల పిల్లలా కనిపించే ఎడ్వర్తయిస్మెంట్ హీరోయిన్ లా, అందాన్ని &యవ్వనాన్ని కాపాడుకోలేకపోతున్నావనీ....
యాభై ఏళ్ళొచ్చినా నలభై దాటని బరువును మైంటైన్ చేస్తూ జిమ్ములు జుంబాలూ చేసే సన్నజాజి తీగల్లాంటి హీరోయిన్లలా ఫిట్నెస్స్ని పరిరక్షించుకోలేక పోతున్నావనీ....
ఎవరోలాగా ఆఫీసుకే అతుక్కుపోయి ప్రమోషన్ ల మీద ప్రమోషన్లు పొందట్లేదనీ..
ఇంకెవరోలాగా కళారాధన చేసి అవార్డులు పొందట్లేదనీ .....
జిజియాబాయిలాగా శివాజీలనీ శివానీలనీ తయారు చెయ్యలేకపోతున్నాననీ..
ఆటోనడిపే తండ్రి కడుపున పుట్టీ, ఐఏఎస్ రాంక్ కొట్టిన అమ్మాయిలాగా తల్లిదండ్రులకి గర్వాన్ని కలిగించలేకపోతున్నాననీ..
ఇన్ని రకాల దిగుళ్ళు పడీ పడీ, చివరికి కళ్ళు తిరిగి బోర్లాపడ్డావన్నమాట... "
చెల్లెలు మీద కోపాన్ని పంటి బిగువున ఆపుకుంటూ అన్నది ధీరజ.
అక్కయ్య గొంతులో ధ్వనించేది సానుభూతో, వెటకారమో, కోపమో అర్ధం కాక అయోమయంగా చూసింది రాధిక.
"రాధీ ...అంత తెలివైనదానివి నువ్వేంటే ఇలా ఆలోచిస్తున్నావు?"
"అక్కా ,మీరంతా చిన్నప్పటినుంచీ నన్ను తెలివైనదానివి, చురుకైనదానివి అని అంటారు,అంతా ఉత్తిదే అక్కా, అసలు నాకేమీ రాదు, నేనో దద్దమ్మని" విషాదం నిండిన గొంతుతో అంది రాధిక.
"నిజమేనే , నిన్ను తెలివైనదానివి అనుకోవడం నిజంగా మా భ్రమే" అంది ధీరజ.
నీరసంగా చూసింది రాధిక.
కాకపోతే ఏంటే రాధీ , నిజంగా తెలివైనదానివే అయితే ఇలా ఆలోచిస్తావా...?
ఈ సూపర్ వుమన్ అనే ట్రాప్ లో చిక్కుకుంటావా?"
అర్ధం కానట్లు చూసింది, రాధిక.
"లేకపోతే ఏమిటే మరీ, కథలలో, సీరియళ్ళలో, సినిమాలలో తప్పించి,నువ్వు అవ్వాలన్న సకలగుణసంపన్నురాలైన, సర్వాంగశోభితురాలయిన, సర్వసమర్ధురాలైన స్త్రీమూర్తి ని నిజప్రపంచం లో ఎక్కడైనా చూసావా?
లేదు, ఎందుకంటే.. ఆదో భ్రమ! కేవలం కల్పన.
నువ్వు చెప్పిన 24 గంటలు పిల్లలపై శ్రద్ద పెట్టగలిగిన ఆవిడ ఖచ్చితంగా ఒక హౌస్‌వైఫ్ అయి ఉంటుంది, అవునా? అప్పుడే అది సాధ్యం.
నువ్వుచెప్పిన సన్నజాజి తీగ మలైకాఅరోరా ఇంట్లో వంటలు చేస్తూ,ఆఫీసులో పనులు చేస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా కనబడిందా.. ఆవిడకి నచ్చకపోతే ఇంటినీ ఇంటాయన్నీ కూడా వదిలేసిపోయింది కానీ.
ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైనంత వ్యాయామం అందరమూ తప్పనిసరిగా చెయ్యాలి, అంతేకానీ అలవికాని ఆశయాలు పెట్టుకుని జీరోసైజు లో ఉండే శరీరము, మన వయసుకన్నా పాతిక ఏళ్ళు తక్కువదిగా కనిపించే ముఖమూ కావాలంటే ఎలాగే రాధీ?
ఇక నాట్యాన్నే వృత్తిగా ఎంచుకున్న రాగిణితో నాట్యం విషయంలో నువ్వు ఎలా పోటీ పడతావ్?
నీ చదువులో,వృత్తిలో నువ్వు సాధించిన విజయం తో నువ్వు అమ్మనాన్నలకి ఆనందం కలిగించ లేదా?
నీకు యూనివర్సిటీ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మేమెంత పట్టరాని సంతోషం పొందామో నీకు తెలుసా? నీకు గోల్డ్ మెడల్ వచ్చిందని ఫోన్ చేస్తే ఆ క్షణం అమ్మ నాన్న కళ్ళల్లో కనబడ్డ ఆనందానికీ, గర్వానికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. "
"ఆ! అదెప్పటిదో విషయం కదా అక్కా"
ఇప్పుడూ..ఇప్పుడు నీ వల్లా వాళ్లకి పండంటి మనవాడూ, మనవరాలు కలగలేదా? అది నువ్వు వాళ్ళకిచ్చిన అపురూపమైన ఆనందం కాదా?
నువ్వు పోల్చుకుంటున్న ఆదిత్య, రమేష్ లు ఏమైనా నీలా గర్భవతులై పిల్లలని కన్నారా ? నువ్వు ఇద్దరు పిల్లల్నీ కడుపున మోసి, ప్రసవించే, పాలిచ్చి పెంచిన టైం వాళ్లకి కలిసి వచ్చింది కనుక ఆ టైములో వాళ్ళు నీకన్నా ఉద్యోగపరంగా ముందుకు వెళ్లారు. వాళ్ళతో నీకు పోటీ ఏంటి? అసలా మాటకి వస్తే వాళ్లకి నీతో పోటీ ఏంటి?ఆ టైములో వాళ్ళు చేసిన ఆఫీస్ పనిని నువ్వు చేయగలవు, కానీ నువ్వు చేసిన పనిని వాళ్ళు ఒక్కనాటికి చెయ్యలేరు.
అయినా ఇంత దిగులుపడడానికి ఇప్పుడు నువ్వేమైనా కాళ్ళీగా కుర్చున్నావా?మధ్యలో కొంత విరామం తీసుకున్న, మళ్ళే ఉద్యోగంలో చేరి, నీ శక్తీ వంచన లేకుండా పని చేసి, అందుకుతగ్గట్లుగా ప్రమోషన్స్ పొందుతున్నావుగా?
నీకున్న బాధ్యతలతో, పరిస్థితులతో, పరిమితులతో పోలికలేని స్థితిలో ఉన్నవాళ్ళెవరితోనో పోల్చుకుని బాధపడుతున్నావు తప్ప,.. మనలాంటి మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చి ,మనలాగా పల్లెటూరి స్కూళ్లలో చదువుకున్న ఎంతమంది ఆడపిల్లలకు నువ్వు, నువ్వు సాధించిన విద్యార్హతలూ ఆదర్శమో నీకు తెలుసా?
ఆనందపడు రాధీ, నిన్ను చూసి నువ్వు గర్వపడు. నువ్వు సాధించిన విజయాలని విస్మరించి, వైఫల్యాలని వెతుక్కోకు.
ఇంకో ముఖ్య విషయం రాధి, ఎవరెవరితోనో పోటీలు పెట్టుకోవద్దని చెప్పగా, అందులో ముఖ్యం గా అత్తింటివారు ఆడపడుచులతో పెట్టే పోటీల విషవలయంలో అస్సలు చిక్కుకోకు.నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఆ పోటీలో గెలవలేవు. ఎందుకంటే అక్కడ అంపైర్లు నువ్వు గెలిచినా ఒప్పుకోరు గనుక, అసలా పోటీ మొదలయ్యేది నిన్ను ఓడించడానికి కనుకా..
కోడళ్ళని చులకన చేయడానికీ.., చేతగాని వాళ్లుగా చూపడానికి అత్తింటివాళ్ళు చూపే ఒక మిధ్యా ఆయుధమే... ఆల్ రౌండర్ అయిన ఆడపడుచు.ఎక్కడ ఎవరింట్లో అయినా చూడు, ఆడపడుచు అన్నిట్లో నిపుణురాలుగా కోడలు ఏమీ రాణి దద్దమ్మ గాను పరిగణింపబడతారు. మళ్ళీ ఈ ఆడపడుచు అతింట్లో ఆమె ఆడపడుచు ముందు ఈవిడపరిస్థితీ అంతే.
ఉద్యోగం విషయంలో ఒక ఆడపడుచుతో పోటీ పెడతారు, ఆవిడేమో పిల్లల్ని వాళ్ళ ఖర్మకి వాళ్ళని హాస్టలో పడేసో లేక తల్లిపాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా పుట్టింట్లో వదిలేసో..ఉద్యోగం మీదే ధ్యాసపెట్టి ప్రగతి సాధించి ఉంటుంది.
అదే కోడలికి పిల్లల పెంపకం విషయంలోనూ పూజాపునస్కారాల విషయంలోనూ ఇంకో ఆడపడుచుతో పోటీ పెడతారు.ఆవిడేమో హౌస్‌వైఫ్ అయ్యి ఉంటుంది.
ఇక అందచందాలు-ఫాషన్ల విషయంలో కోడలికి వాళ్ళ 16 ఏళ్ల మనవరాళ్లతో పోటీ పెడతారు. కోడలిని వివిధ విషయాలలో వేర్వేరు వ్యక్తులతో పోల్చి, మా వాళ్లందరికన్నా నువ్వు పనికిమాలిన దానివి అని చెప్పడం, తద్వారా ఆ కోడలి ఆత్మా విశ్వాసం దెబ్బతీసి తమ ముందు మోకరిల్లేలా చేసుకోవాలనుకోవడం...ఇవే అలాంటి అత్తమామల లక్ష్యాలు.
అవన్నీ పట్టించుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.
అంతెందుకు?మా అమ్మాయి ఏనాడూ నైటీలు వేసుకోదు, చాలా పద్దతిగా పెంచాం అని ఎవరి గురించైతే మీ అత్తగారు ఊదరగొట్టిందో ఆ మహిళాశిరోమణి అమెరికాలో మినీలూ, స్కర్టులు వేసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టట్లేదూ. దేశకాలమాన పరిస్థితులను , తన ఇష్టాయిష్టాలనూ అనుసరించి ఆ అమ్మాయి ఉండటం తప్పు కాకపోవచ్చు.
కానీ.. మీ అత్తగారి మాటలు పట్టుకుని నైటీలు వేసుకోవడం ఎదో మహాపరాధమైనట్లు నిన్ను నువ్వు తప్పుబట్టుకోవడం మాత్రం పొరబాటే.
అసలీ నైటీలతో పెద్దవాళ్ళకి వచ్చిన గొడవేమిటో నాకు అర్ధం కాదు.అవేమి శరీరాన్ని బహిర్గతం చెయ్యవు, వదులుగా ఉంటాయికనుక అవయవ సౌష్టవాన్నీ బహిర్గతం చెయ్యవు, చున్నీ వేసుకుంటే చీరకన్నా నిండుగా శరీరాన్ని కప్పుతాయి.
అయినా మన ఖర్మేమిటో కానీ , మగవాళ్ల విషయంలో తాగుడు, జూదం, వ్యభిచారం వంటి పెద్ద పెద్ద అంశాల్లో గానీ తప్పుపట్టని సమాజం ఆడవాళ్ళ విషయంలో ఇంట్లో వేసుకునే నైటీ నుండి ఇంటి ముందు వేసే ముగ్గు వరకూ వెతికి వెతికి తప్పులు ఎంచుతూనే ఉంటుంది. అత్యంత దురదృష్టకరం ఏంటనే..ఆ తప్పులెన్నువారికి తందానా అనే వారు ఎక్కువ ఆడవాళ్లే అవడం,మన ఇంట్లో వాళ్ళే అవడమూనూ ..
ఏనాడైనా ఏ ప్రవచన కారుడైనా నైటీ లగురించి మాట్లాడినట్లు లుంగీల గురించి మాట్లాడం విన్నావా? మరి లుంగీ కూడా మన సంస్కృతి కాదుగా? మగవాళ్ల లుంగీలు గాలికి ఎగిరిపోయినా.. వాళ్ళు షార్టులు వేసుకుని విచ్చలవిడిగా కూర్చుంటే వారి ఊరుసహిత అంగాంగ ప్రదర్శన జరిగినా చుట్టూ ఉన్న ఆడవాళ్లే తలతిప్పుకుని వచ్చే వాంతిని ఆపుకోవాలే తప్ప సరిగ్గా బట్టలేసుకోమని ఆ పురుషాకారానికి చెప్పే నాధుడే / నాధురాలే ఉండదు. అదేమంటే నెలకి పడే ఎన్నోవంతో వానలు స్త్రీల వల్ల గనుక వాళ్ళకే చెప్తాము అంటారు. మిగిలిన వంతుల వానల్ని ఎండగొడుతున్న పురుషులకి మాత్రం ఎవరూ ఏమీ చెప్పరు.
ఇలాంటి పక్షపాత ధోరణితో కూడిన అర్ధంపర్ధం లేని నియమాలనీ, సిదాంతాలనీ పాటించలేకపోతున్నామని నీలాంటి వాళ్ళు అపరాధభావంతో కృంగిపోతే ఎలా?
మంచి చెడులని మనస్సాక్షితో విశ్లేషించుకుని, మనవల్ల మరోమనిషికి గానీ సమాజానికి గానీ చేటు జరక్కుండా ప్రవర్తించాలి గానీ ఎవరో నిర్దేశించిన తప్పుడు ప్రమాణాలని బట్టి మనలని మనం చెడ్డవాళ్లమని నిందించుకుని కుమిలిపోగూడదు రాధీ .
అలాగే పూజ అన్నది మనం భగవంతుని పట్ల కృతజ్ఞతా పూర్వకంగా చేయవలసింది కానీ ఎవరో చేస్తున్నారనో, ఇంకెవరికో చూపించుకోవాలనో చేసేది ఎంతమాత్రం కాదు . ఇది తెలియక పండగల తర్వాత అలసిపోయి,అడ్డంపడే ఆడవాళ్లు కోకొల్లలు.
ఇక వంటల విషయంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్న అత్తగారిలా అరిసెలు చేయలేకపోతున్నానని , యూ ట్యూబ్‌లో చూసిన వంటలన్నీ చేసే తీరిక ఉన్న వాళ్ళలా వండలేకపోతున్నాననీ బాధపడటం ఎంత పిచ్చితనం? నిజంగా సీరియళ్ళలో చూపించినట్లు ఎవరైనా ఉంటారా?10 ఏళ్ళనుండి వస్తున్న ఒక సీరియల్లో అన్నపూర్ణాదేవిలా వంటలు చేస్తుంది అని చూపించే పాత్ర పోషించిన హీరోయిన్ అసలు నిజజీవితంలో నాకు టీపెట్టడం కూడా రాదు అని చెప్పింది, తెలుసా..వాళ్ళని చూసి సూపర్ వుమన్ కాలేక పోయానని నీకు బాధా?
ఇంకో ముఖ్యమైన విషయం.. అసలు నువ్వు పనిమనిషిని , వంటమనిషినీ పెట్టుకోవడం పూర్తిగా ఎందుకూ మానేశావ్?
దొరికినంతలో మంచివాళ్లని పెట్టుకో. వస్తువుల విషయంలో నీ జాగ్రత్తలో నువ్వుండు.అంతే కానీ కొంచెం సర్ఫ్ ఎక్కువ వేశారనీ , కరివేపాకు ఎక్కువ వాడతారని వాళ్ళని మాన్పించి అన్ని పనులు నువ్వే చేసుకుంటా అంటే ఎలా? ప్రొద్దుగూకులూఇంట్లో గిన్నెలూ స్పూన్లు లెక్కపెట్టుకుంటూ, వంటావిడ పసుపు ఎంత వాడిందో , పనమ్మాయి సబ్బెన్త రుద్దిందో చూసుకోవడానికి నీలాంటి వాళ్ళకెలా కుదురుతుంది? వేస్ట్ చేస్తే ఎంత చేస్తారు?, మహా అయితే నీ ఒక రోజు జీతం అంత ఉండదు వాళ్ళు వేస్ట్ చేసేది. చిన్న చిన్న వాటికి నసపెట్టకుండా ఉంటే వాళ్ళూ మానెయ్యకుండా ఇంకా జాగ్రత్తగా, ప్రేమగా చెస్తారు. ఆ విషయంలో పెద్దవాళ్ళ మాటల్ని వినీ విననట్లు వదిలెయ్యాలి. వాళ్ళలాగా అంత జాగ్రత్త పడి ఆదా చెయ్యడం ఉద్యోగం చేసే నీకు కుదరదు ."
అదికాదు అక్కా, అందరూ అంటారు కదా.. "ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నామని మిగిలినవన్నీ సరిగ్గా చెయ్యకుండా ఉండకూడదు, ఒక గది బాగా చిమ్ముకున్నామని ఇంకో గదిలో చెత్త పోసుకోకూడదు. అన్ని బాధ్యతలు సరిగా నిర్వహించే స్త్రీనే పరిపూర్ణ మహిళ అని,"?
గాడిదగుడ్డేమీ కాదూ...ఒక గది చిమ్ముకున్నామని ఇంకో గదిలో చెత్త పోసుకోకూడదు అన్నది నిజమే కానీ అన్ని గదులూ ఒక్క గృహిణే ఊడుస్తుంటే మిగిలినవాళ్లు చిద్విలాసంగా తీర్పునిస్తాం అనడం మాత్రం కరెక్ట్ కాదు.
అన్నింటా ఒక్క మనిషినే ఫస్ట్ రమ్మని అంటే అది అసాధ్యమైన విషయం.
సర్వశక్తి స్వరూపిణిగా ఆరాధించే అమ్మవారిని సందర్భాన్ని బట్టి చతుర్భుజిగానో ,అష్టభుజిగానో , సహస్రభుజిగానో చూపిస్తారే! అలాంటిది రెండే భుజాలున్న మానవ మాత్రులం మనం .మనకి అన్నీ ఎలా సాధ్యం?
నాకు అసలేమీ అనిపిస్తుందో తెలుసా రాధీ..?
అనాదిగా స్త్రీలని అణగదొక్కాలన్న భావజాలం ఉంది చూసావా ,అది అదేదో కథలో రాక్షసుడి లాంటిది. ఒక రాక్షసుడిని చంపితే వాడి ఒక్కో రక్తపు బొట్టు నుండీ ఒక్కో రాక్షసుడు చొప్పున వేలాది రాక్షసులు పుట్టినట్లు..... స్త్రీలు ఒక వల నుండి బయట పడితే ఇంకో వల విసురుతూ, ఒక సంకెలని తెంపుకుంటే ఇంకో సంకెల బిగిస్తూ....
నిరంతరం స్త్రీలని ఎదో రకంగా నియంత్రిస్తూనే ఉంటుంది సమాజం.
అలాంటి మరో సంకెలే, మరో వలే...ఈ సూపర్ వుమన్ కాన్సెప్ట్.
చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ఆత్మవిశ్వాసంతో బ్రతికే ఆడవాళ్ళకి ఆత్మన్యూనతని కలిగించి, అణగదొక్కే మరో కొత్త ప్రయత్నమే ఈ సూపర్ వుమన్ కాన్సెప్ట్.
ఒకప్పుడు నువ్వు అది చెయ్యద్దు, ఇది చెయ్యద్దు అనేవాళ్లు.. ఇప్పుడు నువ్వు ఇంకా అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, ఏమిటి నీ బోడి గొప్ప అంటున్నారు...అంతే.. !
ఎంత సాధించినా మీరు సాధించాల్సింది చాలా ఉందనే అసంతృప్తిని కలిగించి, ఆడవాళ్ళని శ్లేష్మంలో చిక్కిన ఈగల్లా మార్చేది ఈ సూపర్ వుమన్ కాన్సెప్ట్.
సూపర్ మాన్ అనేది గాల్లో ఎగిరే ఒక ఊహాజనిత క్యారెక్టర్ అని స్పష్టంగా చూపించే సినిమాలు, అడ్వేర్టైస్మెంట్లూ సూపర్ వుమన్ లు మాత్రం చాలా సాధారణమయినట్లు,లోకంలో ప్రతి కోడలు,భార్య, తల్లి సూపర్ వుమన్గానే వెలిగిపోతున్నట్లు భ్రమని కలిగిస్తాయి.
అది చూసీ చూసీ మనమూ సూపర్ వుమన్ అనిపించుకోవాలని ఆశ పెంచుకుని ,ఆ తర్వాత సాధించలేక నిరాశతో...ఇదిగో ఇలా కృంగిపోతాము.
అన్నిటా అంతటా మనమే ముందుండాలని పరిగెత్తీ పరిగెత్తీ ఎదో ఒక చోట కుదేలవుతాము.
అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే..ఒకప్పుడు సమాజం విధించిన ఆంక్షలు మనని శిక్షిస్తే.....ఇప్పుడు మన ఆకాంక్షలే మన జీవితాలని భక్షిస్తున్నాయి.
చూడు రాధీ...
మనం సంతోషంగా ఉంటేనే మనవారిని సంతోషంగా ఉంచగలం.
అందుకని,
ఈ సూపర్ వుమన్ భ్రమలోంచి బయటపడి , నిన్ను నువ్వుగా స్వీకరించుకుని నీ విజయాలనూ, సుగుణాలనూ ఆస్వాదించు.
నీ అందం, ఆరోగ్యం, కళాసాధన, ఉద్యోగం, భక్తీ అన్నీ నీకోసం, నీ ఆనందం కోసమే తప్ప మరొకరితో పోటీకి కాదని గ్రహించు.
అన్ని పనులు అన్ని వేళలా నువ్వే చెయ్యడానికీ, అందరినీ అన్నిరకాలుగా ఆనందపరచడానికి నీ దగ్గర అల్లాదీన్ అద్భుతదీపం ఏమీ లేదని గ్రహించు.
నీ పిల్లలకీ నీ భర్తకి నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం అవసరం కానీ నువ్వేదో మానవాతీత శక్తిలా వెలిగిపోవడం అవసరంలేదని గుర్తెరిగి జీవించు.
దానితో పాటు...
సూపర్ వుమన్ అవ్వాలని భ్రమపడి, భంగపడి,బాధపడుతున్న సాటి స్త్రీలకూ జ్ఞ్యానోదయం కలిగించు..
ముఖ్యంగా......అత్యంత ముఖ్యంగా...
మరొక స్త్రీకి ,నీ కారణంగా సూపర్ వుమన్ అనిపించుకోవాలనే కసి కలిగి, ఆ బడబాగ్నిలో ఆమె దహించుకుపోకుండా జాగ్రత్త వహించు. "స్త్రీకి స్త్రీ ఏ శత్రువు" అన్న నానుడిని చెరిపివేయ్యడంలో నీ వంతు బాధ్యత వహించు."
అని చెప్పి రాధిక వైపు చూసింది దీరజ.
ఒక చేత్తో కన్నీళ్లు తుడుచుకుంటూ యింకో చేత్తో అక్క చెయ్యిని గట్టిగా పట్టుకుని, ' థాంక్స్ ' అన్న భావం తో వత్తుతూ అర్థమయింది అన్నట్లు తల ఊపుతూ చూసింది రాధిక.
తానూ రాధిక బుగ్గలు నిమిరి,
"చాలా సేపు మాట్లాడుకున్నాం రాధీ..ఇంక చాలు , పిచ్చి ఆలోచనలు అన్నీ వదిలేసి హాయిగా కాసేపు రెస్ట్ తీసుకో" అని చెప్పింది ధీరజ.
వృత్తిపరంగా సైకియాట్రిస్ట్ అయిన తన అక్క చెప్పిన మాటలు విన్న రాధికకి చాలా ధైర్యం కలిగింది.
ఏవేవో,బాధల, భయాల, భ్రమల మబ్బులు వీడిపోయినట్లు అనిపించింది.
ఆ గదిలోంచి బయటకు వెళ్ళబోతూ వెనక్కి తిరిగి.., " ఇక వదిలేస్తావా మరి ఆ సూపర్ ఉమన్ గొడవ?' అడిగింది దీరజ..
సూపర్ ఉమనా, గాడిద గుడ్డెం కాదూ? అంటూ రాధిక నవ్వితే.. హమ్మయ్య అనుకుంటూ అక్కడినుంచి కదిలింది ధీరజ.
పెదవులపై సన్నని చిరునవ్వు మెరువగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది రాధిక
సీజన్ మామయ్య - చిన్నారి పెళ్ళి కొడుకు
మీకో విచిత్రం చెప్పనా..
ఇవ్వాళ మా బుజ్జి అన్నయ్య ఫోన్ చేశాడు, చెప్పింది సునీత.
ఎవరూ మీ సీజన్ అన్నయ్యా.
ఆయన ఫోన్ చేశాడంటే అది విచిత్రమే కాదు , విడ్డూరం కూడా!
తుఫాన్లు వస్తాయో, ఏకంగా సునామీ లే వస్తాయో అన్నాడు ప్రకాష్.
హహహ! సీజన్ అన్నయ్యా... భలే పేరు పెట్టారే! పగలబడి నవ్వింది సునీత.
నేను పెట్టడం ఏంటి మీరంతా అనుకుంటూ ఉంటారుగా ఆయన సీజన్ ఎలా ఉందో ఇప్పుడు అనీ .
నిజమే, మేము ఆయన మానసిక వాతావరణం ఎలా ఉందో అని అనుకుంటుంటే మీరు ఏకంగా తన పేరే సీజన్ అన్నయ్య అని పెట్టేసారు. భలే పేరు!
అవునండోయి. వాళ్ళ ఇంటికెళ్తేనే సరిగా మాట్లాడని ఆయన గారు ప్రత్యేకం తనంతట తానే ఫోన్ చేశాడంటే మీరన్నట్లు తుఫానే వస్తుందో లేక మీరు ఆయనకు పెట్టిన పేరుకు తగ్గట్లు సీజనల్‌గా మంచు తుఫాన్లో వడగాల్పులో కూడా రావచ్చేమో.
"ఇంతకీ మీ సీజన్ అన్నయ్య ఫోన్ ఎందుకు చేశాడో చెప్పలేదు. ఏంటిటా సంగతీ?"
"ఏమో, ఫోన్ చెయ్యడం వరకు చేశాడు గానీ సరిగ్గా మాట్లాడితే కదా?
"హలో, నేను, బుజ్జినీ" అన్నాడు అంతే! ఆ తరవాత "బాగున్నావా అన్నయ్యా దగ్గర్నుంచి ఉంటాను అన్నయ్యా వరకూ నేను మాట్లాడడమే. నేను అడిగిన వాటికి ఊ, ఆ అని ఏకాక్షర శబ్దాలు చేశాడు అంతే. కొన్నిటికి అయితే ఆ శబ్దాలు కూడా లేవు. రామ సోది వాళ్ళ లాగా ప్రశ్నా నాదే, సమాధానం నాదే . అసలు లైన్లో ఉన్నాడో ఫోన్ పెట్టాశాడో తెలియక దేభ్యం మొహంలా ఫోన్ స్క్రీన్ చూసుకోవాల్సి వచ్చింది మధ్యలో" అని తల కొట్టుకుంది సునీత.
"ఈసారి మీ సీజన్ అన్నయ్యకు నెంబర్ డయల్ చేసాక నువ్వు ఫోన్ ఎత్తే లోపే సీజన్ మారి మాట్లాడే మూడ్ పోయిందేమో.
భలే వాడే!" అన్నాడు ప్రకాష్.
ఆ తర్వాత వారం రోజుల పాటు సునీత, తన కజిన్ అక్క చెల్లెళ్లు నలుగురి ఫోన్లు ఒకరినుండి ఒకరికి మ్రోగుతూనే ఉన్నాయి.
ఎందుకంటే వాళ్ళు నలుగురికీ, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికీ కూడా బుజ్జి అన్నయ్య ఫోన్ చేశాడు.
పెదనాన్నను చూడటం కోసం వాళ్ళ ఇంటికెళ్ళినా, పరాయి ఖండపు అపరిచిత వ్యక్తులను చూసినట్లు మొహం త్రిప్పుకు పోయే బుజ్జన్నయ్య తనంతట తానుగా తమకు ఫోన్ ఎందుకు చేశాడు అనేది వాళ్ళందరికీ బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం లాగా అంతు చిక్కలేదు.
"నీకూ చేశాడా!" అంటే "నీకూ చేశాడా?" అని వాళ్ళంతా విడి విడిగా మాట్లాడుకుని ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యం తీరక అందరూ కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని మరీ సంఘటితంగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
ముగ్గురు అన్నదమ్ముల సంతానం వీళ్లందరూ. బుజ్జి అందరి కంటే పెద్దాయన కొడుకు. తనకో స్వంత అక్క!
సునీత 2 వ ఆయన కూతురు, తనకో చెల్లి.
3 వ ఆయన కు పుట్టిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి, సునీత వాళ్ళు, వీళ్ళు ఐదుగురూ దగ్గర దగ్గర వయసు వాళ్లవ్వడంతో చిన్నప్పటి నుండి స్నేహంగా. చనువుగా ఉంటారు.
అందుకే వాళ్ళ ఐదుగురి మధ్య ఆ ఆశ్చర్యార్ధక ఫోన్ కాల్స్ ఒకటి కాదు రెండు కాదు ఓ వారం జరిగాయి..
జరగవు మరీ, చెప్తే నమ్మరు కానీ బుజ్జి అలాంటి వాడే! చిన్నప్పటి నుంచీ ఎవరితో కలవకుండా తేడాగానే ప్రవర్తించేవాడు. ఎప్పుడో ఒకసారి తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడేవాడు. అదే పండుగ అందరికీ!
పాపం అందరి కన్నా పెద్ద అన్నయ్య అనీ, తమ ప్రియతమ పెద్ద పెదనాన్న కొడుకనీ వదులుకోలేక, ఆ అన్నదమ్ముల పిల్లలంతా
" ఏదోలే తన మూడ్ బాలేదు. ఇప్పుడు మాట్లాడే సీజన్ కాదు" అని అదో నవ్వులాట గా చేసి తమకు తాము సరిపెట్టుకున్నారు కానీ బుజ్జి సీజన్ నూటికి తొంభై తొమ్మిది సార్లూ బాగోదు. తను ఎవరి ఇంటికి వెళ్ళడు, ఎవరైనా తమ ఇంటికి వచ్చినా తను మాట్లాడించక పోగా వాళ్లకు తనను మాట్లాడిచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చరచరా మొహం త్రిప్పుకు వెళ్ళి పోతాడు. పోనీ చిన్నప్పుడంటే తెలియదు అనుకుంటే పెద్దయ్యాక పెళ్ళయ్యి పిల్లల తండ్రి అయినా తన తీరు అంతే! పెద్దవాడైన పెదనాన్నను చూడటం కోసం సునీత వాళ్ళు వెళితే వీళ్ళని మంచి నీళ్ళు కూడా అడగకుండా వాళ్ళు మాత్రం అతిథుల ముందే కిచెన్ నుంచి వయా హాలు బెడ్రూంలోకి కాఫీలు, టిఫిన్లూ, భోజనాలు సమయానుకూలంగా తీసుకెళ్లి తలుపులు వేసుకుని మరీ ఆరగిస్తారు... బుజ్జన్నయ్య , ఆయన గారి అనుకూలవతి అయిన భార్య లలిత!
ఆ చర్యలు చూసి అసహాయంగా మొహం చిన్నబుచ్చుకున్న పెదనాన్నను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ముఖం మీద నవ్వు పులుముకుని,
ఏమీ జరగనట్టు నటించి వస్తుంటారు సునీత వాళ్ళు.
ఎప్పుడో ఒకసారి ఏ బంధువుల పెళ్ళిలోనో కలిసినప్పుడు మాత్రం తనకు బోర్ కొడితే మాట్లాడే బుజ్జన్నయ్యను చూసి ఆనంద పడిపోయి, "పాపం బుజ్జన్నయ్యకు మనమంటే అభిమానమే! కానీ ఇంటికెళ్తే ఇలా ఉండడేమిటో? . పోనీలే ఇవ్వాళ తన సీజన్ బాగుంది" అని సరిబుచ్చుకుంటారు ఆ అల్ప సంతోషులు. అందుకే ఉన్నట్లుండి తనంతట తానుగా బుజ్జన్నయ్య అందరికీ ఫోన్ చేయటం గురించి అంత చర్చ!
సరే, ఒక వారం పాటు అందరూ బుజ్జన్నయ్య ఫోన్ గురించి మాట్లాడుకుని అలసిపోయాక మరుసటి వారంలో రోజుకొకరికి చొప్పున మళ్ళీ బుజ్జి నుండి ఫోన్ లు వచ్చాయి.
ఫోన్ చేస్తాడు , ఏమీ మాట్లాడడు. మౌనం పాలే ఎక్కువ విషయం అసలుకే ఉండదు. మళ్ళీ అందరూ ఫోన్లలో తమ జుట్టు తామే పీక్కున్నారు.
ఈ తతంగం అంతా చూస్తున్న ప్రకాష్ ఓ రోజు విసుగు పుట్టి "అబ్బా! ఆయన ఫోన్ చెయ్యటం, మీరేదో పెద్ద బ్రహ్మ రహస్యం కనుక్కోవాలి అన్నట్లు ఆపకుండా ఆన్లైన్ మీటింగ్ లు పెట్టడం, విసుగు పుడుతోంది. తిక్క బాచీ మీరూనూ.
అంత విశ్లేషించటానికి ఏముంది, మీ బుజ్జన్నయ్య పిల్లలు పెద్దవాళ్ళయ్యారుగా. వాళ్ళకీ పెళ్ళిళ్ళు చెయ్యాలిగా, ఇప్పటి దాకా పొట్ల చెట్టుకు పొరుగు గిట్టదన్నట్లు ఎవరితో కలవకుండా ఉన్నాడు, ఇప్పుడు నలుగురితో మంచిగా ఉండకపోతే తన పిల్లలకి మంచి సంబంధాలు రావని అందరితో కలవాలని ప్రయత్నిస్తూ ఉంటాడులే" అని తేల్చేశాడు ప్రకాష్.
ప్రకాశ్ మాటలకు "నిజమే అంతే అయ్యుంటుంది" అనుకున్నారు అందరూ.
అయితే కథ అక్కడితో ఆగితే కమామీషు ఏముంటుంది?
ఆ తర్వాత నెలలో పెద్ద మలుపు తిరిగింది.
ఓ నెల పాటు పచారీ కొట్టు సామాన్ల లిస్ట్ లో ఒక్కొక్కదానికీ టిక్కులు పెట్టుకు పోయినట్లు, ప్రతివారం తన తమ్ముళ్ళు చెల్లిళ్ళకు వరసగా ఫోన్ చేసిన బుజ్జి రెండో నెల నుంచి మిగిలిన వాళ్లకు తగ్గించి సునీతకు మాత్రం ఫోన్ల డోస్ పెంచాడు.
ఆ అంశం మీద మళ్ళీ సర్వ సభ్య సమావేశం చేసిన సునీతా వాళ్ళ కమిటీ సభ్యులకు ఒక అనుమానం వచ్చింది, కొంపదీసి బుజ్జన్నయ్య తన కూతురిని సునీత కొడుకు ధీరజ్ కి సంబంధం అడుగుదామని అనుకుంటున్నాడా అని!
ఆ అనుమానం రాగానే అందరూ ఆ ఆలోచనను ఖండించి, ఆ ఊహకే ఖేదం వ్యక్తం చేసి, సునీతకు ముందస్తు సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు.
"వామ్మో, ఇంకేమైనా ఉందా, ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కొంపకెళ్తే సరిగ్గా మంచి నీళ్ళు కూడా మొహాన పొయ్యరు, అలాంటి పెంపకంలో పెరిగిన పిల్లని చేసుకుంటే ఇక నువ్వు, బావగారు కాశీకి పోవాల్సిందే" అని ఒకరంటే..
"అవును, ఆ పిల్లల్ని కూడా ఎవరితో కలవనీకుండా ఓ మంచి, మర్యాద నేర్పకుండా పెంచారు బుజ్జన్నయ్య వాళ్ళు. పైగా బుజ్జన్నయ్య భార్య , అత్తగారు ఎవ్వరిని గెలవనిచ్చే రకం కాదు, రేపు పెళ్లవ్వగానే ఆ పిల్ల అరణం లా అమ్మమ్మని గానీ తోడు తెచ్చుకుందంటే నువ్వు, బావ గారు కాశీ వెళ్ళటానికి కూడా డబ్బులుండవు మీ దగ్గర, ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో మడతమంచాలు వేసుకొని పడుకోవాలి ఇద్దరూ," అని ఇంకొకళ్ళు అన్నారు.
అసలే తన కొడుకు ఈ ప్రపంచోత్తమ బ్రహ్మచారి అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని భావించే సునీత
"ఎందుకులే తల్లి, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిన్నారి కొడుకు వాడు! అభం శుభం తెలియని అమాయకుడు.
ఉన్న ఒక్కగానొక్క పిల్లాడికి అలాంటి సంబంధం చేయడమూ వద్దు, మేము గుళ్ళల్లో గొబ్బెల్లో పడుకోనూ వద్దు, అంతదాకా వచ్చి అన్నయ్య సంబంధం అడిగితే ఏదో ఒక వంక చెప్పి ఎగర గొట్టేస్తాలే" అంది .
పోనీ కథ ఇక్కడితో ఆగినా బాగుండేది. కానీ ఈ కథకి ఘాట్ రోడ్డులో లాగా ఓ హెయిర్ పిన్ కర్వ్ వచ్చింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే సీజన్ అన్నయ్య నుండి ఒక ఆకస్మిక, అనూహ్య, ఆశ్చర్యకర ఫోన్ కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే బుజ్జి తన భార్యా బిడ్డా సమేతంగా మరీ సునీత వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు.
ఆ హఠాత్ సంఘటనకు ఏమీ తోచలేదు సునీతా వాళ్ళ కు.
"ఇంకేముంది, సంబంధం అడగటానికే వస్తున్నాడు. అందుకే అందరినీ తీసుకు వస్తున్నాడు" అనుకుని ఎలా కాదనాలో ఏమి కారణాలు చెప్పాలో తెగ రిహార్సల్స్ వేసుకుంది సునీత.
కానీ బుజ్జన్నయ్య వాళ్ళని చూడగానే ఒక్క మాట రాకుండా సిరివెన్నెల సినిమాలో సుహాసినిలా అయిపోయింది సునీత పరిస్థితి.
దానికి కారణం బుజ్జన్నయ్య కూతురు అనన్య. ఎన్నాళ్ల తర్వాతో చూసారేమో, ఆ అమ్మాయి అందం చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు సునీత వాళ్లకు. ముఖం చూస్తే ముద్ద మందారంలా, కళ్ళను చూస్తే కలువ రేకుల్లా,
వంటి తీరు చూస్తే సన్నజాజి పువ్వులా మొత్తానికి ఓ నడిచే పూల బుట్టలా సునీతను విస్మయ పరిచింది.
ఇంక ధీరజ్ సంగతి చెప్పక్కర్లేదు. వాడికైతే ఆ పిల్ల మనసున్న మిఠాయి పొట్లంలా అనిపించిందేమో... వాళ్ళున్నంత సేపు మతిభ్రమించిన ఈగలాగా అక్కడక్కడే తిరిగాడు.
బుజ్జి బోలెడన్ని కబుర్లు చెప్పాడు, తెగ జోకులు వేశాడు. చనువుగా భోజనం చేసాడు. బుజ్జి భార్య లలిత కూడా భర్తను అనుసరించింది. ఆయన పిల్లలు కూడా చాలా పొందిగ్గా మాట్లాడారు. సునీతా వాళ్ళతో ఎన్నెన్నో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
అత్తయ్య వాళ్లకు పాట పాడి వినిపించమ్మా అని అనన్యతో పాట పాడించాడు బుజ్జి. వెళ్ళేటప్పుడు అత్తయ్య మామయ్య కాళ్ళకు దణ్ణం పెట్టమని పెట్టించాడు. ఆ పిల్ల కూడా ఎంతో ముచ్చటగా చెప్పినవన్నీ చేసింది.
పెళ్ళి సంబంధం మాట మాత్రం ఏమీ ఎత్తలేదు.
హఠాత్తుగా ఆ ఊరి ఆంజనేయస్వామి గుడిలో ఎప్పుడో మొక్కుకున్న మొక్కు గుర్తొచ్చిందనీ అందుకే దర్శనం కోసం వచ్చామని చెప్పాడు.
అలా ఒక పూట అంతా హడావిడి చేసి వెళ్ళాక వాళ్ళు అటు వెళ్ళీ వెళ్ళక ముందే ధీరజ్ బుజ్జీ వాళ్ళని, ముఖ్యంగా అనన్యనూ పొగడటం మొదలు పెట్టాడు. మీరంతా అంత మంచి వాళ్ళ మీద అనవసరంగా చెడు అభిప్రాయం పెట్టుకున్నారేమో అని అనుమానం వ్యక్తం చేసాడు. అనన్యను కోడలిగా తెచ్చుకోవటం ఎన్ని రకాలుగా ఆ ఇంటికి మంచిదో వర్ణించాడు.
మొత్తానికి ఆ అబ్బాయి అనన్య అందానికి బొక్కబోర్లా పడ్డాడని అర్థమైపోయింది సునీత కు.
అభం శుభం తెలియని చిన్నారి అనుకున్న తన కొడుకు అనన్య కు పెళ్ళి కొడుకుగా మారటానికి పడుతున్న తాపత్రయం తెలిసిపోయింది.
ప్రకాష్ కూడా "ఆ అమ్మాయి నడిస్తేనే నాట్యం చేసినంత అందంగా, మాట్లాడితేనే మంత్రం చదివినంత పద్ధతిగా ఉంది అలాంటి పిల్లను ఎలా వదులుకుంటాం సునీతా?" అన్నాడు.
ఇక సునీత పరిస్థితి కూడా అంతే!
దానికి తోడు ధీరజ్ ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా, ఎంత ఆస్తి పరుడు , కళ గల ముఖం అయినా
పిల్లాడు ఓ గుప్పెడు ఎత్తు తక్కువ ఉండటం,
వాళ్ళ గోత్రం వాళ్ళే ఎక్కువ ఉండి, సగోత్రీకులన్న కారణంతో మంచి సంబంధాలన్నీ తప్పిపోవడం..
ఈ రెండు కారణాలతో ధీరజ్ కి సంబంధం వెతకటం తను అనుకున్నంత సులభం కాదని సునీతకు ఈ మధ్యే అర్థమయ్యింది.
అందుకే అన్నీ కుదిరిన కుందనపు బొమ్మ లాంటి అనన్య ను వదులుకోవడానికి మనసొప్పలేదు !
ఇక ఆ తర్వాత జరిగిన తమ కజిన్ల శిఖరాగ్ర సమావేశంలో బుజ్జన్నయ్య మారిపోయాడని అందరికీ నచ్చ జెప్పింది సునీత!
ఒక వేళ ఆ ఇంట్లో పెంపకం సరిగా లేకపోయినా తన ఇంటికి వచ్చాక అనన్యకు మంచీ చెడూ నేర్పి తమ ఇంటి పద్ధతులు తనే అలవాటు చేసుకోగలను అంది. మొత్తానికి కిందా మీదా పడి అన్నయ్యతో సంబంధం కలుపుకోవడానికి
అక్కచెల్లెళ్ళు అందరితో ఔను అనిపించుకుంది.
కానీ బుజ్జన్నయ్య నుండి ఏ చడీ చప్పుడు లేకపోవటంతో ఒక చెల్లెలి తో "ధీరజ్ కి సంబంధాలు చూస్తున్నారు, నీకేమైనా ఉద్దేశ్యాలు ఉంటే అనన్య కోసం అడగమని అన్యాపదేశంగా చెప్పించింది".
అలా చేసినా కూడా ఆ తర్వాత రెండు నెలలయినా బుజ్జన్నయ్య నుండి ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
పైగా అంతకు ముందు వచ్చే ఫోన్లు కూడా ఆగిపోయాయి.
ఇంట్లో ఓ పక్క తన కొడుకు ధీరజ్ గోల ఎక్కువైపోయింది సునీతకు.
ఎప్పుడు చూసినా అనన్య గురించే ఆలోచించటం ,ఏదో ఒక రకంగా ఆ అమ్మాయి మాటే ఎత్తడం.. త్వరగా సంబంధం కుదర్చమని పీక్కు తినటం. దేవుడా! చిన్నప్పుడు చాక్లెట్ లు ఐస్ క్రీమ్ లు కొనమని కూడా ఇంత పేచీ పెట్టలేదు , ఇప్పుడీ వయసులో పెళ్ళి కొడుకు అవటం కోసం చిన్న పిల్లలలా మంకు చేస్తున్నాడు ఈ చిన్నారి పెళ్ళి కొడుకు అనుకుంది సునీత.
ఇక ఆ గోల తట్టుకోలేక ఒక రోజు "మనమే వెళ్ళి సంబంధం అడుగుదా"మని తీర్మానించింది.
"అదేంటి సునీతా, సంప్రదాయం ప్రకారం అమ్మాయి తరపు వాళ్ళే ముందు అడగాలిగా" అన్నాడు ప్రకాష్.
"ఆ, సంప్రదాయం లేదు, సాంబారన్నం లేదు, సమయం సందర్భాల బట్టే సంప్రదాయాలు.
మనసు ఉన్నా ముందడుగు వెయ్యటానికి మొహమాట పడుతున్నాడు మా బుజ్జన్నయ్య.
ఆ రోజు మనింటికి వచ్చినప్పుడు చూసారుగా ప్రత్యేకించి పిల్లను మనకెలా చూపించాడో. ఇన్నాళ్ళ నుండి కలవకుండా ఒక్కసారి సంబంధం అడగాలంటే తనకూ బెరుకుగా ఉంటుందిగా పాపం, అందునా మనలాంటి అన్ని రకాలుగా హై లెవెల్ సంబంధం అడగటానికి ధైర్యం చాలాలిగా.
అందుకే, మగ పిల్లాడి తల్లిని అయినా నేనే పెద్ద మనసు చేసుకుందాం అనుకున్నా. మన మధ్యలో పేద గొప్ప తేడాలేంటి అన్నయ్య, అని తనకు ధైర్యం చెప్పి సంబంధం కలుపుకుంటా" అంది సునీత.
ఓ శుభముహూర్తాన ఉన్న నగలన్నీ అలంకరించుకుని, ఆపసోపాలు పడుతూనే బరువైన పట్టు చీర కట్టుకుని, కావల్సినన్ని హంగులు ప్రదర్శిస్తూ సంబంధం మాట్లాడడానికి ప్రకాష్, ధీరజ్ లతో కలిసి బుజ్జి వాళ్ళ ఇంటికి బయలుదేరింది సునీత.
ఇక ధీరజ్ హడావిడి అయితే చెప్పక్కర్లేదు, ఆ రోజే పెళ్ళి అన్నట్లు తలనుండి కాళ్ళ వరకూ రక రకాల
వేసుకునేవి, పూసుకునేవి, పోసుకునేవి కొనుక్కుని మరీ ఆ రోజు కోసం తయారయ్యాడు.
ఆ గలాటా చూసి "వార్నీ, నా పెళ్ళి మొత్తం కలిపి కూడా ఈ రోజు వీడు పెట్టినంత ఖర్చు అవ్వలేదుగా, ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్ళికి ఏ ఆస్థి అమ్మించి ముస్తాబవుతాడో?" అనుకున్నాడు ప్రకాష్.
మొత్తానికి సునీత, ప్రకాష్ తమ కారులో, ధీరజ్ మాత్రం ఊహల పల్లకిలో ఎక్కి బుజ్జి వాళ్ళింటికి చేరారు.
....
తలుపు తియ్యంగానే ఎదురుగానే ఉన్న బుజ్జన్నయ్య సునీతా వాళ్ళ వైపు చిరాకుగా ఓ చూపు విసిరి గిరుక్కున లోపలికి వెళ్ళిపోయాడు అచ్చూ అదివరకులా.
ఆయన భార్య కూర్చోడానికి కుర్చీ చూపించినా ఏమీ మాట్లాడకుండా ఎటో చూస్తూ నిలబడి మీరు వెళితే నేను తలుపేసుకుంటా అన్నట్లుగా బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తోంది.
ఓ పక్క సునీత పరిస్థితి పెనం పై పరచిన దోశలా అట్టుడుకుతున్నా ఏదో ఒక మాట కలపాలని "పిల్లలు లేరా? అనన్య ఏది?" అని అడిగింది.
"అదా, లోపల పడుకుంది సునీతా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పటినుండి తనకు ఆ వాతావరణం పడక ఒకటే ఎలర్జీ .
"ఇంకెప్పుడూ ఆ పల్లెటూరి మాట ఎత్తకండి, ఆ పల్లెటూరి వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళకండి" అని తేల్చి చెప్పేసింది అంటూ నర్మగర్భంగా నవ్వింది లలిత.
తను అడగాలనుకున్న విషయం ముందే గ్రహించి ఆ మాట చెప్పింది వదిన అని గ్రహించి
"ఔను వదినా పడని చోటికి రాకపోవడమే మీకూ మాకు మంచిది" అని లేచి వచ్చేసింది సునీత. ఆమె వెనకనే ప్రకాష్, ధీరజ్.
"మొన్న మన ఇంటికి వచ్చి అంత ప్రేమగా గడిపి వెళ్లింది వీళ్లేనా అసలు?!" అని దిగ్భ్రాంతికి లోనయ్యారు ముగ్గురూ.
అప్పుడే అనన్యతో కలిసి పెళ్ళి పల్లకి ఎక్కి ఊహా విహారం చేస్తున్న ధీరజ్ అయితే....
అదే పెళ్ళిలో ఎక్కించిన గుర్రం పిచ్చి పిచ్చిగా పరుగెత్తి తనను తీసుకెళ్లి ముళ్ళ కంపల్లో పడేసినట్లు దేభ్యం మొహం పెట్టాడు.
బయల్దేరిన కొంచెం సేపటికి వీళ్ళ మొహాల్లో లాగే జీవం పోయి నీరసపడ్డ కార్ ను పెట్రోల్ బంక్ కు తీసుకెళ్తే అక్కడ బుజ్జన్నయ్య వాళ్ళ మేనమామ కొడుకు మహేష్ కనబడ్డాడు.
కుశల ప్రశ్నలు అయ్యాక బుజ్జి సంగతి ఏంటో తెలుసుకుని ఆ పజిల్ సాల్వ్ చేద్దామని, "ఏంటో ఈ మధ్య మీ బుజ్జి బావ అందరితో తెగ కలిసిపోతున్నట్లు ఉన్నాడు" అన్నాడు ప్రకాష్.
"కలిసిపోవటమా నా పిండాకూడా, అదేం లేదు. ఆయన గారు వాళ్ళ బావమరిది ఒక్కడితో తప్ప ఎవరితో మాట్లాడడుగా. ఎంత అణచుకున్నా లోపలున్న సహజ తిక్క ఎప్పుడొకప్పుడు తోక తొక్కిన నక్కలా లేవకపోదుగా. ఆ బావ మరిది తో కూడా మిగిలిన వాళ్ల తోలానే ప్రవర్తిస్తే మొన్నీ మధ్య ఇద్దరికీ చెడి మాటా మాటా అనుకున్నారట.
ఆ కోపంలో ఆ బావమరిది
" నువ్విలాంటి వాడివి కనుకే నీ బంధువులు ఎవ్వరూ నీ మొహం చూడరు, మా అక్కయ్యని ఇచ్చాం కనుక నా ఖర్మ కాలి ఇన్నాళ్ళూ నేనయినా మాట్లాడాను. నీ మూలాన అత్తింటి వైపు నుండి మాట్లాడించే దిక్కు లేక మా అక్క అల్లాడుతోంది" అని తిట్టి పోసి, తనూ బుజ్జి బావతో మాట్లాడడం మానేశాడట.
ఆ ఉక్రోషంతోనే ఈయన గారు తనకూ బంధువులు ఉన్నారని ఆ బావమరిది కి చూపించుకోవటం కోసం ఇటు మా వైపూ అటు మీ వైపూ అందరి వెంటా పడ్డాడు.
అందరికీ ఫోన్ చేసి, మాట కలిపి, మంచిగా మాట్లాడిన వారి ఇళ్ళకు సపరివార సమేతంగా వెళ్ళి, ఫోటోలు తీసుకొని వాటిని వాట్సప్ స్టేటస్‌లుగా పెట్టి .. "చూసావా నాకు ఎంత మంది బంధువులు ఉన్నారో" అని తన బావ మరిదికి చూపించుకున్నాడు.
అలా ఇటు అమ్మ వైపు చుట్టాలని, అటు నాన్న వైపు వాళ్ళనీ ఒకేసారి ఓ పట్టు పట్టాడన్నమాట మా బుజ్జి బావ .
ఏదో ఆయన మారాడనుకున్నాం కానీ అంతా మన భ్రమ.
ఇప్పుడు ఆ బావ మరిది, తనూ మళ్ళీ కలిసిపోయారట! అందుకే మళ్ళీ ఇక మన మొహం చూడటం మానేశాడు" అన్నాడు మహేష్.
"ఏంటీ నీకూ అయ్యిందా మళ్ళీ ఆ సత్కారం" నీరసంగా అడిగింది సునీత.
"ఆహా, మొన్న రోడ్డు మీద కనిపిస్తే బావా! అని భుజం మీద చెయ్యేస్తే పురుగుని విదిలించినట్లు విదిలించి పొయ్యాడు. వారంలో ఇంత మార్పు ఏమిటా అని నేను నివ్వెరపోయి వాళ్ళక్కకు ఫోన్ చేస్తే ఇదంతా తను చెప్పింది. తను మనకన్నా ఎక్కువగా తప్పించుకోలేని బాధితురాలుగా!
ఆ విధంగా
అయిన వాళ్ళని పట్టు- సెల్ఫీ కొట్టు,
స్టేటస్ పెట్టు - బామ్మర్ది కి చూపెట్టు.
అనబడే యజ్ఞంలో మనందరం సమిధలము కాబడ్డామన్న మాట."
అని పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మహేష్.
"అయ్యో రామ! వీళ్ళంతా ఉట్టిగా ఆయన మాటల మీదే ఆశ పెట్టుకున్నారు కనుక ఇంత సులభంగా దులిపేసుకుంటున్నారు, మనమేమో ఏవేవో ఊహించుకుని పిల్లాడిని కలుపుకుని మరీ ఎక్కడికో వెళ్లి పోయాం , మనం ఇంత సులభంగా వెనక్కిరాలేం, టైమ్ పడుతుంది." అని నిట్టూర్చాడు ప్రకాష్.
"హ్మ్మ్... ఇంత ఘోరంగా మనుషులను తన స్వార్థం కోసం వాడుకుంటాడా , మనుషుల మనసులు- అనుబంధాలకు విలువే ఇవ్వడా అసలు! ఏదో ఒక రోజు భగవంతుడు గుణ పాఠం నేర్పకపోడు" అని విరుచుకు పడింది సునీత.
" దేవుడు తనకు గుణపాఠం నేర్పినప్పుడు తను నేర్చుకుంటాడులే కానీ భగవంతుడు ఇప్పుడు మనకు నేర్పిన గుణపాఠాన్ని మనం నేర్చుకుందాం ముందు" అన్నాడు ప్రకాష్.
"మనకు గుణపాఠమా, మనమేం తప్పు చేశాం ఇందులో?" కోపంగా అడిగింది సునీత..
"ఏం చేశామా? మీ అన్నయ్య తన అందమైన కూతుర్ని ఇస్తాడన్న నమ్మకంతో ఈ మధ్యలో వచ్చిన ఎంతమంది అమ్మాయిలకు ఎన్ని వంకలు పెట్టి తిరస్కరించారు మీ అమ్మా కొడుకులు?
మొన్నొక ఉద్యోగం చేసే అమ్మాయి సంబంధం వస్తే ఏమన్నావు నువ్వు?
"ఆ, అమ్మాయిలు పెళ్ళికి ముందు నాకింత ప్యాకేజ్ నాకంత ప్యాకేజ్ అని చెప్పుకుంటారు కానీ పెళ్లవ్వగానే కడుపనీ, బాలింతననీ ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చుంటారు" అన్నావా లేదా?
ఆడదానివి అయ్యుండి సాటి స్త్రీ గురించి, అందునా మాతృత్వం గురించి అంత తేలిగ్గా ఎలా మాట్లాడ గలిగావ్?
పోనీ నీ కొడుకే కడుపుతో ఉండి, పిల్లల్ని కనగలదేమో చూడు, అప్పుడా అమ్మాయి ఖచ్చితంగా ఉద్యోగం మానెయ్యకుండా ఉండగలదు. అందామనిపించింది నాకు.
నీ కొడుకు కూడా ఏమీ తక్కువ తినలేదు. అందాల భరిణ లాంటి అమ్మాయిని చూసి ఆశ పడటం తప్పని నేను అనను. కానీ ఆ సంబంధానికి నువ్వు ఒప్పుకోవేమో అని నిన్ను ఒప్పించటానికి ఏమని అన్నాడు?
" బుజ్జి మామయ్య వాళ్ళు మనతో పోలిస్తే లేనివాళ్ళే కదా అమ్మా, పేదింటి పిల్లని చేసుకుంటే మనం చెప్పినట్లు పడి ఉంటుంది అనలా?
అంటే అదేదో సినిమాలో చెప్పినట్లు, ఆ అమ్మాయి పట్ల గౌరవాన్ని కాదు, చిన్నతనాన్ని సృష్టించి వివాహ బంధానికి పునాది వేద్దామనుకున్నాడు, ఎంత తప్పు?"
"ఏదో నేను వాళ్ళ సంబంధం ఇష్టపడనేమోనని, పాపం నన్ను ఒప్పించడం కోసం లౌక్యంగా మాట్లాడాడులేండి పిల్ల సన్నాసి, అదీ తప్పేనా?"
"లౌక్యం అంటే ఎదుటి మనిషిని నొప్పించకుండా నిజాయితీ నిలుపుకోవడానికి సాధనం అవ్వాలి కానీ నిజాన్ని అబద్ధంతో అపభ్రంశం చేసే ఆయుధం కాకూడదు సునీతా .
ఇవన్నీ నేనూ ముందే చెప్పాలి కానీ మీ ఇద్దరి ఆరాటంలో నాకు మాట్లాడే అవకాశం ఏదీ! సరేలే ఇప్పటికైనా దారిలోకి వద్దాం, పద" అని సునీత భుజం తట్టాడు ప్రకాష్.
సునీత కార్లోకి ఎక్కేటప్పటికీ వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్న ధీరజ్ ధైర్యం కోల్పోయి డీలపడిపోయి దిక్కుల వంక తిక్క తిక్కగా చూస్తూ ఉన్నాడు.
"రామచంద్రా! ' మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలకబోసుకున్నారని' సామెత చెప్పినట్లు మా సీజన్ అన్నయ్య మీద ఆశ పెట్టుకుని మధ్యలో వచ్చిన మంచి మంచి సంబంధాలన్నీ వదులుకున్నాం.
చిన్నప్పటి నుంచీ అలవాటయిన నేనే తట్టుకోలేక పోతున్నాను. ఇంక ఈ సీజన్ మామయ్య వేసిన సీజనింగ్ ఘాటు నుండి నా చిన్నారి పెళ్ళి కొడుకు ఎప్పటికి తేరుకుంటాడో" అని తల బాదుకుంది సునీత.
సైంధవ లవణం
'' చూడండీ!..మీకిదే చెప్తున్నా..
నేను ఆ డాక్టర్ చెప్పిన పాపిష్టి తిళ్ళూ తినను,.అట్లాంటి డాక్టర్ చెప్పిన మందులూ మింగను. అసలు ఇంకోసారి నన్ను అలాంటి అస్తవ్యస్తపు డాక్టర్లు దగ్గరకి తీసుకువెళ్లారంటే నేను రమణమహర్షి ఆశ్రమానికి పోతా " ఇంటికి వస్తూనే విరుచుకుపడింది శాంతమ్మ గారు.
ఆ మాట అంటూనే హాల్లోనుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది ,మారుమాట్లాడే అవకాశం రామారావు గారికి ఇవ్వకుండా..
వంటింట్లోకి వెళ్లేముందు శాంతమ్మ గారు గుమ్మంలోనించే చెప్పులను కాళ్లతోనే డైరెక్ట్‌గా షూ రాక్ లోకి విసుగ్గా విసిరిన విసురు చూసి... మాంచి ప్రావీణ్యత గల ఫుట్‌బాల్ ప్లేయర్ గోల్ కొట్టే విధానం గుర్తొఛ్చి...
కొంత దిగ్భ్రాంతికి మరింత భయ భ్రాంతికీ గురయ్యాడు రామారావు గారు.
వంటిట్లోకి వెళ్లిన శాంతమ్మగారు అదే విసురుని వంటింట్లోని పాత్రలపై ప్రదర్శిస్తున్నట్లుంది ,
'ఆకాశం నుండి స్టీలుగిన్నెల వర్షం పడుతోందా' ! అన్నట్లు శబ్దం రాసాగింది వంటింట్లోనుంచి.
ఈ హడావిడికి ..ఏంజరుగుతోందా అన్న ఖంగారుతో తన గదిలోంచి అమాంతం హాల్లోకి దూకాడు, వాళ్ళ అబ్బాయి కృష్ణ ..'ఉడికే ఉడికే బాండీ లోంచి బయటకు చిందిన కూరముక్క లాగా' .
"ఏమయ్యింది నాన్నా? " అడిగాడు ఆల్మోస్ట్ అచేతనావస్థలో నిలబడ్డ తండ్రిని కుదుపుతూ..
''ఏమయ్యిందా ? మొన్ననే 70 నిండి 71వ ఓవర్లోకి ప్రవేశించిందా మీ అమ్మ, టెండూల్కర్ లాగా డబల్ సెంచరీ కొట్టింది ,బీపీ లో .. 200 130 ఉన్నది .. ఆ డాక్టర్ ఒక పక్క అర్జెంటు గా మందులు మొదలుపెట్టమని మందులు రాసిస్తే ..వద్దంటే వద్దని నా రెక్కలు పట్టుకుని లాక్కొచ్చింది . అదేమంటే ఏమీ చెప్పకుండా ఆ డాక్టర్ ని తిట్టిపోస్తోంది .. మీ అమ్మ పెంకి తనానికి తోడు ఈ బీపీ ఒకటి , అసలే కోతి- ఆపై కల్లు తాగింది అన్నట్లుంది వ్యవహారం.." వాపోయారు రామారావు గారు
"మీరు నన్ను కోతి అనుకోండి,, పిల్లి అనుకోండి,.. కానీ ఆ డాక్టర్ పేరు నా ముందు ఎత్తకండి". వంటింట్లోనుంచి రివ్వున వస్తూ అన్నది రామారావుగారి మీద ఓ చెవి వేసుంచిన శాంతమ్మ గారు.
''ఏంటి నీ గోల శాంతం? అంత మంచి డాక్టర్ నీకెందుకు నచ్చలేదు అసలు?'' విసుక్కున్నారు రామారావు గారు.
ఓయబ్బో..కాపురం చేసే కళ కాలుతొక్కినప్పుడే బయటపడింది అన్నట్లు.. ఆయన ఎంత గొప్ప డాక్టరో బీపీ తగ్గడానికి ఆయన గారు చెప్పిన చచ్చు సలహా తోనే అర్ధమయ్యింది.. మీ ఫ్రెండ్ కొడుకని మీరేమో ఆయన దగ్గరికి తీసుకెళ్లడం.., ఆ మహానుభావుడేమో చిన్నంతరం పెద్దంతరం లేకుండా అడ్డమైన పాడు తిండ్లు తినమని చెప్పడం. ఎదో అభం శుభం తెలియని అమాయకులకు చెప్పినట్లు గా పాపం పుణ్యం ఎరిగిన నా బోటివాళ్ళకీ చెప్తే ఎట్లా అంట? అసలు నాకైతే అక్కడికక్కడే ఆ డాక్టరుని నాలుగు దులిపెయ్యాలనిపించింది కానీ ఎవరిపాపాన వారే పోతారని వదిలేసా . పోనీ మీ ఫ్రెండ్ కొడుకన్నారుగా, మీరైనా ఆ అబ్బాయిని '' పెద్దావిడని అలాంటి పాపిష్టి తిండ్లు తినమనడం ఏంట"ని మందలిస్తారేమో అంటే..తానా అంటే తందానా అంటూ ఆ డాక్టర్ చెప్పినదానికల్లా గంగిరెద్దు లాగా తల ఊపి వచ్చారాయె '' దెప్పిపొడిచింది శాంతమ్మ గారు.
"అంత చెప్పరాని సలహా ఏమి చెప్పాడమ్మా "ఆ డాక్టర్ ? అడిగాడు కృష్ణ..
''ఏమి చెప్తాడురా? మార్నింగ్ వాక్ చెయ్యమన్నాడు, పచ్చి కూరలు తినమన్నాడు, పచ్చళ్ళు, ఉప్పుకారాలు తగ్గించమన్నాడు. అందులో ఏమి తప్పుంది?'' అన్నారు రామారావు గారు.
'వాటన్నిటి గురించీ ఎవరేమన్నారు "
మరి ఇంకేంటి ?
" ఇంకేంటా..ఆ ఉప్పు విషయమే ..నాకు వళ్ళు మండుతున్నది."
"ఉప్పు ఏంటి. ?తగ్గించామన్నాడు అంతేగా ..హై బీపీ వఛ్చిన వాళ్ళని ఉప్పు తగ్గించమనక పూటకో బస్తా కంచంలో గుమ్మరించుకు తినమంటారా ?"
"ఆ మాత్రం ఉప్పు తగ్గించాలని నాకూ తెలుసు,, మా వంశం లో 5 తరాలనుండీ అందరికీ రక్తపోటు ఉందట ".
"ఆ విషయం ఇందాక నువ్వు వంటింట్లో గిన్నెలతో కధాకళీ ఆడించినప్పుడే అర్ధమయ్యిందిలే.. పైగా మీ పుట్టింట్లో అన్నీసొట్టలు పడ్డ బొచ్చలేగా ? అయినా అసలు ఆ డాక్టర్ చెప్పిన వేటితో సమస్య లేదన్నదానివి ఇందాకటినుండి ఎందుకా డాక్టర్ ని ఆడిపోసుకుంటున్నట్లు శాంతం ?
"ఎందుకేంటీ? మీరూ విన్నారుగా ? ఆ డాక్టర్ ఉప్పు తగ్గించమంటే పర్వాలేదు కానీ వాడే కొంచెమ్ ఉప్పు కూడా అదేదో దిక్కుమాలిన ఉప్పు వాడమనలేదూ? అది తలుచుకుంటేనే నా వళ్ళంతా జెర్రులు పాకినట్లుంది. అంది శాంతమ్మ గారు
"దిక్కుమాలిన ఉప్పా? నీ తలకాయ. ఆయన వాడమన్నది దిక్కుమాలిన ఉ ప్పుకాదు, దిక్పాలక ఉప్పు కాదు. దాని పేరు సైన్ధవలవనం . బీపీ వఛ్చిన వాళ్లకి ఆ ఉప్పు వాడితే మంచింది.అయినా వంశ పారంపర్యంగా బీపీ తెచుకున్నదానివి మీ వాళ్ళెవరూ సైన్ధవలవనం వాడటం తెలీదా నీకు?'' అడిగారు రామారావు గారు.
తాడంత ఎత్తున లేచింది ఆ మాటకి శాంతమ్మ గారు.
''ఛీ ఛీ , మా ఇంటా వంటా లేదు అలాంటి పాపిష్టి లవణాలు గివణాలూ తినడం. ఏమనుకున్నారో మా పుట్టింటి వాళ్లంటే .నేనెప్పుడూ అసలా పేరు కూడా వినలేదు. అయినా చీర తో పాటు జాకెట్టు, నెక్లెస్ తో పాటు దుద్దులు లాగా బీపీ తో పాటే సైన్ధవలవనం ఏమైనా సెట్ ఆ ఏంటి ? బీపీ వచ్చిన ప్రతివాళ్ళు అదీ తెచ్చుకు తిని తీరడానికి? "దబాయించింది శాంతమ్మ గారు.
"అదికాదు అమ్మా . బీపీ వచ్చినప్పుడు మాములు ఉప్పు మంచిది కాదు. అలా అని అస్సలు ఉప్పు మానేస్తే అసలుకే తిండి సహించక నీరసిస్తావు. 2 రోజులకన్నా ఎక్కువ ఆ చప్పటి తిండి తినలేవు . అదే సైన్ధవలవనం అయితే బీపీ ఎక్కువ పెంచదు, రుచీ మాములు ఉప్పు లానే ఉంటుంది '' నచ్చ్చచెప్పపోయాడు కృష్ణ ,
అబ్బా పోనిరా కృష్ణా.. బీపీ ఉంటె ఉండనీ.అదే ఓ పక్కన పడి ఉంటుంది. అంతేకానీ దానికోసం ఇప్పుడీ పాపిష్టి తిళ్లన్నీ తినలేనురా '' చెప్పింది శాంతమ్మ గారు.
''ఓ పక్కన పడి ఉండటానికి బీపీ ఎమన్నా రిటైర్ అయినా మొగుడు అనుకుంటున్నావా? వళ్ళంతా పీకి పాకాన పెడుతుంది.ఏమనుకుంటున్నావో? హెచ్చరించారు రామారావు గారు.
"అయినా అమ్మా... ఉప్పు మార్చినంత మాత్రాన అది పాపిష్టి తిండెలా అయిపోతుందమ్మా? నేనేమన్నా రేపటినుంచి దారికాచి కిడ్నాపులు, హత్యలు చేసి ఆ డబ్బుతో ఆ ఉప్పు కొంటానా? వాపోయాడు కృష్ణ.
"అదికాదురా కృష్ణా.. ఊహ తెలిసినప్పటి నుంచీ రామాయణ మహాభారతాలు చదివిస్తూ పెంచింది నన్ను మా బామ్మ. సంధ్యగొబ్బెమ్మ నోము నుండి మొన్నీమధ్య చేసిన లక్ష వ్రత్తుల నోము దాకా స్త్రీల వ్రతకథల పుస్తకంలో చెప్పిన నోములన్నీ చేసుకున్న దాన్ని నేను . పూజా పునస్కారం అవ్వకుండా పచ్చి గంగైనా ముట్టుకోను.
అలాంటిది ..ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు చేసుకున్న పుణ్యమంతా బూడిదపాలయ్యేట్లుగా నేనిప్పుడా సైన్ధవలవనం తినాలా? ఏం.. మాములు ఉప్పు తింటే ఇప్పుడే పోతానా? ఆ పాపిష్టి లవణం తింటే మాత్రం ఇంకో వందేళ్ళుంటానా ?" చిన్నబుచ్చుకున్నారు శాంతమ్మ గారు.
ఆవిడ తీరు అర్ధం కాక అయోమయంగా ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు కృష్ణ రామారావు గారు.
" అది కాదు శాంతం..నువ్వు చెప్పిన నీ పుణ్యాల చిట్టా అంతా సరే గానీ సైన్ధవలవణానికి దానికీ ఏంటి సంబంధం?" అడిగారు రామారావు గారు.
బుగ్గలు నొక్కుకుంది శాంతమ్మ గారు. బోలెడంత ఆశ్చర్యం తో రామారావు గారిని చూస్తూ ...
"మీకింకా అర్ధం కాలేదా? నిజం గా ??"అడిగింది శాంతమ్మ గారు.
"నిజం శాంతం , ఒట్టు "అన్నారు రామారావు గారు.
"అయ్యో రామ!! "అంటూ తల బాదుకుంది శాంతమ్మ గారు.
"అందుకే.. నేను నెత్తీ నోరు బాదుకుని మరీ రోజూ చెప్పేది. ఈ వయసులోనైనా కొంచెం భక్తి, జ్ఞానం పెంచుకోండి. ఎప్పుడూ ఆ దిక్కుమాలిన న్యూస్ ఛానెల్స్ చూడకుండా అప్పుడప్పుడూ పురాణప్రవచనాలు వినండి అని. వింటారా మీరు..చూసిన వార్తలే చూసీ చూసీ బట్టికొట్టడం, పనీ పాట లేని వాళ్ళు నలుగురు చర్చ పేరుతో టీవీలకు ఎక్కి కొట్టుకు చస్తుంటే వినోదం చూడటం, లేదంటే ఎవరెవరో ఆడిన ఆటలన్నీ రోజంతా కూర్చుని చూడటం.... ఇహ మీకేమి అర్ధమౌతుంది నా బాధ?
అయినా ఎదో సామెత చెప్పినట్లు నా పిచ్చి గానీ మీకు ఆ మాత్రం పురాణజ్ఞానం ఉంటే ఇందాకటినుండి నాకీ ఘోషంతా ఎందుకుండేది? అక్కడే ఆ డాక్టరుని మీరే
నాలుగు అక్షింతలేసి, "నువ్వు వద్దు, నీ వైద్యం వద్దు" అని చెప్పే వారు కాదూ".. మొత్తుకుంది శాంతమ్మ గారు.
అటు తిరిగి ,ఇటు తిరిగి నా వార్తల మీద, స్పోర్ట్స్ మీద పడద్దులే కానీ... ఇంతకీ నీ పుణ్యానికీ ఆ సైన్ధవలవణానికి సంబంధం ఏంటో చెప్పి ఇంకొంచెం పుణ్యం కట్టుకో శాంతం . నీరసంగా అభ్యర్ధించారు రామారావు గారు.
"పుణ్యానికి కాదు పాపానికీ సైన్ధవలవణానికీ ఉంది సంబంధం. ఎంత పాపాత్ముడు ఆ సైన్ధవుడు ? మరి ఆ దుర్మార్గుడు సైన్ధవుడి లవణం తింటే పాపం రాదూ ? అయినా సైన్ధవుడి లవణాలు, జరాసంధుడి లవణాలు తిని మహా పాపం మూట కట్టుకోవాల్సిన అగత్యం ఏంటి నాకు ?మనం తినే ఆహారమే మనం ఏంటో నిర్ణయిస్తుంది అంటారు కదా.. ఇప్పుడు నేను ఆ రాక్షస వెధవ లవణం తిని వాడి లాగా రాక్షసి బుధ్ధులు తెచ్చుకుని అధోగతి పాలవ్వాలంటారా?
అయినా బీపీ తగ్గించడానికి ఆ డాక్టరుకి ఆ ముదనష్టపు సైన్ధవుడే దొరికాడా... కావాలంటే ఏ ధర్మరాజు లవణమో భీష్ముడి లవణమో ఇవ్వమనండి .. శుభ్రంగా తింటాను ''
ఉపోద్ఘాతం మొదలు పెట్టిన అరగంటకి అసలు వార్త మొదలుపెట్టే 24 గంటల వార్తా ఛానల్ న్యూస్ రీడర్ లాగా ఇప్పటికి అసలు విషయం బయటపెట్టింది శాంతమ్మ గారు
శాంతమ్మ గారి మాటలు విని ఒక్క నిమిషం మెదడు తిమ్మిరెక్కినట్లయింది రామారావు గారికి, ...
కృష్ణకైతే ఎముకల లోపల మజ్జలో ఎవరో దురదగుంటాకు పూసినట్లయ్యింది... ఎలా గోక్కుంటే ఆ దురద తగ్గుతుందో తెలియని అయోమయ అచేతనావస్థలో పడిపోయాడు కృష్ణ.
శాంతమ్మ గారితో ఇలాంటి విష'యాల్లో ఎక్కువ అనుభవం ఉన్న రామారావు గారే ముందు తేరుకున్నారు .
మెదడు తిమ్మిరి విదిలించి వదిలించుకోవడానికా అన్నట్లు తలని గట్టిగా పైకి, కిందికి ఊపుతూ పగలబడి నవ్వసాగారు . ఆలస్యంగా తెలివిలోకి వఛ్చిన కృష్ణకీ నవ్వు ఆగలేదు.
"ఓసి నీ ఇల్లు బంగారం కానూ.. అదా నీ గోల ఇందాకటినుంచీ.. సైన్ధవ లవణం అంటే మహాభారతం లో సైన్ధవుడికి సంబంధించిన లవణం అనుకున్నావా !! వాడేమన్నా సముద్రమా వాడి నుంచి ఆ ఉప్పు తయారవడానికి ? మనిషి. మోకాలికీ బోడిగుండుకీ సంబంధం పెట్టినట్లు సైన్ధవుడికీ ,సైన్ధవ లవణానికీ సంబంధం ఏంటే శాంతం ,, నీ తలకాయ కాకపోతే.." కడుపు పట్టుకు మరీ నవ్వసాగారు రామారావు గారు.
నిర్లక్ష్యంగా రామారావు గారి వైపు " మీ బొంద"అన్నట్లు ఒక చూపు విసిరి, భర్త కనుక మరీ డైరెక్ట్ గా ఆ మాట అనలేక ఓ నిట్టూర్పు విడిచి ,,ఇలా సెలవిచ్చింది శాంతమ్మ గారు.
"నా తలకాయా లేదు, మెడకాయా లేదు...ఎదో ఒక సంబంధం లేకపోతే ఆ లవణానికి అసలు వాడి పేరు ఎందుకు పెడతారు? ఇప్పుడూ... విదురుడు చెప్పిన నీతులకి విదుర నీతులనీ ,యక్షుడు వేసిన ప్రశ్నలకి యక్ష ప్రశ్నలనీ పేరు లేదూ..అలాగే... ఇదేదో ఆ సైన్ధవుడికి సంబంధించిన లవణమే అయ్యి ఉంటుంది. అందుకే ఆ పేరు.
అయినా చెల్లెలు వరస అయిన ద్రౌపదీ దేవిని చెరచడానికి చూసిన వాడు, ముక్కు పచ్చ లారని అభిమన్యుడి చావుకి కారణమైన వాడూ...అటువంటి ఆ సైన్ధవుడి ఉప్పు తినమన్న ఆ డాక్టరుని చెప్పుతో కొట్టాలి "... ఆగ్రహోదగ్రురాలయ్యింది శాంతమ్మ గారు..
బీపీ వలన ఆవిడకి ఆవేశం పెరుగుతోందని గ్రహించిన కృష్ణ కాసేపు ఆ విషయం పై వాదన వదిలెయ్యమన్నట్లు రామారావు గారికి కనుసైగ చేసాడు. సరే అని మౌనం దాల్చారు రామ రావు గారు.
వంటింట్లో వంట చేస్తూ ఉన్న శాంతమ్మ గారి కోడలు రుక్మిణికి హాల్లో అత్తా మామ భర్తల సంభాషణలో కొంతే వినబడింది. మిగిలినదంతా మిక్సీ కుక్కర్ ల శబ్దాలలో కలిసిపోయింది. తాను విన్నదాని ప్రకారం అత్తగారికి మాములు ఉప్పు పనికిరాదని అదేదో సైన్ధవలవణమనే కొత్త ఉప్పు వాడాలనీ మాత్రమే అర్ధమైంది రుక్మిణికి..
"మరి తెచ్చ్చారా ఆ సైన్ధవలవణమేదో..ఇస్తే అత్తయ్యగారికి విడిగా తీసిన పప్పు కూరల్లో కలిపేస్తా " అంటూ హాల్లోకి దూసుకొచ్చింది.
అప్పుడే శాంతమ్మ గారి ఆవేశం తగ్గిద్దామని ఓపక్క తమ నోళ్ళని పాకింగ్ పూర్తయ్యిన బస్తాల లాగా గట్టిగా కట్టేసుకు కూర్చుంటే..రుక్మిణి వలన మళ్ళీచర్చ మొదలై రచ్చ జరుగుతుందని భయపడ్డాడు కృష్ణ..
ఆ సైన్ధవలవణం విషయం మాట్లాడ వద్దనీ , అక్కడినుండి వెళ్లిపొమ్మనీ అర్ధం వచ్చేట్లుగా కళ్ళతో, నోటితో, చేతితో ,ముక్కుతో.. రకాలుగా సైగలు చేసాడు. కృష్ణ కూచిపూడి డాన్సర్ లెవెల్లో సర్వాంగాల్నీ సర్వదిశలకీ తిప్పి ఎంత అభినయించినా, రుక్మిణి కృష్ణ వైపు కన్నెత్తైనా చూడకుండా ద్రోణాచార్యుడి పరీక్షలో పాల్గొంటున్న అర్జునుడిలా లక్ష్యం మీదే ధ్యాస పెట్టి ..
" తెచ్చారా ఆ సైన్ధవ లవణం" అంది మళ్ళీ .
పళ్ళు బిగబట్టి, బండ గొంతుతో "లేదు, తేలేదు" అన్నాడు కృష్ణ..
తనలోని డాన్సర్ ని గుర్తించక పోయినా కనీసం తనలోని మిమిక్రీ ఆర్టిస్ట్ నైనా రుక్మిణి గుర్తిస్తుందేమో.. తన గొంతులోని తేడా గుర్తించి తన వైపు తిరిగితే మళ్ళీ సైగలు చేసి తరిమేద్దాం అన్న ఆశతో..
ఆడ అర్జునుడి అపర అవతారమైన రుక్మిణి దృష్టి మాత్రం చెట్టుమీద పక్షి కంటి నుండి...అదే సైన్ధవ లవణం నుండి ఏ మాత్రం చెదరలేదు.. తన ధోరణి కంటిన్యూ చేస్తూ అడిగింది..
''అయ్యో తేలేదా? పోనీ కిరణ్ ని పంపించి తెప్పిస్తాను,ఇంతకీ ఎక్కడ దొరుకుతుంది ఆ సైన్ధవలవణం?''
"కురుక్షేత్రం లో... పోయి తెచ్చుకో " అన్నాడు కృష్ణ ..వళ్ళు మండిపోయి..
అప్పటిదాకా ఎదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్న శాంతమ్మగారు కృష్ణ మాట విన గానే ఎదో స్ఫూరించినట్లు ..రెండు చేతులు చరుస్తూ అదీ సంగతి అన్నారు..
రామారావు గారి వైపు తిరిగి చూపుడు వేలు గాలిలో ఊపుతూ.. చూసారా.. నా బాధ తెలిసిన భగవంతుడు నా కొడుకు నోటిద్వారానే నాకు క్లూ ఇప్పించాడు .
ఏమిటీ....నీరసంగా అడిగారు కొడుకు సైగల వాల్ల భార్యతో వాదించే అవకాశం కోల్పోయిన రామారావు గారు.
మీరే విన్నారుగా.. సైన్ధవ లవణం ఎక్కడ దొరుకుతుంది అంటే కురుక్షేత్రం లో అన్న కృష్ణ మాట.. అదే నిజం. కురుక్షేత్రంలో సైన్ధవుడిని అర్జునుడు చంపేసాక , అంత పాపాత్ముడికి కూడా అంత్యక్రియ లు ఎందుకని వదిలేసి ఉంటారు.. వాడి శరీరం నుంచి ఎముకలు బయట పడ్డాక ఆ ఎముకల పొడిని నూరి ఉప్పులో కలిపి మందు గా తయారు చేసుంటాడు ఆ కాలపు అతితెలివి అప్రాచ్యపు డాక్టర్ ఎవడో.. అదే సైన్ధవ లవణం .. తత్త్వం బోధించిన లెవెల్ లో తేల్చి చెప్పారు శాంతమ్మ గారికి...
ఐన్‌స్టీన్ కైనా అర్ధం కానీ , అనితర సాధ్యమైనట్టి ఆవిడ సమన్వయం కలిగించిన అయోమయానికి గుడ్లు తేలేసారు కృష్ణ, రామారావు గారు. తలకి ఎటువైపు నుండి మొదలు పెట్టి జుట్టు పీక్కుంటే ఎక్కువ రిలీఫ్ గా ఉంటుందో అన్న ఆలోచనలో నిమగ్నమయిపోయారు.
ఇంతలోకి .."అవునా అత్తయ్య గారూ, సైన్ధవుడు , అంత చెడ్డవాడా? "
అంటూ ధర్మసందేహాలు కార్యక్రమం మొదలుపెట్టింది పురాణాల్లో పాస్ మార్క్ జ్ఞానం కూడా లేని రుక్మిణి...
కోడలు ఇచ్చిన ఆ ప్రోత్సాహానికి ఇక తనని ఆపడం ఎవరి తరమూ కానంత స్థాయి కి వెళ్ళిపోయింది శాంతమ్మ గారు..నిత్యానంద స్వామి లెవెల్లో ప్రవచనం కొనసాగించింది.
"అవును రుక్మిణీ ! ఆ సైన్ధవ సన్నాసి చెల్లెలు వరుస స్త్రీని చెడు దృష్టితో చూడడమే కాకుండా అభిమన్యుడి మరణానికి కూడా కారకుడయ్యాడు.
నువ్వు చూసావుగా ఈ మధ్య మాయాబజార్ సినిమా కలర్ లో ..ఎంత ముచ్చటగా
ఉన్నారు నాగేశ్వర రావు ,సావిత్రీ..అభిమన్యుడు, శశిరేఖలుగా.. వాళ్ళిద్దరి పెళ్ళికి కృష్ణ భగవానుడు ఎన్ని పాట్లు పడతాడూ? అంతా కష్టపడి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే సైన్ధవుడి వలన కదూ...కాళ్ళ పారాణి ఆరక ముందే అభిమన్యుడు పోయి , శశిరేఖకి అన్యాయం జరిగిపోయింది??
మొన్నీ మధ్యే నర్తనశాల సినిమా కూడా చూపించా గుర్తుందా నీకు? అందులో శోభన్ బాబు.., అదే అభిమన్యుడు... ఉత్తర ని పెళ్లాడతాడు గుర్తుందా..పాపం ఆ ఉత్తర అయితే కడుపుతో ఉంటుంది అభిమన్యుడు పోయేప్పటికి.అంటూ కళ్లు తుడుచుకుంది శాంతమ్మ గారు.
అత్తగారు చెప్పింది అంతా విన్నాక ...ఇంతకీ సైన్ధవుడి వలన చనిపోయింది నాగేశ్వర రావో, లేక శోభన్ బాబో అర్ధం కాలేదు రుక్మిణికి.
కానీ సైన్ధవుడి వలన సావిత్రికి కష్టం కలిగింది అన్న మాట బాగా బుర్రకెక్కించుకుంది రుక్మిణి. అసలే మహానటి సినిమా చూసినప్పటినుంచీ సావిత్రి కి వీర ఘోర అభిమాని అయిపొయింది రుక్మిణి. ఎంత అభిమానము అంటే వెబ్ ఛానెల్ లో ఆ సినిమా ప్రతిరోజు చూసీ చూసీ పట్టలేనంత ప్రేరణ పొందేసింది. తాను కూడా సావిత్రిలాగా చీరలమ్మి పేదలకు సహాయం చెయ్యాలని బీరువాలో 2 చీరలని పట్టుకు బయలుదేరింది. ఎలాగొ అది పసికట్టిన కృష్ణ, వెయ్యి రూపాయిలు పెట్టి కొని వెయ్యిసార్లు కట్టిన ఆ ఇమిటేషన్ పట్టు చీరలను భార్య వీధిన పెట్టకుండా ఆపి ,కుటుంబం పరువు నిలబెట్టుకున్నాడు. ఇంకా ఇలాగె వదిలేస్తే,, తనని జెమిని గణేశన్ లాగ 4 పెళ్లిళ్లు చేసుకోమనో,,, లేక రోజు ఇంటికొస్తూ తనకోసం ఒక మందు బాటిల్ తెమ్మనో అంటుందన్న భయం తో రుక్మిణికి తెలియకుండా ఆ వెబ్ ఛానెల్ ఆన్ సబ్స్క్రయిబ్ చేసేసాడు. అయినా అప్పటికే తలకెక్కిన సావిత్రీ వీరా భిమానం మాత్రం ఎక్కడికీ పోలేదు రుక్మిణిలో .అందుకే అత్తగారు చెప్పిన అంత కథలో సావిత్రీ అన్న పేరొక్కటే వినిపించుకుంది.
"వద్దత్తయ్య గారూ..వద్దు. సావిత్రిని అంత క్షోభ పెట్టిన సైన్ధవుడిని మీరసలు క్షమించొద్దు, వాడి ఉప్పే కాదు, వాడికి సంబంధించిన ఏ వస్తువూ ఇంట్లోకి రానీయద్దు''..అంటూ ముక్కు చీదుకుంటూ ,కళ్ళు ఒత్తుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించింది.
రుక్మిణి చేసిన సావిత్రి హడావిడికి శాంతమ్మ గారూ నివ్వెర పోయారు..
తనను మించి పోయిన కోడలి పురాణభాష్యం ఆవిడకీ అర్ధం కాక హతాశులై మౌనంగా కోడలు వెళ్లిన వైపే చూస్తుండిపోయారు.
భార్య మౌనం గా ఉండటం చూసి ఆవిడ మెత్తబడిందని అపార్ధం చేసుకున్న రామారావు గారు ఇదే అదను అనుకుని మళ్ళీ రంగంలోకి దిగారు.
సహజంగా ఎవరైనా మరెవరినైనా దేనికైనా ఒప్పించాలంటే సామదానభేద దండోపాయాలను అదే వరుసక్రమంలో వాడతారు.. కానీ లోకంలో చాలా మంది భర్తలు భార్యని దేనికైనా ఒప్పించాలంటే ఆక్రమంలో రారు. అరబిక్ వ్రాస్తున్నట్లు వ్యతిరేక దిశలో మొదలు పెడతారు. మొదట అధికారం ఉపయోగించి భయపెట్టే దండోపాయంతో మొదలై.. ఆవిడ మొండికెత్తిన కొద్దీ మొదటికొస్తారన్నమాట. అందుకే చివరికి బ్రతిమిలాట లోకి దిగారు రామారావు గారు..
'శాంతీ "...అని గోముగా పిలిచారు.. ఆవిడను ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు ఏకాంతంలో పిలిచే పిలుపది
కొడుకు ముందు అలా పిలిచేసరికి ఆవిడకి చిరాకుతో చిర్రెత్తిపోయింది.
శాంతీ లేదు, వాంతీ లేదు...
ఇంకేం మాట్లాడకండి అసలు. మీ మాటలతో నాకు భ్రాంతి కలిగించాలని చూడకండి , నాకసలు ఏ డాక్టర్లు అక్కర్లేదు, ఏ మందులు అక్కర్లేదు. , అంటూ అక్కడినుంచి చివ్వున లేచి తన గదిలోకి పోయి డాంమని తలుపేసుకుంది.
ఎలెక్షన్స్ లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్ధిలా ...,వరల్డ్‌కప్ ఫైనల్ లో డక్ అవుట్ అయిన కెప్టెన్ లా.. దిగాలుగా మొహాలు పెట్టుకు కూర్చున్నారు కృష్ణ, రామారావు గార్లు.
ఇప్పుడేం చెయ్యాలి కృష్ణా.. దిక్కుతోచక దీనంగా అడిగారు రామారావు గారు.
ఏమో నాన్నా.. ఆ సైన్ధవలవణం ఏమో కానీ దాన్ని మూలంగా ఆ డాక్టర్ చెప్పిన మందులే వాడను..ఇంకే డాక్టర్ కీ చూపించుకోను అని మొండికెత్తింది అమ్మ , ఓ పక్క బీపీ ఏమో అంత ఎక్కువగా ఉంది. ఏంచెయ్యాలో ఏంటో...
అవునురా.. వెనకటికెవరో "అల్లం అంటే నాకు తెలీదా.బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నాడుట,అట్లా వుంది మీ అమ్మ తెలివి. విసుక్కున్నారు రామారావు గారు.
ష్..ఊరుకోండి నాన్న.. అమ్మకి వినబడిందంటే మళ్ళీ కోపం తెచ్సుకుంటుంది..అసలే బీపీ . ఎదో ఒకటి ఆలోచిద్దాంలెండి. మీరు దిగులుపడకండి...అభ్యర్ధించాడు కృష్ణ.
తల కొట్టుకుని, గొణుక్కుంటూ ఉండిపోయారు రామారావు గారు
ప్రక్క గదిలో చదువుకుంటున్న కృష్ణ కొడుకు కిరణ్ ఈ సంభాషణ అంతా విన్నాడు. వింటూనే ఓ పక్క గూగుల్ లో సెర్చ్ చేసాడు. ఏం చదివాడో ఏం చూశాడో మరి ..
బామ్మ హాల్ లోంచి వెళ్లిపోయిందని గమనించి....మెల్లిగా హాల్ లోకి వచ్చి తండ్రినీ , తాతయ్యనీ బయటకు రమ్మని సైగ చేసాడు. ముగ్గురూ ఎదో మాట్లాడుకున్నారు.
సాయంత్రం..వస్తూనే బామ్మా బామ్మా,,నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ వచ్చాడు కిరణ్.. చేతిలో ఉన్న ప్యాకెట్ చూపిస్తూ...
ఏంటిరా అంటూ వచ్చారు శాంతమ్మ గారు..
ఇదా .. హిమాలయన్ సాల్ట్ బామ్మా.. మధ్యాహ్నం ఆ సైన్ధవలవణం గురించి నువ్వు పడ్డ బాధ అంతా విన్నా బామ్మా.. నాకూ నీ మాటే నిజం అనిపించింది. అందుకే వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నా గారు ఒక మంచి డాక్టర్ ఉంటే ఆయన దగ్గరకి వెళ్ళా . ఆయన కూడా నీలాగా ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటారు. నీలాంటి పుణ్యాత్ములు అంటే ఆయనకు చాలా గౌరవం . ఆయన కూడా నీ మాటే నిజం అన్నారు.అసలు నీలాంటి వాళ్లకి ఆయనైతే ఆ సైన్ధవలవణమే ప్రిస్క్రైబ్ చెయ్యరట. నీ లాంటి భక్తుల కోసం ఎందరో ఋషులు హిమాలయాల్లో తపస్సు చేసిన హిమాలయన్ సాల్ట్ ఉందట. అది సైన్ధవలవణం కన్నా బాగా పని చేస్తుందట, పైగా అది ఋషులు తపస్సుతో సృష్టించింది కనుక తింటే పుణ్యం కూడా. చెప్పాడు కిరణ్.
పొంగిపోయింది శాంతమ్మ గారు.. మా నాయనే మా తండ్రే.. నన్ను అర్ధం చేసుకునేది నువ్వేరా నాయనా. మీ తాతయ్యకి నా గోడు తలకెక్కితే కదా.. ఆ అయ్య కుచే మీ నాన్నానూ. ఇద్దరూ కలిసి ఆ పాపిష్టి సైన్ధవలవణం తినమని నన్ను కాల్చుకు తిన్నారనుకో.. కంప్లైంట్ చేసింది శాంతమ్మ గారు.
పోనీలే బామ్మా,, నేనున్నానుగా , దిగులుపడకు, ఇంకో విషయం. నిన్ను చూసిన డాక్టర్ గారు ఆ సైన్ధవలవణం ఒక్కటే తప్పు చెప్పాడు కానీ మిగిలిన మందులు అన్నీ కరెక్టే రాసాడుట. ఈ పూట నుండే మందులు మొదలు పెట్టమని చెప్పారు ఈ డాక్టర్‌గారు .చెప్పాడు కిరణ్.
తప్పకుండారా నా బంగారు తండ్రీ.. అంత మంచి డాక్టర్ చెప్పాక ఇంకా నేను ఎందుకు కాదంటాను..అంటూ సంబర పడిపోయింది శాంతమ్మ గారు.
*************
డాక్టర్ చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించడం తో త్వరలోనే బీపీ కంట్రోల్ అయిపోయి, ఆరోగ్యం గా ప్రశాంతం గా అయిపొయింది శాంతమ్మ గారు.
హిమాలయాల్లో ఋషుల తపస్సు తో సృష్టించిన హిమాలయన్ సాల్ట్ మహిమే తప్ప మనుషులు చేసిన మందులకు ఇంత ప్రభావం ఉండదని మనసారా నమ్ముతోంది. మనవడికి తన పై ఉన్న ప్రేమని తలచుకుని తలచుకుని మురిసిపోతోంది.
నెల తర్వాత ఒకరోజు ఆవిడ భాగవతం చదువుకుంటుంటే.. వచ్చి ఒళ్ళో పడుకున్నాడు కిరణ్. ప్రేమ గా తల నిమిరింది శాంతమ్మ గారు.
"బామ్మా నీ బీపీ తగ్గిపోయిందిగా" అన్నాడు కిరణ్..
"అవునురా" అంది శాంతమ్మ గారు.
"ఆ హిమాలయన్ సాల్ట్ తింటే నీకేమి ఇబ్బంది లేదుగా. నువ్వు భయపడ్డావుగా ..సైన్ధవలవణం తింటే నువ్వు కూడా సైన్ధవుడి లాగ అయిపోతావని ..అలాంటి మార్పులేం రాలేదుగా" ..అడిగాడు కిరణ్.
"చక్కగా మన కోసం హిమాలయాల్లో తపస్సు చేసి ఋషులు సృష్టించిన ఉప్పు తింటే సైన్ధవుడి గుణాలు ఎందుకొస్తాయిరా... నిజానికి ఈ ఉప్పు తినడం మొదలు పెట్టాక నాకైతే ఇంకా ప్రశాంతంగా ఉంటోంది. మీ తాతయ్య తిక్క చేష్టలని కూడా కోపం లేకుండా ఓర్చుకోగలుగుతున్నాను " అన్నారు శాంతమ్మ గారు. (" నీ మొహం, అది మందులు వాడి బీపీ తగ్గించుకోవడం వల్ల , ఉప్పు వల్ల, పప్పు వల్ల కాదు "అనుకున్నారు చాటు నుండి వింటున్న రామారావు గారు. )
"బామ్మా.. నీకో విషయంచెప్తే కోప్పడవుగా" గారంగా అడిగాడు కిరణ్.
"పిచ్చి తండ్రీ. నీ మీద నాకు కోపమేంటిరా?చెప్పు "..అన్నారు శాంతమ్మ గారు.
"నిజానికి సైన్ధవ లవణం అన్నా హిమాలయన్ సాల్ట్ అన్నా ఒకటే బామ్మా".. చెప్పాడు కిరణ్..
"హదేంటిరా...? "నివ్వెరపోయింది శాంతమ్మ గారు.
"అవును బామ్మా, హిమాలయాల దగ్గరలో సింధు నది తీరా ప్రాంతం లో దొరుకుతుంది సైన్ధవలవణం. దాన్నే ఇంగ్లీషులో హిమాలయన్ సాల్ట్ అంటారు. సింధు నది ప్రాంతంలో దొరుకుతుంది కనుక సైన్ధవ లవణం అన్నారు కానీ దానికీ భారతంలో సైన్ధవుడికీ ఏమీ సంబంధం లేదు". అన్నాడు కిరణ్
:"నిజామాట్రా ?" ..ఆశర్యపోయారు శాంతమ్మగారు.
"అవును బామ్మా .. ఆ రోజు నువ్వు సైన్ధవలవణం మూలంగా మందులే వాడనంటే భయం వేసి ఇలా చెప్పాల్సొచ్చింది. నీకు అబధం చెప్పినందుకు క్షమించు బామ్మా.".
"హారి గడుగ్గాయి, మీ నాన్నకి కృష్ణ అని పేరు పెడితే ఆ కృష్ణ మాయంతా నీకు అబ్బింది రా. నేను క్షమించడం ఏమిటిరా వెర్రి సన్నాసి. మిమ్మల్నందరినీ ఖంగారు పెట్టినందుకు మేరె నన్ను క్షమించాలి. అయినా నీ అంత తెలివి, నేర్పు మీ తాతయ్యకి ఉంటే నేను ఆయన మాటా విందును." అన్నది శాంతమ్మ గారు.
"ఆహా.. మనవడి తెలివితేటలన్నీ తాత నుండి వచ్చేవేలేవోయ్"..అంటూ నవ్వుతూ చాటునుండి వచ్చారు రామారావు గారు, ఆయన వెనకే కృష్ణా..
"అమ్మయ్య !అయితే ..ఈ ఉప్పుకీ సావిత్రి ని ఏడిపించిన సైన్ధవుడికీ ఏమి సంబంధం లేదన్నమాట" అంటూ రుక్మిణీ వచ్చింది.
నవ్వులు నిండిన ఆ లోగిలి లో ఆనందాల హరివిల్లులు విరిశాయి.
******************