Monday, September 29, 2025

పరోపకారార్ధమిదం శరీరం

 పరోపకారార్ధమిదం శరీరం 


"ఏంటమ్మా,అలా వున్నావు?" దిగాలుగా మొహం పెట్టుకు కూర్చున్న తల్లి వైపు చూస్తూ అడిగింది అప్పుడే వచ్చిన ప్రణతి .

"ఏముందమ్మా , మానవ జాతి ఈ శాపం నుండి ఎన్నటికి విముక్తి పొందుతుందా, ఈ ప్రపంచం ఎప్పటికి మామూలు అవుతుందా అని ఆలోచిస్తున్నా" అంటూ నిట్టూర్చింది ప్రణతి తల్లి సౌభాగ్యలక్ష్మి గారు.

" ఇప్పుడు ఏమైందమ్మా?"

"ఏముంది , ఇంకో కరోనా వార్త, మన సెక్రటరీ గారు లేరూ, వాళ్ళ అబ్బాయికి కరోనా సోకి,  వారం నుండి హాస్పిటల్లో ఉన్నాడట. పాపం , పరిస్థితి  బాగా సీరియస్ అవడంతో మధ్యలో  ICU కి మార్చారట,  "

     "అదేంటి ,సెక్రటరీ గారి అబ్బాయికి కరోనా సోకడమేమిటి!! ,వాళ్ళు భయంకరమైన జాగ్రత్తపరులు కదా.. కరోనా వచ్చిన వారిని కిలో మీటర్ దూరంలో  కూడా ఉండనీరు, కరోనా పేషెంట్ని ఫోన్లో చూసినా కంటిచూపుతోనే కరోనా వస్తుందేమో అన్నట్లుంటారు కదా ?" వెటకారంగా అంది ప్రణతి.

      "ఏమోనే పాపం,  ఎలా అంటుకుందో  ఏమో కానీ పాడు కరోనా వాళ్ళింట్లో వాళ్లందరికీ  సోకిందట . ఇంట్లో మిగిలిన వాళ్లంతా లక్షణాలు కనబడగానే టెస్ట్ చేయించుకుని మందులు వాడారుట, వాళ్లందరికీ దరిదాపు తగ్గిపోయింది కూడానట . కానీ ఈ అబ్బాయి మాత్రం టెస్ట్ చేయించుకోవడానికి కూడా భయపడి, టెస్ట్ కి  "వెళతా వెళతా" అంటూ  తనకు తెలిసిన మందులేవో తెచ్చుకుని వాడుతూ వారంరోజులపాటు  తాత్సారం చేసాడట. చివరికి దగ్గు ఎక్కువై, ఊపిరి పీల్చుకోవడానికి  కూడా ఇబ్బంది పడుతున్నాడని హాస్పిటల్కి తీసుకు వెళ్తే అప్పటికే ఊపిరితిత్తుల్లో న్యూమోనియా బాగా  పెరిగిపోయిందట.   ICU లో కూడా పెట్టారు పాపం "  బాధగా అన్నది సౌభాగ్యలక్ష్మి గారు.

   "ఒకరికి మనం ఉపకారం చేస్తే దేవుడు మన పిల్లలకి ఉపకారం చేస్తాడని బామ్మ ఎప్పుడూ తనకి చెబుతూ ఉండేది  అని నాన్న అంటారు  కదా!. అలాగే  'మనం ఒకరిని ఏడిపిస్తే మనకీ మన పిల్లలకీ కూడా ఏడుపే మిగులుతుంది'  అని ,ఇప్పుడు ఈ సెక్రటరీగారిని  చూస్తే అర్ధమవుతుంది" నిష్టురంగా  అంది ప్రణతి.

  "పాపం ,అంత కష్టంలో ఉన్న వాళ్ళని పట్టుకుని  ఏం మాటలు అవి ప్రణతీ"  అంది సౌభాగ్యలక్ష్మి గారు విసుగ్గా 

"ఏం మాటలా, అసలీ మాటలు నీతో కాదు, ఆ సెక్రటరీకి ఫోన్ చేసి ఆయనతోనే అనాలని ఉంది,అప్పుడైనా ఆయనకి తెలిసి  వస్తుందేమో..

మర్చిపోయావా?, 2 నెలల క్రితం మనకి కరోనా సోకినప్పుడు ఆ మహానుభావుడు  మనల్ని ఎంత హింసించాడో!  

ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా సోకిందో ఏమో మనకి  సోకింది, మనం  నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనబడంగానే వెళ్లి టెస్టులు చేయించుకున్నాము. బాధ్యత కల పౌరులుగా, అందరూ జాగ్రత్తగా ఉండాలని,  అపార్ట్మెంట్ సెక్రెటరీ కదా  అని ఆయనకి తెలియచేసాము. కష్టంలో ఉన్న   సాటి మనిషిపట్ల మానవత్వం తో   ప్రవర్తించాల్సిన  ఆ పెద్దమనిషి ఏం చేసాడు అప్పుడు? వెంటనే అపార్ట్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టి మనం తక్షణం మన ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లాలని తీర్మానం చేయించాడు, కమిటీ మెంబెర్స్ అందరితోనూ కాన్ఫరెన్స్ కాల్స్ చేయించి మనల్ని వెళ్లిపొమ్మని వత్తిడి చేసాడు.  "ఈ పరిస్థితిలో మేము ఎక్కడికి వెళ్లలేము , మేము అన్ని  జాగ్రత్తలు తీసుకుంటూ  హోమ్ క్వారంటీన్ లో ఉంటాము, మా ఫ్లాట్ డోర్ తెరిచి  బయటకు కూడా రాము" అని మనం గట్టిగా చెప్తే...

మనమేదో కావాలని వెళ్లి కరోనాని కావలించుకున్నట్లు .."ఆ మాత్రం జ్ఞానం లేదా , జాగ్రత్తగా ఉండలేరా" అంటూ నానా దుర్భాషలాడాడు..

ఏదో దేశద్రోహులనో , బాంబు పట్టుకు తిరిగే ఉగ్రవాదులలాగానో, లేకపోతె హంతకుల్లానో  మనని  ట్రీట్ చేసి, అపార్ట్మెంట్లో అందరూ మనలని వెలివేసేలా చేసాడు. 

 చివరికి  పాల ప్యాకెట్లు , కూరగాయలు కూడా అందకుండా చేసాడు.

 ఈయన మాటలకి భయపడి   అపార్ట్మెంట్ లో మనకి సహాయం చేయాలనుకున్న వాళ్ళు  కూడా దూరం నుంచైనా మన మొహం చూడటానికి భయపడ్డారు, మన ఫ్లోర్ లో వాళ్ళు  అందరూ తలుపులు తాళాలు వేసి బంధువుల ఇళ్ళకి పారిపోయారు.

మీ ఇద్దరికీ ఇబ్బంది పెరిగి, హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి అంబులెన్సుని పిలిపిస్తే  , ఆ సెక్రటరీ హాస్పిటల్ అంబులెన్సు అపార్ట్మెంట్ లోపలి కి రాకూడదని గేట్ బయటే  ఆపించినప్పుడు అంత జ్వరం, నీరసం తో అపార్ట్మెంట్ గేట్ దాకా నడవడానికి మీరెంత నరకయాతన పడ్డారు?

పైగా మేము ఉండే అపార్ట్మెంట్ సెక్రటరీకి కూడా ఫోన్ చేసి మన విషయం చెప్పి, ఇటూ అటూ రాకపోకలు ఉండకూడదని ఆంక్షలు విధింప చేసాడు. మా ఆయనకి , పిల్లలకు, కరోనా సోకకపోయినా , వాళ్ళు  పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా.. వాళ్ళ పట్ల కూడా అక్కడి వాళ్ళు  అదే వైఖరి చూపడానికి కారణమయ్యాడు ఈ సెక్రెటరీ.

   "ఓప్రక్క అన్నయ్య ఉద్యోగ రీత్యా విదేశంలో ఉండి, మీకోసం రావాలన్నా రాలేక అక్కడ  ఇరుక్కు పోయాడు.  మీ ఇద్దరూ హాస్పిటల్ లో ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఇంట్లో~ . మీ అంత కాకపోయినా నాకూ కరోనా వల్ల చెప్పలేనంత నీరసం కదా! సరిగ్గా  తినడానికి తాగడానికి  కూరలు , పాలు కూడా రానేలేదు. వెళ్లి తెచ్చుకోవడానికి నాకా ఓపిక ఉండేది కాదు. బయట నుండే ఇచ్చి వెళ్లిపోతానని మా ఆయన బ్రతిమాలినా ఇద్దరు సెక్రెటరీలు కలిసి, అటు వాళ్ళు  ఇటూ, ఇటు వాళ్ళు  అటూ రావద్దని ఆంక్షలు.  అలాంటప్పుడు నేను మానసికంగా ఎంత కృంగిపోయానో తెలుసా ?

చివరికి నేను లిఫ్ట్ లో ఎక్కకుండా మన ఫ్లోర్లో లిఫ్ట్ ఆగకుండా చేయించాడు. మీకు అవసరమైనవి  ఇవ్వడానికి హాస్పిటల్కి రావాలంటే ఇంత నీరసంలోనూ మెట్లెక్కీ దిగీ రావాల్సిందే.  ఎంత ఏడుపొచ్ఛేదో అప్పుడు! 

పైగా రోజూ ఫోన్ చేసి ,  ఒక్క మంచి మాట అయినా  మాట్లాడక పోగా  "ఇంకా ఎన్నాళ్ళు? ఎప్పుడు నెగటివ్ వస్తుంది నీకు" అని  సాధించేవాడు.  

అందరూ జాగ్రత్తగా ఉండాలి, సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించాలి, మాస్క్ లు పెట్టుకోవాలి,  చేతులు శానిటైజ్ చేసుకోవాలి,  కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టాలి . అది నేనూ ఒప్పుకుంటాను .కానీ  ఖర్మ కాలి కరోనా వఛ్చిన వారి పట్ల అంత అమానుష ప్రవ్రుత్తి ఏంటమ్మా అసలు? నేను గట్టిదాన్ని కనుక తట్టుకున్నా,  ఇంకెవరైనా బలహీన మనస్కులు నా స్థానంలో ఉంటె కరోనా వల్ల కాదు, ఈ కర్కోటకుడి వల్ల పోయేవాళ్లు అసలు." 

  నువ్వంటూ ఉంటావుగా అమ్మా  'ఎరిగి ఎరిగి చేసిన పాపాన్ని ఏడ్చి ఏడ్చి పోగొట్టుకోవాలి 'అని , అందుకనే ఆయనకి ఇలా అయ్యింది! కచ్చగా అంది ప్రణతి.

    "తప్పు ప్రణతీ ,అలా అనకూడదు, ఆ సెక్రెటరీ గారు జ్ఞానం  లేక తప్పు చేసాడే  అనుకో , భగవంతుడు మనకి జ్ఞానం  ఇచ్చ్చాడు కదా, మళ్ళీ మనం ఆ సెక్రెటరీ గారితో  అజ్ఞానం లో పోటీ పడడం ఎందుకు?. మనకి ద్రోహం చేసే వాడైనా సరే, వాడూ సుఖంగా ఉండాలని కోరుకోవడమే మన ధర్మం నేర్పిన "సర్వ్ జనా సుఖినోభవంతు " అన్నదాని సారం. అందరి తప్పొప్పులు బేరీజు వేయడం, ఫలితాలు నిర్ణయించడం, మన పని కాదు, అది భగవంతుడి పని" .

  తల్లీ కూతుళ్ళ సంభాషణను అక్కడే సోఫాలో కూర్చుని వింటున్న ప్రసాదరావు గారు తన ఫోన్లో ఏదో వాట్సాప్ మెస్సేజ్ వచ్చినట్లు శబ్దం రావడంతో ఫోన్ తీసుకుని మెస్సేజ్ చదివి, 'నువ్వూ చదువు' అన్నట్లు ప్రణతి చేతికి  ఫోన్ ఇచ్చ్చారు.

"ఐ సి యూ  లో కరోనా తో పోరాడుతున్న మా  అబ్బాయి  చికిత్స కొరకు బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా అత్యవసరంగా కావలెను, 10 _ 12  వారాల క్రితం కరోనా సోకి , కోలుకుని , గత నెల రోజులుగా ఎటువంటి లక్షణాలు లేని బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ వారు దయ చేసి ప్లాస్మా డొనేట్  చేసి మా కుమారుడి ప్రాణాలు రక్షించ  ప్రార్ధన . ఈ  బ్లడ్ గ్రూప్ ప్లాస్మా దొరకడం చాలా కష్టంగా ఉన్నందున, మా అబ్బాయికి ప్లాస్మా డొనేట్ చేయ గలిగిన వారు వెంటనే స్పందించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను." అపార్ట్మెంట్ సెక్రటరీ నుండి వచ్చిన మెసేజ్ అది.  

  "అయ్యో !, అంత సీరియస్ గా ఉందా పాపం, ప్లాస్మా డొనేషన్ అడుగుతున్నారు" అనుకుంటూ పైకే అనేసారు ప్రసాదరావు గారు,.

"ఏమయ్యింది?" అని  అడిగిన  సౌభాగ్యలక్ష్మి గారికి మెసేజ్ విషయం వివరించారు  ప్రసాదరావు గారు .

"ఇంతకీ ప్లాస్మా డొనేషన్ అంటే ఏంటండీ ?" అడిగింది సౌభాగ్యలక్ష్మి గారు .

   "నేనూ ఈ మధ్యే పేపర్ లో చదివాను భాగ్యం, మన శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, ఆ ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షించడానికి శరీరంలోని రక్షణవ్యవస్థ కొన్ని రోగ ప్రతి రోధకాలని   తయారు చేస్తుంది . వాటినే యాంటీ బాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ వల్లనే మన శరీరం కరోనా ఇన్ఫెక్షన్తో పోరాడి కోలుకోగలిగింది. కొంతమందిలో ఇన్ఫెక్షన్ బలం ఎక్కువైనప్పుడో  లేక ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తీ సరిగ్గా లేనపుడో ఆ వ్యక్తి శరీరం సరిగా యాంటీబాడీస్ తయారు చేసుకోలేక పోతే ,   ఇన్ఫెక్షన్ నుండి కోలుకొని శరీరంలో యాంటీబోడీస్ తయారయి ఉన్న  వారి శరీరంలోని ప్లాస్మా సేకరించి, రోగి శరీరంలోకి ఎక్కించడం ద్వారా బయటినుండి  ఆ రోగులకు  యాంటీబోడీస్  సప్లై చేస్తారు. అలా  వారి శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడడానికి, తద్వారా ప్రాణాలు రక్షించబడడానికి    ఉపయోగపడేదే ప్లాస్మా డొనేషన్.కాకపోతే రక్త మార్పిడి లాగానే  ఈ ప్లాస్మా మార్పిడి కూడా వారి వారి బ్లడ్ గ్రూప్లను  బట్టి వారికి సరిపడే బ్లడ్ గ్రూప్ ఉన్న  దాతల నుండి జరగాల్సి ఉంటుంది. " వివరించారు ప్రసాద రావు గారు.

     అంతా విని అర్ధం చేసుకున్నాక ,  " అయితే ఇప్పుడు ఆ అబ్బాయి  బ్లడ్ గ్రూప్ కూడా  బి నెగటివ్ ఆ !" అంది  సౌభాగ్యలక్ష్మి గారు ప్రణతి వైపు చూస్తూ...

"ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు?" అనుమానంగా అడిగింది ప్రణతి.

"అదే ప్రణతీ, మనిద్దరి బ్లడ్ గ్రూప్ అదే కదా, పైగా ప్లాస్మా డొనేషన్కి   వాళ్ళు  అడిగిన వివరాలు అన్నీ మనకి సరిపోతాయి. మనిద్దరం ఇప్పుడే వెళ్లి ఆ అబ్బాయికి ప్లాస్మా డొనేట్ చేసి వద్దాం ప్రణతీ  " ఆత్రంగా అంది సౌభాగ్యలక్ష్మి గారు.

    "ఏంటమ్మా, నువ్వనేది? ఆ దుర్మార్గుల కోసం మనం ప్లాస్మా డొనేట్ చెయ్యాలా? వాళ్ళు  చేసిన పనులకు  ప్లాస్మా డొనేషన్ సంగతి అటుంచు, వాళ్ళ మొహం చూడాలన్నా నాకు అసహ్యం!.నేను అలాంటి వారికి ఛస్తే సహాయం చేయను" మొండిగా అంది ప్రణతి. 

   "సరే పోనీ నువ్వు చెయ్యకపోతే నేనుచేస్తా" అంటూ ప్రసాదరావు గారి చెతిలొనుంచి ఫోన్ తీసుకుని ప్రక్క గదిలోకి వెళ్ళిపోయింది సౌభాగ్యలక్ష్మి గారు.

"ఏంటి నాన్నా అమ్మ, పోయి పోయి అలాంటి వాళ్లకి సహాయపడతాను అంటుంది? వాళ్ళ  మనని ఎంత బాధ పెట్టారు?  తాగడానికి కనీసం గుక్కెడు పాలు లేకుండా చేసాడాయన , ఇప్పుడు వాళ్ళ కోసం ఈ 55  ఏళ్ళ మనిషి హాస్పిటల్ కి వెళ్తుందా, దాని వల్ల తనకేదైనా ప్రమాదం జరిగితే?"

  "నువ్వు కంగారుపడకు ప్రణతీ , అన్నీ జాగ్రత్తగా కనుక్కునే చేద్దాం" అని ప్రసాద రావు గారు అనేంతలో సౌభాగ్యలక్ష్మి గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ.., "సరేనమ్మా ఉంటా మరి"  అని ఫోన్లో వ్యక్తికి  చెపుతూ  వచ్చింది.

"ఇప్పుడే మా పెద్దక్క కూతురు ప్రవీణతో మాట్లాడా , తను డాక్టర్ కదా, అందుకే  ఈ విషయాలన్నీ వివరంగా ప్రవీణని  కనుక్కున్నా. 18 నుండి 69 సంవత్సరాల మధ్య వాళ్ళు ,కరోనా వచ్చి తగ్గి, నెల రోజులుగా ఎటువంటి వ్యాధి లక్షణాలు లేనివాళ్లు, HIV / హెపటైటిస్ లాంటి ఇతర ఇన్ఫెక్షన్స్ లేని వాళ్లు , బ్లడ్ కాన్సర్లు  లేని వాళ్లు చక్కగా ప్లాస్మా డొనేట్ చేయొచ్చట. "

"మరి తమ ప్లాస్మా వేరేవాళ్లకి ఇచ్చేయడం వల్ల ఆ డొనేషన్ చేసిన వాళ్లకి ఏమీ ఇబ్బంది ఉండదా?"

"ఏమీ ఇబ్బంది ఉండదట , మనం ఇచ్చిన ప్లాస్మా కూడా మన శరీరంలో మళ్ళీ  వెంటనే తయారయి పోతుందట , ఇప్పుడు మన శరీరంలో ఉన్న యాంటీబోడీస్ ద్వారా మనకు రక్షణ కవచం ఉంటుంది కనుక ఈ డొనేషన్ కోసం మనం హాస్పిటల్కి వెళ్లినా ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండదట .

అంటూ ప్రణతి వైపు తిరిగి ,

"చూడు ప్రణతీ, నువ్వు చేస్తావో లేదో నీ ఇష్టం, పెద్ద పిల్లవి , నిన్ను నేను బలవంతం చేయను, నేను మాత్రం నాద్వారా  ఒకళ్ళకి ప్రాణదానం చేసే అవకాశం  ఒక్క శాతం ఉన్నా  , ఆ అవకాశాన్ని   వదలను.  అలా చేస్తే రేపొద్దున దణ్ణం పెట్టుకోవడానికి  దేవుడి దగ్గరికి వెళ్లినప్పుడు ఆయనకి నా మొహం చూపించలేను కూడా.." కొంచెం ఘాటుగా,నిక్కచ్చిగా అన్నది సౌభాగ్యలక్ష్మి గారు.

  "చూడు నాన్నా, నేను ఆ సెక్రెటరీ లాంటి చెడ్డవాళ్లకి సహాయం చెయ్యొద్దన్నానని , నేనేదో ఎవరికీ సహాయమే  చేయనిదానిలా నన్ను ఎంత చెడ్డగా సృష్టిస్తోందో అమ్మ! ,....మనల్ని  హింసించిన  వాళ్ళ కోసం మనం అంత చెయ్యాలా?   ఏనాడైనా వాళ్ళు  మనకి చీమ తలకాయంత సహాయం  అయినా చేశారా? పోనీ .రేపొద్దున మళ్ళీ  మనకి ఏదైనా అవసరం వస్తే మనకి ఉపకారం చేసే రకాలా వాళ్లు ? సహాయం చేస్తే  మంచి వాళ్లకి చెయ్యాలి కానీ సాటి వారిని అమానుషంగా హింసించే అలాంటి వారికా? 

  "ప్రణతీ నీ బాధ నాకు అర్ధమయ్యింది , కానీ నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా" అంటూ గంభీరంగా  గొంతు సవరించుకున్నారు ప్రసాదరావు గారు,

"ఈ విశ్వంలో జరిగే ఉపకార ప్రత్యుపకారాలు అనేవి ఎప్పుడూ 'one to  one ' అనే  ఫార్ములా ప్రకారం నడవవు తల్లీ . నువ్వు X  కి సహాయం చేస్తే నీకు  Y సహాయం చేస్తారు. నువ్వు సహాయం చేసిన X , ఇంకెవరో  Z కి సహాయ పడతారు.ఈ విశ్వం అలాగే సంతులనమవుతుంది తల్లీ.మనకి సహాయం చేసిన వారికే మనం తిరిగి సహాయం చేయాలి అనో మననుండి సహాయం పొందిన వాళ్ళు తిరిగి మనకు సహాయం చేసి తీరాలి అనుకుంటేనో ఈ సృష్టి నడవదు . 

నువ్వూ  సైన్స్  లో చదువుకున్నావు కదా 'This universe doesn't saty constant. it keeps on changing through energy exchange  "  అని.  ,ఎనర్జీ,' అంటే శక్తి  అనేది  ఎక్కువ శక్తి  ఉన్న చోట నుండి  తక్కువ శక్తి  ఉన్నచోటకి నిరంతరం ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఈ విశ్వంలోని ప్రతీ వ్యవస్ధ  ఆ  సిధ్ధాంతం  మీదే ఆధారపడి ఉంటుంది.  ఆ  శక్తి మార్పిడి సిధ్ధాంతంలో కూడా మనం అనుకునే   ' one to one '  ఫార్ములా  ఉండదు. 

   మానవాళి విషయంలో ఆ శక్తీ  మార్పిడికే 'పరోపకారం 'అనే పేరుతో మార్గదర్శనం చేశారు మన పెద్దలు. నువ్వు పరులకి చేసే ఏ సహాయం అయినా  సరే ,అది  డబ్బు రూపంలో అయినా, జ్ఞానం  రూపంలో అయినా , మాట సాయం రూపంలో అయినా ఏదీ కుదరకుంటే మనకు భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఉపయోగించడం ద్వారా  ఇతరులకు ఉపయోగపడడం అయినా... అంటే.. ఉదాహరణకు ఈ  రక్త దానం , నేత్ర దానం, ఈ ప్లాస్మా  దానం..ఇవన్నీ energy transfer లే ! 

   అందుకే ప్రతీ మనిషీ పరోపకారం చేసే తీరాలీ,  "పరోపకారార్ధ మిదం శరీరం " అని చిన్నప్పటి నుండీ మనకి నూరిపోస్తారు..

అయితే ఈ పరోపకారం అనే పదంలో ఉన్న 'పర '  శబ్దం చూసావా.. దాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఆ 'పర ' శబ్దం లోకంలో ఉన్న అన్ని జీవులకీ వర్తిస్తుంది. మనకి ఇష్టమైన వారికో మనకి ఇంతకు పూర్వం సహాయపడ్డ వారికో  లేక మనవాళ్ళకో మాత్రమే సహాయం చేస్తానంటే అది పరోపకారం అవ్వదు.

మనకు ఇష్టం లేని వారికీ, మనకు ఏ మాత్రం తెలియని వారికీ, మనకి ప్రత్యుపకారం చేస్తారు అన్న ఆశ లేని వారికీ , చివరకు మనకి అపకారం చేసిన వారికి కూడా సహాయపడడం అనేదే పరోపకారం. 

ప్రకృతి నుండి నిరంతరం రకరకాలుగా  లబ్ది పొందుతున్న మనం, మన సాటి జీవులకు మనకు చేతనైనంత  పరోపకారం చేస్తూ ఉండడమనేదే ఈ ప్రకృతి పట్ల మనం చూపగలిగిన కృతజ్ఞత.

అలాంటి పరోపకార గుణం మానవులందరిలో పెరిగినప్పుడే మానవాళికి ఈ కరోనా లాంటి శాపాలనుండి విముక్తి.

 అప్పుడే సాటి మానవుల పట్ల, పంచ భూతాల పట్ల మనం చేసిన అనేకానేక పాపాలకు నిష్కృతి.

    ఇక వేరే వాళ్ళు మన పట్ల చేసిన అపకారాలు అంటావా..... వాళ్ళని పెద్ద మనసుతో క్షమించే అంత ఎత్తుకి నువ్వు ఎదిగినపుడు ... నీ ఔన్నత్యం ముందు ఆ తప్పులు పిపీలికాలు అయిపోతాయి. " 

అని చెప్పి నవ్వుతూ ప్రణతి వైపు చూసారు ప్రసాదరావు గారు. అర్ధమయిందన్నట్లు తలపంకించింది ప్రణతి.

" ప్రణతీ , నేను మీ నాన్నగారు చదివినన్నిపుస్తకాలు , ఆధ్యాత్మిక గ్రంధాలు చదవలేదు కానీ, నాకు తెలిసినది చెప్తాను విను.  

మనం పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్లి పళ్ళ కోసమని చెట్టుని కర్రతోనో, రాళ్ళతోనో కొడతాము . అయినా ఆ పళ్ళ చెట్టు మనకి పళ్లే ఇస్తుంది తప్ప మనని తిరిగి కొట్టదు కదా!. 

మనం కూడా  అందరికీ ఉపకరించే పళ్ళ చెట్టులా ఉండాలి కానీ మనసంతా వ్యతిరేక భావాలు నింపుకుని ముళ్లకంపలం కాకూడదు." 

 "ఉపకారికి నుపకారము

విపరీతము గాదు సేయ వివరింపగా

నపకారికి నుపకారము

నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ."

"ఈ పద్యం నేను చిన్నప్పుడు నేర్చుకున్నది .. దాని సారాంశం సాధ్యమైనంతవరకూ నేను  ఆచరిస్తాను. 

నేను ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల ఆ అబ్బాయికి ఉపకారం జరిగే అవకాశం ఒక్క శాతం ఉన్నా సరే , అలా చేయని నాడు  నన్ను నేను క్షమించుకోలేను." అన్నది సౌభాగ్యలక్ష్మి గారు. 

 ఆవిడ మాటలు విన్న ప్రణతి కళ్ళల్లో కన్నీరు చిప్పిల్లింది.

"చూశావా ప్రణతీ , నేను ఎక్కువ పుస్తకాలు చదవలేదు అంటూనే ఇందాకటి నుండి నేను చెప్పిన మాటల సారాంశాన్ని ఒక్క ముక్కలో ఎంత సులభంగా చెప్పిందో మీ అమ్మ !" పెద్దగా నవ్వేశారు ప్రసాదరావు గారు , వాతావరణాన్ని తేలిక చేయడానికి .

"నిజమే నాన్నా మీ ఇద్దరూ  నాకు అర్ధం అయ్యేటట్లు ఎంతో బాగా చెప్పారు. నేనే, ఎవరో ఏదో 

 చేశారని, తల్లిదండ్రులు నేర్పిన విద్యనీ, భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్నీ  విస్మరించి మాట్లాడాను. 

 మీరు నా కళ్ళు తెరిపించారు  , ఇప్పుడే వెళ్లి ప్లాస్మా డొనేట్ చేసి వస్తాను " అన్నది ప్రణతి.

"నేను కూడా వస్తా ప్రణతీ, నా ప్లాస్మా  కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడొచ్చు కదా" అన్నది సౌభాగ్యలక్ష్మి గారు.

"మీ ఇద్దరితో పాటు నేనూ కరోనా విజేతనే కదా! నేనూ ప్లాస్మా డొనేట్ చేస్తాను .కాకపోతే నాది కామన్ బ్లడ్ గ్రూప్ . రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ఎంతమందికి ప్లాస్మా అవసరం అవుతుందో ఏమో . అన్ని గ్రూపుల వాళ్లు ప్లాస్మా డొనేట్ చెయ్యాల్సిందే.

 అసలు నేనేమంటా అంటే...

 కరోనా నుండి కోలుకుని పునర్జీవన వరాన్ని ప్రకృతి నుండి పొందిన ప్రతి ఒక్కరూ ఆ ఋణాన్ని తీర్చుకునే మార్గమే  ఈ ప్లాస్మా డొనేషన్."

 "అవును నాన్నా, బాగా చెప్పారు... ఏది, ఒక్కసారి మీ ఫోన్ ఇటివ్వండి. సెక్రటరీ గారికి ఇప్పుడే మేము ప్లాస్మా డొనేట్ చెయ్యడానికి వస్తున్నాము అని మెసేజ్ పెడతాను" అంటున్న ప్రణతికి నవ్వుతూ ఫోన్   అందించి , సౌభాగ్యలక్ష్మి గారి వైపు ఆనందంగా  చూసారు ప్రసాదరావు గారు.

No comments:

Post a Comment