భస్మ కూష్మాండం
"రమా! నాదో చిన్న కోరిక తీరుస్తావా?"
రమ కంటిలో సన్నని కన్నిటి పొర. అది నా కళ్లబడ కూడదనేమో కాస్త ప్రక్కకి తిరిగింది.
బలహీనమైన నా స్వరం లోని ఆర్ద్రత కు చలించి పోయిందో, ఇక ఇప్పుడు తీర్చకుంటే ఎప్పటికీ తీర్చలేనని బాధపడుతోందో తెలీదు.
రమ వైపు నిశితంగా పరిశీలించి చూశాను.
కళ్ళ క్రింద నల్లటి వలయాలు. పీక్కుపోయిన ముఖం.
'అసలు రోగి నేనా..!? తనా..!?' అని సందేహిస్తారు చూసిన వారెవరైనా.
నేను కోరబోయే కోరిక, నా వరకూ సమంజసమే. రమ కూడా అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది.
మరి నా కోరిక, ఈ సమాజం దృష్టిలో నన్ను ఎలా నిలబెడుతుందొ తెలియదు.
'ఇంతకూ ఈ విషయాన్ని #ఆమె ఎలా అర్థం చేసుకుంటుందో..! అసలు "సరే!' అంటుందో లేదో...!? నా కోరిక తీరుతుందో! లేదో..!' ఇలా ఆలోచిస్తూ నిట్టూర్చిన నన్ను చూసి రమ దుఃఖాన్ని అదుపు చేసుకుని...
"మీరు దిగులు పడకండి. మీ కోరిక తీరుస్తాను. ఎప్పుడూ ఒకే ఒక్క కోరిక అనడమే తప్ప, ఆ కోరిక ఏంటో చెప్పరు. ఇప్పటికైనా చెప్పండి. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను." దుఃఖం తో స్వరం కంపిస్తుండగా అంది రమ.
రమను బాధపెడుతున్నానని తెలుసు కానీ , నేను ఈ విషయం లో బలహీనుడిని.
నాకు ఇప్పుడు రమను అభ్యర్థించటం తప్ప మరో గత్యంతరం లేదు.
ఇక నా ఈ ఊపిరి సయ్యాటలు ఎన్నాళ్ళో తెలీదు. తీరని కోరికతో నా జీవితం తీరిపోవడం నాకు ఇష్టం లేదు.
నా భార్య రమ నా మరదలే కనుక, నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన మనిషి కనుక....
" #ఆమె ని ఎలాగైనా ఒప్పిస్తాను" అంటూ నా చేతి లో తన చేయి వేసింది, ప్రమాణం చేస్తున్నట్లు.
"రమా..! నిన్ను బాధ పెడుతున్నాను కదా!"
నేను ఎంత దుర్మార్గుడినో కదా! నా జబ్బు తో మాత్రమే కాదు. నా కోరిక తో కూడా నిన్ను బాధ పెడుతున్నాను." అంటూ రమ కళ్ళల్లోని భావాలను వెతికి చూసాను.
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
"లేదు బావా, ఈ స్థితిలో మీరు కోరే కోరిక తీర్చడం భార్యగా నా విద్యుక్తధర్మం, చెప్పండి బావా మీ కోరికేంటో, అది తీర్చడానికి నేను ఒప్పించవలసిన ' ఆమె' ఎవరో" అంటూ, 'ఆమె'ను గట్టిగా నొక్కిపలికి, నోట్లో చెంగుకుక్కుకుంది రమ.
రమ మాటల్లో ఏదో శోభన్నాబు సినిమా లాంటి అనుమానం ధ్వనించినా పట్టించుకోకుండా, ముందు నా కథ చెప్దామని మొదలుపెట్టా.
"రమా, నా కోరిక తీరుస్తానన్నావు, థాంక్యూ, అన్నీ వివరంగా చెప్తాను, గుండ్రాలు తిప్పుతున్నా, నాతో పాటు నువ్వూరా" అంటూ రమను తీసుకుని గతంలోకి పోయా.
************************************
30 ఏళ్ల కిందట, నూనూగుమీసాల భస్మం, వాళ్ళ పక్క పోర్షన్లోనే ఉండే వాడి స్నేహితుడు మురళీ మాట్లాడుకుంటుండగా పెద్దాళ్లు ఎవరూ వినకుండా మురళి అడిగాడు.
"ఒరే భస్మం, మన బ్యాచ్లో మేమందరం అమ్మాయిలు, ప్రేమ అంటూ మాట్లాడుకుంటూ ఉంటాము కదా, నువ్వేంటిరా ఆ ఊసే ఎత్తవూ?"
"ఒరే మురళీగా, నన్ను ఇంకోసారి భస్మం అని పిలిచావంటే నిన్ను తగలెట్టి నిజంగా భస్మం చేసేస్తా" విరుచుకుపడ్డాడు భస్మేశ్వరారావు.
"సర్లేరా, మీ బామ్మ పిలుస్తుందని నేనూ ముద్దుగా పిలిచాలేవాయ్.
ఇంతకీ గుమ్మడిపూల లాంటి అమ్మాయిలు కళ్లముందు తిరుగుతుంటే మాటవరసకైనా ప్రేమించాలని నువ్వెందుకనుకోవో ఆ సంగతి చెప్పు ముందు"
"నాకే గుమ్మడిపూలతో గుమ్మడికాయలతో ప్రేమా గీమా వద్దురా, బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుని బ్రహ్మాండంగా గుమ్మడొడియాలు పెట్టే అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటా"
"ఏంటి, వడియాలు పెట్టే అమ్మాయి కావాలా?
వడియాలు, అప్పడాలు కావాలంటే ఇంట్లో చేయించుకుని తినాలి లేదా కొనుక్కుతినాలి అంతే కానీ దానికీ పెళ్ళికీ సంబంధం ఏంటిరా భస్మిగా" జుట్టు పీక్కున్నాడు మురళి.
"నేను చెప్పేది మామూలు వడియాలు కాదురా, గుమ్మడొడియాలు!!
అవి తింటానికి బాగుంటాయి కానీ కొంటే గుండెపోటు తెప్పిస్తాయిరా, అంత ప్రియం!
నాకేమో ప్రతిపూటా భోజనంలో గుమ్మడొడియాలు తినాలని నోరు పీకుతుంది. ఇక ఇంట్లో గుమ్మడొడియాలు చేసుకు తినడమంటావా, ఇప్పట్లో ఈ కొంపలో కుదిరేది కాదు" నిట్టూర్చాడు భస్మం.
"అదేంట్రా?!"
"అవున్రా, దానికో పెద్ద కథ ఉంది.
అప్పుడెప్పుడో మా బామ్మ గుండమ్మ పెట్టిన గుమ్మడొడియాల్లో ముదురు గుమ్మడిముక్క గొంతుకడ్డంపడి, మా తాతయ్య గుటకెయ్యలేక గుటకాయస్వాహా అయ్యాడుట.
మిగిలినప్పుడల్లా ఎప్పటెప్పటి విషయాలో గుర్తుతెచ్చుకుని మరీ చచ్చిపోయిన మా తాతను తిట్టిపోసే మా బామ్మ, గుమ్మడొడియాల దగ్గరకొచ్చేసరికి పేద్ద పతిభక్తున్నట్లు ఫోజు కొడుతుందిరా.
మా తాతను తను బలి తీసుకుని, ఆ పాపాన్ని గుమ్మడొడియాల మీద నెట్టి, వాటిని మా ఇంట్లో నిషేధించింది.
అవి మా ఇంట్లో పెట్టకూడదు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడో, ఏ పెళ్ళిళ్ళలోనో అయినా సరే, మేమెవ్వరం అవి తినకూడదు.
ఇంతా చేసి, ఆవిడ గారి కూతురు, అదే మా అత్తయ్య వస్తే మాత్రం ఆవిడకిష్టమని గుమ్మడొడియాలు పెట్టొచ్చు. వేరే ఇంటి కోడలు కనుక ఆడపడుచుకి బామ్మ కనిపెట్టిన రూల్ వర్తించదట!
అప్పుడు కూడా మాతో కుక్క చాకిరీ చేయిస్తుంది కానీ, చిన్నపిల్లలమైనా నన్నూ చెల్లినీ కూడా వడియాలు తిననీయడం కాదు కదా, పచ్చిపిండి అంటిన వేళ్లైనా నాకనీదు.
కేజీల కొద్దీ పిండి మా అమ్మతో రుబ్బించి, నాతో మాచెల్లితో వడియాలు పెట్టిస్తుంది. ఈ పనులన్నీ చేసేటప్పుడు పక్కనే గుడ్లగూబ కళ్ళేసుకుని కాపలా కాస్తుంటుంది. ఎక్కడ మేము తినేస్తామో అని!
వ
డియాలు ఎండాక డాబా పైకే డబ్బాలు, బాగ్ తీసుకెళ్లి, అక్కడిక్కడే పాకింగ్ లుచేసి దాచేసుకుంటారు తల్లీకూతుళ్ళు."
"ఇదేం సెంటిమెంట్రా?"
"సెంటిమెంటా, గాడిదగుడ్డా?
నీకు తెలుసా, తాతయ్యని బలితీసుకున్నాయి కనుక మా ఇంటివాళ్లం ఎవరూ గుమ్మడొడియాలు తినకూడదని రూల్ పెట్టీ, బామ్మ మాత్రం పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో మేము చూడకుండా లాగిస్తుందిరా. నేనోసారి చూసి చెప్పినా అత్తగారి మాటలు అమాయకంగా వినే మా అమ్మ నామాట నమ్మలేదు, పైగా ఇంట్లో గుమ్మడొడియాలు పెట్టించుకోవటం కోసం నేనే అబద్ధాలు చెప్పానని నన్నే కేకలేసింది."
"వార్నీ! "
"అసలు మొన్నీమధ్య ఏమైందో తెలుసారా?
చుట్టాలింట్లో పేరంటానికి అమ్మ చెల్లి వెళ్తూ నన్నూ తోడు తీసుకెళ్ళార్రా. కొంచం దూరం వెళ్ళాక అమ్మ పర్స్ మర్చిపోయిందని , తీసుకోవడానికి వెనక్కి వచ్చామా,
మేమటు వెళ్ళగానే మా బామ్మ ఎక్కడ దాచిందో, గుమ్మడికాయ వడియాలు తీసి వేయించుకుంది.
నాన్న ఆఫీసు నుండి వచ్చే లోపు తినెయ్యాలని హడావిడనుకుంటా తలుపేసుకోవడం మర్చిపోయింది.
మేము వచ్చేసరికి పేద్ద ప్లేట్ నిండా గుమ్మడొడియాలు పెట్టుకుని ఆడ ఘటోత్కచుడిలా ఆత్రంగా లాగిస్తోంది.
అదేమంటే అర్దం పర్థం లేకుండా అదరగండం మాటలు మాట్లాడింది.
నాకు వళ్ళు మండిపోయి, ఇంకెప్పుడూ ఆవిడ మాటలు వినకూడదని నిర్ణయించుకున్నా.
.
నిజానికి మా గుండమ్మ ఆ రూల్ పెట్టింది కూడా మా తాత మీద ప్రేమతో కాదురా, మా అమ్మ మీద అక్కసుతో.
మా అమ్మకి గుమ్మడొడియాలు ఇష్టం అని, మా అమ్మని తిననీకుండా చెయ్యాలని!
మా బామ్మలాంటి అత్తగార్లకి మనవళ్ళు మనవరాళ్లు కూడా కోడలి పిల్లలే కానీ కొడుకు పిల్లలు కాదుగా, అందుకే మా మీదా ప్రేముండదు మా బామ్మకి!
ఇంకా ఘోరం చెప్పనా, అసలు నా పేరు ఈశ్వర్ అని, మా అమ్మ స్టైల్గా పెట్టుకుందని అక్కసు మా గుండమ్మకి!
మా తాతయ్య ఈవిడ గారి గుమ్మడొడియాలు తిని పోయాక, ఆ వంకతో, మా అమ్మ పెట్టిన పేరు చెడగొట్టాలని, నా స్కూల్కి వచ్చి మరీ రిజిస్టర్లో ఈశ్వర్ అని ఉన్న నా పేరుకి, 'భస్మం' అని కలిపి భస్మేశ్వరరావు చేసిందిరా. అదేమంటే "భస్మం అంటే బూడిద, బూడిద గుమ్మడికాయ తాతయ్య గుర్తు" అని బుకాయిస్తుంది.
నువ్వే చెప్పరా తాతయ్య గుర్తన్టే తాతయ్య పేరు పెట్టాలి కానీ తాతయ్యని మింగిన
బూడిద గుమ్మడికాయ పేరు పెడతారా ఎవరైనా?
పైగా అందరి ముందూ కావాలని భస్మం అని పిలవడం ఒకటీ!" అంటూ కళ్ళు తుడుచుకున్నాడు భస్మం
"ఇంత జరిగినా మా అమ్మ మాత్రం మా బామ్మ మీద భయంతో "ఆవిడ ఉన్నన్నాళ్లు మాత్రం నన్ను గుమ్మడొడియాలుపెట్టమని అడగకురా, ఆవిడతో నేను పడలేన"ని కన్నీళ్లు పెట్టుకుంది.
దొంగచాటుగా గుమ్మడొడియాలు మింగీ మింగీ, గుండ్రాయిలా ఉన్న మా గుండమ్మ ఎప్పటికి గుంట గట్టి గంట వాయించాలి?
నా జీవితంలో ఎప్పటికీ గుమ్మడొడియవసంతం రావాలి?
అందుకేరా, నేను బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చూసుకుని, వేరే ఊరెళ్ళిపోయి, గుమ్మడొడియాలు బాగా పెట్టే అమ్మాయిని చూసుకుని పెళ్ళి చేసుకొని, ప్రతిపూట గుమ్మడొడియాలు తింటా.
అదే నా గుమ్మడాశయం, కాదు కాదు, జీవితాశయం అని ఆవేశంగా తన పంచవర్ష ప్రణాళిక చెప్పి, ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు భస్మం.
"ఒరేయ్, నీ విషాద గుమ్మడి గాథ వింటే... నాకు గుమ్మడిలా గుండె నొప్పొచ్చేట్లు ఉందిరా.
దొరుకుతుందిరా, నీకు గుండ్రంగా గుమ్మడొడియాలు పెట్టే గుమ్మడిపండు లాంటి గుమ్మ దొరుకుతుంది,
మీ ఇద్దరికీ బుజ్జి బుజ్జి గుమ్మడి కాయలు పుడతారు,
మీ సంసారం గుమ్మడి పాదులా పెరుగుతుంది"
అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ చీకట్లో ఎటో నడుచుకుంటూ వెళ్ళి పోయాడు మురళి.
మురళీయే కాక ఇంకో వ్యక్తి కూడా ఇదంతా చాటుగా విని, భస్మేశ్వరరావు విషాద గాథకి చలించి, గుమ్మడి వడియాల్లాంటి తన గుండ్రటి కళ్ళ నుండి గుమ్మడి గింజలాంటి నాలుగు కన్నీళ్లు కార్చినట్లు ఎవరికి తెలియదు.
ఆ కళ్ళు ఆ తర్వాత కూడా భస్మాన్ని వెంటాడుతూ ఉండేవి కానీ.., పరధ్యానాన్ని నిష్ఠగా ధ్యానించే భస్మం ఆ విషయాన్ని ఎప్పుడూ గ్రహించలేదు.
రోజులలా గుమ్మడికాయల్లా మెల్లిగా దొర్లుతుండగా,
ఒక రోజు భస్మం కాలేజ్ నుంచి వచ్చేప్పటికి వాళ్ల పదేళ్ల చెల్లెలు చెంపలు, వీపు మీద దెబ్బల తట్లు తేలి ఏడుస్తుంటే,
పిల్లని సముదాయిస్తూ భస్మం వాళ్ళమ్మ కూడా గుడ్ల నీళ్ళు గుడ్లగక్కుకుంటూ ఉంది.
సంగతేంటంటే..., కూతురొచ్చిందని గుండమ్మ ఆ రోజు మళ్ళీ వడియాలు పెడుతుండగా, నోరూరిన పిల్ల ఆపుకోలేక కొంచం పిండి గబుక్కున నోట్లో వేసుకుందిట.
అది చూసిన మేనత్త గుండమ్మకి చెప్తే...
తన ఆజ్ఞ ధిక్కరించిందని ఉక్రోషంతో గుండమ్మ మనవరాల్ని చావబాది, కోడల్ని నానా తిట్లూ తిట్టిందట.
ఇన్నాళ్లూ ఇష్టమైన గుమ్మడొడియాలు తినకుండా ఆపుకుని పడిన కష్టం కన్నా అమ్మ కళ్ళలో నీళ్ళు, చెల్లి చెంపలపై వాతలు ఎక్కువ కోపం తెప్పించాయి భస్మానికి.
అంతే! బామ్మకూ, అత్తకూ ఎలాగైనా తిక్క కుదర్చాలని అనుకున్నాడు. ఆ కచ్చతో బయటకు వెళ్లి, జేబుల నిండా ఇసుక నింపుకొచ్చాడు.
ఎవరూ చూడకుండా డాబా మీదకెళ్ళాడు, ఎదురుగా పట్టా మీద అప్పుడే పెట్టిన వడియాల పిండి చిన్నచిన్న గుండ్రాలుగా ఉంది.
పక్కనే కూర్చుని, జాగ్రత్తగా పట్టా మీద ఇసుక పడకుండా పచ్చిగా ఉన్న ఒక్కొక్క వడియం మీదా ఇసుక చల్లి, ఆ ఇసుక వడియం లోపలికి కూడా వెళ్ళేట్లు పిండి మీద వేలితో అదిమి, ఏమీ ఎరగనట్టు ఇంట్లోకి వచ్చాడు.
తను మెట్లు దిగేటప్పుడు కూడా ఎప్పుడూ వెంబడించే రెండు కళ్ళు తనని వెంబడించాయని భస్మానికీ తెలియదు.
********************************
అంత వరకూ చెప్పి, గొంతెండి పోయినట్లయి, కొంచం మంచినీళ్ళు అడిగి తాగి మళ్ళీ మొదలు పెట్టా.
"తెలుసుగా రమా, ఆ భస్మాన్ని నేనే. బామ్మ పోయాక భస్మాన్ని తీసేసి ఈశ్వర్ అయిపోయా మళ్ళీ"
అర్థమయ్యింది బావా, కానీ నేనిప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఒప్పించమన్న # ఆమె# ఎవరు?
కొంపదీసి, తన వడియాల్లో ఇసుక పోశారని క్షమాపణ చెప్పాలని గుండమ్మమ్మని, అదే మీ బామ్మని తీసుకు రమ్మనరు కదా?
సతీ సావిత్రికైనా ఆవిడ పెట్టిన లిటిగేషన్ వల్ల భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చాడు కానీ అమ్మమ్మ ప్రాణాలు ఇమ్మంటే నాకివ్వడేమో యముడు, అదీ ఆవిడ పోయిన ఇన్నేళ్లకి! నసిగింది రమ.
" ఇంకానయ్యం రమా, బామ్మని కాదు నేను తెమ్మన్నది! గట్టిగా అనకు దిగొచ్చినా రాగలదు మహాతల్లి.
నేను తీసుకు రమ్మన్నది కూష్మాండలక్ష్మిని .
"కూష్మాండమా ? తనెవరూ? అంత బాధలోనూ ఆ పేరు విని నవ్వాపుకుంటూ అడిగింది రమ.
"చెప్తా రమ, పద, మళ్ళీ గుండ్రాల్లోకి వెళదాం" అంటూ రమని తీసుకుని మళ్ళీ గతంలోకి వెళ్ళాను.
************************************
ఆ రోజు నేను బామ్మ వడియల్లో ఇసుక పోసి వచ్చాక 3 రోజులకు సాయంత్రం నేను డాబా మీద ఉండగా వెనకనించి, "ఒరేయ్ భస్మంగా" అని పొలికేక వినిపించింది.
నేను వెనక్కి తిరగ్గానే నా వెనకే ఉన్న మురళీవాళ్ల చెల్లెలు కూష్మాండలక్ష్మి, నా చెంపలు వాయించి పెట్టింది.
నేను దిగ్భ్రాంతిలో వుండగానే నా కాలర్ పట్టుకుని,
"ఇష్టం ఉంటే ఉందనాలి, లేదంటే ధైర్యంగా మొహం మీదే లేదనాలి, అంతేకాని వడియాల్లో ఇసుక పోసి అవమానించడం లాంటి దద్దమ్మ వేషాలు వెయ్యకూడదు."
"నీకిదే నా శాపం, ఒక స్త్రీ పెట్టిన వడియాల్లో ప్రేమ గుర్తించలేని నీ అప్పడం మొహానికి గుమ్మడొడియాలు పెట్టే భార్య ఎప్పటికీ దొరకదు"
అంటూ నా మొహాన కాసిని ఇసుక వడియాలు కొట్టి పోయింది. ఆ దెబ్బలకి మొహం రుద్దుకుంటుంటే ఇంతలోనే గిర్రున వెనక్కి తిరిగి,
"ప్రేమహీనుడివో, ధైర్య హీనుడివో.. నిన్ను ఎంచుకున్న బుధ్ధిహీనురాల్ని నేను " అంటూ ఎక్కడో నవల్లో చదివిన డైలాగ్ అప్పచెప్పి,
"నీ వల్ల నా మీద నాకే కలిగిన అసహ్యానికి నాకు నేను వేసుకునే శిక్ష ఏంటో తెలుసా, ఈ రోజు నుండి గుమ్మడికాయని నా జీవితంలో నుండి బహిష్కరించడం"
అంటూ అర్దం కాకుండా పిచ్చిగా అరుస్తూ తిడుతూ పోయింది.
"మా బామ్మ వడియాల్లో నేను ఇసుక పోస్తే ఈ తింగరిదానికేమి వచ్చింది, ఇలా తిట్టికొట్టి పోయింది?" అనుకుంటుంటే పైన నిండు చంద్రుడు కనబడేసరికి
"ఓహో పౌర్ణమికీ&అమావాస్యకు పెరిగే పిచ్చిరోగమేమైనా ఉందేమో ఈ పిల్లకి పాపం" అనుకుని,
నొప్పి తగ్గేవరకు బుగ్గలు రుద్దుకుని తర్వాత ఆ విషయం మర్చిపోయా.
ఆ తర్వాత ఆ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. ఆ అమ్మాయిని గురించి ఆలోచించలేదు."
"మరిప్పుడు ఎందుకండీ ఆ అమ్మాయిని చూడాలoటున్నారు?"ఆశ్చర్యపోయింది రమ.
"చెప్తున్నా రమా,
రెండ్నెల్ల క్రితం మురళీవాళ్ల బావ బ్రహ్మాండం నాకో మాల్ లో కనిపించాడు.
చిన్నప్పుడు చూశా కనుక ఒకర్నొకరం గుర్తు పట్టి పలకరించుకున్నాము.
ఆ కూష్మాండలక్ష్మి ఈ బ్రహ్మాండాన్నే పెళ్ళాడిందట.
మాట్లాడడం మొదలు పెట్టిన మూడో నిమిషంలోనే వాడు కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే..
"ఆ రోజు నన్ను బాదినట్లు ఈ బ్రహ్మాండాన్ని కూడా రోజూ బాదుతుందేమో ఆ పిచ్చి కూష్మాండo, ఏం చేయలేక గుర్తొచ్చినప్పుడల్లా ఇలా ఏడుస్తుంటాడేమో" అనుకున్నా .
ఇంతలో "ఎంత పని చేసావు భస్మం" అంటూ నా చెయ్యి పట్టుకుని భోరుమన్నాడు బ్రహ్మాండం.
ఆ మాటకి అదిరిపడి, "నేనేం చేశారా నాయనా?" అని అడిగితే బ్రహ్మాండం బద్దలుకొట్టే రహస్యం చెప్పాడా బ్రహ్మాండం.
" నీకు నేను చెప్పిన ఈ కథ మొదటి సీన్లో ఆ రోజు సాయంత్రం నేను మురళీగాడికి నా వ్యథ చెప్తుంటే చాటుగా విని చెమరించిన కళ్ళు కూష్మాండలక్ష్మివే నట!
వాళ్ళమ్మ, పదారుఫలాల నోములో గుమ్మడిపళ్ళు పంచాకా కడుపున పడ్డదని తనకా పేరు పెడితే,
తనేమో నా గుమ్మడొడియాల కథ విని జాలి పడి, నాతో ప్రేమలో పడి, నాకు గుమ్మడొడియాలు
తినిపించేందుకే కూష్మాండం అనే పేరున్న తను పుట్టిందని అన్వయించుకొందట.
నా పేరు కూడా భస్మం అవడంతో ఈ సారరహిత జగతికి బూడిద గుమ్మడికాయ వడియాల రుచి పంచడానికే ఆ పేర్లు కల మేమిద్దరం ఈ భూమి మీద ఉద్భవించామని అనేసుకుందట.
పుస్తకాల మీద, ఇసుక తిన్నెల మీదా, మట్టి దిబ్బల మీదా, పాచి గోడల మీదా ఎక్కడ పడితే అక్కడ భస్మ కూష్మాండం, భస్మ కూష్మాండం అని మా ఇద్దరి పేర్లూ కలిపి వ్రాసేసేదట.
నన్ను గాఢంగా ప్రేమించిన విషయం నాకు చెప్పేముందు గుమ్మడొడియాలు పెట్టడం బాగా నేర్చుకోవాలని, గుమ్మడొడియాలు పెట్టడంలో ఎక్స్పర్ట్ అయిన వాళ్ల అత్త దగ్గరికి తరచూ వెళ్ళి నేర్చుకుని, కష్టపడి ప్రావీణ్యం సంపాదించిందిట కూడా.
అయితే నేను మా బామ్మ వడియాల్లో ఇసుక పోసిన రోజున, మా డాబా మీద కూష్మాండలక్ష్మి కూడా వడియాలు పెట్టిందిట.
మా ఊళ్లో ఓ నాల్రోజుల్లో వడీయాల పోటీ ఉందని తెలిసి, తను ఆ పోటీలో గెలిచి, నన్ను పెళ్ళి చేసుకోవడానికి తనకున్న అర్హత ప్రకటించి మరీ నా దగ్గర తన ప్రేమ వ్యక్తపరచాలని అనుకుందట.
నేనేమో డాబా మీదకెళ్ళి, మా బామ్మ వడియాలు అనుకుని కూష్మాండలక్ష్మి పెట్టిన వడియాల్లో ఇసుక పోశా.
ఎపుడూ నాకోసం వెతికే కూష్మాండలక్ష్మి కళ్ళు, ఇసుక చేతులు దులుపుకుంటూ మెట్లు దిగుతున్న నన్ను చూడనే చూసాయిట.
నేనేం చేసానో తెలియని కూష్మాండలక్ష్మి పోటీకి ఆ ఇసుక వడియాలే తీసుకెళ్తే ఆ వడియాలు రుచి చూసిన జడ్జీలకి నోర్లు కొట్టుకుపోయి రక్తాలు కారాయిట.
ఒకాయన కైతే రెండు వైపులా జ్ఞానదంతాలు ఊడి కిందపడ్డాయిట.
వాళ్లంతా కూష్మాండలక్ష్మిని నల్గురిలో నానా ముక్కచీవాట్లు పెట్టడమే కాకుండా, తను ఇంకెక్కడా ఏ వంటల పోటీల్లోనూ పాల్గొనకూడదని బాన్ చేసేశారాట.
ఆలోచిస్తే..., ఆ రోజు నేనెందుకు ఇసుక చేతులు దులుపుకుంటూ మెట్లు దిగానో అర్ధమయ్యి,
నాకు తన ప్రేమ విషయం తెలిసీ, తనంటే ఇష్టం లేక, కావాలనే తననలా అవమానించానని అనుకుని, ఆ ఉక్రోషంతోనే నన్నంత తిట్టి కొట్టిందట ఆ రోజు!
అందుకే, మళ్ళీ నా మొహం చూడకూడదని, వాళ్ల అత్త దగ్గరికి పోయి, అక్కడే తన బావ బ్రహ్మాండాన్ని పెళ్ళాడి అట్నించే కాపురానికి ఢిల్లీ వెళ్ళిపోయిందిట.
తర్వాత కొన్నాళ్ళకి నా అత్త కూతురివైన నువ్వూ "నన్ను తప్ప పెళ్ళాడన"ని మొండికెత్తట్టం,
నేను భయపడుతుంటే, నీకు మా బామ్మ& అత్తయ్యల పోలికలు రాలేదని, బంగారు తల్లివని మా అమ్మ నచ్చచెప్తే మన పెళ్ళి అయింది అనుకో .
మన పెళ్లయ్యాక నిన్నడిగి పెట్టించుకున్న గుమ్మడొడియాలు తిని నా పళ్ళు కదిలి, నాలుగు రోజులు కడుపు కల్లోలం అయినప్పుడు మాత్రం కూష్మాండలక్ష్మి పెట్టిన శాపం గుర్తొచ్చింది.
నీకు మీ అమ్మమ్మ పోలిక, నాకు మా తాతయ్య చాలికా వచ్చాయేమో అని భయపడి ఇంకెప్పుడూ నిన్ను పెట్టనీలేదు కూడా!
కానీ కూష్మాండలక్ష్మి మాత్రం ఎన్నాళ్ళయినా నా మీద ప్రేమని మర్చిపోయిందిట కానీ, నా మీద ద్వేషాన్ని వదలలేదుట!
" అసలు అలాంటి మూర్ఖుని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి" అని తనను తానే అసహ్యించుకొనేదట.
అర్దం మారి అందరూ నవ్వుతున్నారని బ్రహ్మాండం ఎంత మొత్తుకున్నా వినకుండా, నన్ను గుర్తు చేసే కూష్మాండoని కుదించేసి, తన పేరు కులక్ష్మి అని మార్చేసుకుందట.
గుమ్మడి కాయ పేరెత్తితే ఊరుకోదుట,
శివాలయానికి వెళ్ళదట, విభూతి పండు కనబడుతుందని,
గుమ్మడొడియాలు పెట్టడం కాదు కదా, గుర్తొస్తేనే ఉగ్రరూపం దాల్చుతుందిట!
అలాంటివేమీ జరగకుండా జాగ్రత్త పడుతూ కత్తి మీద సాములా ఇన్నాళ్లూ కాపురం నడిపాడట బ్రహ్మాండం,కూష్మాండo మీద ఉన్న ప్రేమతో!
కానీ, మొన్నామధ్య అమెరికాలో సెటిలైన వాళ్ళమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖర్మ కాలి, అప్పుడే హాలోవీన్ డే వస్తే...,
ఎవరో పిలిచారని పిల్లలతో పాటు పార్టీకి వెళ్ళిన కూష్మాండలక్ష్మీ, అక్కడ వాళ్ళు డెకరేట్ చేసిన హాలోవీన్ గుమ్మడి కాయలు చూసి, కోపంతో శివాలెత్తి, కంట్రోల్ తప్పి, ఆ గుమ్మడి కాయలు నేలకేసి కొట్టి, కాళ్ళతో తొక్కి నానా రభసా చేసిందిట.
వాళ్ళకి వళ్ళు మండి పోలీస్ ను పిలిస్తే. అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎలాగోలా బయట పడి, ఇండియా పరిగెత్తు కొచ్చేసారుట.
ఆలా పోలీసుల దాకా వ్యవహారం వచ్చేసరికి కూష్మాండలక్ష్మీ యింకా తింగరిదై పోయిందని బోరుమన్నాడు బ్రహ్మాండం.
"అంతా విని నాకు బాధ వేసింది రమా, అసలు నాకు ఆ అమ్మాయి ప్రేమ విషయమే తెలీదు. తెలిస్తే ఏదో ఒకటి ధైర్యంగా చెప్పే వాడిని కానీ ఆలా ఆ అమ్మాయి వడియాల్లో ఇసుక పోయడం లాంటి పిచ్చి పనులు చేసేవాణ్ణి మాత్రం కాదు.
ఇప్పుడు ఈ చివరి క్షణాల్లో ఆ అమ్మాయికి ఆ విషయం చెప్పాలని ఉంది.
తను ప్రేమించిన వాడు అంత సన్నాసి, దద్దమ్మ కాదనీ, "అలాంటి వాణ్ణా నేను ప్రేమించింది అని తనని తాను అసహ్యించుకుని హింసించుకోవద్ద"నీ కూష్మాండలక్ష్మికి చెప్తాను, తెలియక అయినా సరే, ఒక మనిషి జీవితకాలం బాధకి కారణం అయ్యానన్న గిల్టీ ఫీలింగ్ నుండి విముక్తి పొందుతాను.""
" ఆలోచిస్తే నాకో అనుమానం కూడా కలుగుతోంది రమా, ఆ అమ్మయి శాపం వల్లే నీకు గుమ్మడొడియాలు పెట్టడం రాలేదేమో, ఆ అమ్మాయి శాపం తగిలే మొన్న చాన్నాళ్లకి వడియాల పిండి తినగానే నాకు హార్ట్ఎటాక్ వచ్చిందేమో!
నా ఫోన్లో ఆ అమ్మాయి నంబర్ ఉంది రమా, మొన్ననే మురళీ దగ్గర నుంచి తీసుకున్నా,
ఒక్కసారి ఆ అమ్మాయికి ఫోన్ చేసి నా విషయం చెప్పు, క్షమిస్తే వచ్చి, తన చేత్తో నాలుగు గుమ్మడొడియాలు ఇవ్వమను, తిని ప్రశాంతంగా పోతాను"
అంటుంటే నా కళ్ళు మూసుకుపోయాయి.
ఎవరో నా చెంపలు వాయగొడుతుంటే మంట పుట్టి, మెళుకొచ్చి, చెంపలు రుద్దుకుంటూ కళ్ళు తెరిచా.
ఎదురుగా నర్సు, డాక్టర్.
"ఎందుకమ్మా పేషంట్ ని అలా చావగొడుతున్నావ్?" గద్దిస్తోంది నర్స్.
"అదికాదండి, నేను ఫోన్లో మాట్లాడి వచ్చేసరికి ఈయన కళ్ళు మూసేస్తున్నారు, సినిమాల్లో పోయే వాళ్ళని ఇలాగే చెంపలు వాయించి నిద్ర పోకుండా ఆపుతారుగా, అందుకే నేనూ అలా చేశా" అమాయకంగా దబాయిస్తోంది రమ.
"మీ సినిమా నాలెడ్జ్ హాస్పిటల్లో వాడకూడదమ్మా, అయినా సినిమాలో చావబోయే వాణ్ణి కొట్టి లేపుతారు, మీరేమో నిక్షేపంగా ఉన్నాయన్ని కొట్టి చంపేట్లున్నారే."
లాయర్ లా లాపాయింట్ తీసాడు డాక్టర్.
"అదేంటి డాక్టర్, నేను బానే ఉన్నానా? చచ్చి పోవట్లేదా? నాకు హార్టాటాక్ రాలేదా?" ఆత్రంగా అడిగాను.
"చావడం ఏంటయ్యా, నీకే హార్ట్ఎటాక్ రాలేదు, ఏదో పడని వస్తువు తిన్నావు, గాస్ట్రయిటిస్ వచ్చింది, దానికే పోతారా ఎవరైనా?మందులు ఇచ్చాముగా తగ్గి పోతుందిలే భయపడకు" అని,
రమ వైపు తిరిగి,
"ఇదిగోమ్మా, ఈ మందులకు పేషంట్ మగతగా నిద్ర పోతాడు, మీరాయన్ని లేపాలని చితక్కొట్టకండి"అన్నారు డాక్టర్.
వాళ్ళు వెళ్ళగానే మంగళ సూత్రం కళ్ళకడ్డుకుని నా చేయి పట్టుకుంది రమ.
"నీ మొహంలో అలసట, ఆ కళ్ళచుట్టూ వలయాలు చూసి, నిజంగా నాకేదో పెద్ద జబ్బుందని డాక్టర్ చెప్పారు, అందుకే నువ్వలా ఉన్నావు అనుకున్నా" అన్నాను.
"అదా, అందుకు కాదు బావా, బహుశా ఆ బ్రహ్మాండంని కలిసొచ్చినప్పటి నుంచేనేమో, మీరు నిద్రలో రోజూ "కూష్మాండo- గుమ్మడొడియాలు" అని కలవరిస్తూ ఉంటే..
పాపం ఎలాగైనా మీకు ఇష్టమైన గుమ్మడొడియాలు చేసి పెట్టాలని నిర్ణయించుకున్నా.
అవి చేయటం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలని నెల రోజుల నుండీ రాత్రి పూట రోజూ యూట్యూబ్ లో వీడియోలు చూడడం, పగలంతా ప్రాక్టీస్ చేయడం.
అందుకే అలసిపోయి ఆలా ఉన్నా బావా" అంది రమ.
" అయితే,మొన్న నువ్వు లేనప్పుడు వంటింట్లో ఏదో పిండి కనిపిస్తే రుచి బాగుంది అనుకుంటూ గిన్నెడు పిండీ తినేసా. అది నువ్వు చేసిన వడియాల పిండేనా!!"
"ఓహో, అంటే ఆ పిండంతా ఖాళీ చేసింది తమరేనా ,ఏమయ్యిందా అని వెతకలేక చచ్చా, అదీ సంగతి, అంత పిండి తింటే గాస్ రాక ఏమవుతుంది? దానికే హార్ట్ ఎటాక్, కూష్మాండలక్ష్మీ శాపం అనుకుంటూ భయపడ్డారు.
పోనీలే బావా, అంతా మన మంచికే, ఇందాక కూష్మాండలక్ష్మికి ఫోన్ చేసి నీ విషయం అంతా చెప్పా. తను కూడా అర్దం చేసుకొని నిన్నూ, తనని తాను కూడా క్షమించేశాననీ, ఇప్పుడు తనకి కూడా చాలా మనశ్శాంతిగా ఉందనీ చెప్పింది.
రేపు ఫ్లైట్లో ఢిల్లీ నుండి తామిద్దరం నిన్ను చూడడానికి వస్తాం అని కూడా చెప్పింది" అంది రమ.
నాకూ చాలా రిలీఫ్ గా అనిపించింది.
నా కళ్ళలో ఆనందం చూసి...
"ఇంకో శుభవార్త చెప్పనా బావా, ఈ నెల రోజుల ప్రయత్నంతో నాకు గుమ్మడొడియాలు పెట్టడం వచ్చేసింది. రేపు కూష్మాండ బ్రహ్మాండాలు వస్తారుగా, మీ మగవాళ్లిద్దరూ భార్యల చేతులతో ఆ వడియాలు తిని, మీ మీ గుమ్మడొడియ జీవితాన్ని పునః ప్రారంభం చెయ్యండి" అంది రమ.
" అదేం లేదు రమా, ఒకప్పుడు బామ్మ గుమ్మడొడియాలు తిననీలేదనే నేను అంత బాధపడ్డా కదా,
మరి "తను అంతగా ప్రేమించిన వ్యక్తి కావాలని తనని అవమానించాడు" అనుకుని కూష్మాండ లక్ష్మి ఇంతకాలం ఎంత బాధ పడిందో" అన్న జాలితో నీకా కథంతా చెప్పా కానీ ఇప్పుడు నాకేం అంత గుమ్మడొడియాల పిచ్చి లేదు.
నా జీవితాన్ని ఇంతగా రుచింప చేసే నువ్వే నా నిజమైన బంగారు గుమ్మడొడియానివి" అంటూ రమ చేతిని ముద్దాడాను.
No comments:
Post a Comment