Monday, September 29, 2025

సీజన్ మామయ్య - చిన్నారి పెళ్ళి కొడుకు

 సీజన్ మామయ్య - చిన్నారి పెళ్ళి కొడుకు 


మీకో విచిత్రం చెప్పనా..

ఇవ్వాళ మా బుజ్జి అన్నయ్య ఫోన్ చేశాడు, చెప్పింది సునీత.


ఎవరూ మీ సీజన్ అన్నయ్యా.

ఆయన ఫోన్ చేశాడంటే అది విచిత్రమే కాదు , విడ్డూరం కూడా!

తుఫాన్లు వస్తాయో, ఏకంగా సునామీ లే వస్తాయో అన్నాడు ప్రకాష్.


హహహ! సీజన్ అన్నయ్యా... భలే పేరు పెట్టారే! పగలబడి నవ్వింది సునీత.


నేను పెట్టడం ఏంటి మీరంతా అనుకుంటూ ఉంటారుగా ఆయన సీజన్ ఎలా ఉందో ఇప్పుడు అనీ .


నిజమే, మేము ఆయన మానసిక వాతావరణం ఎలా ఉందో అని అనుకుంటుంటే మీరు ఏకంగా తన పేరే సీజన్ అన్నయ్య అని పెట్టేసారు. భలే పేరు!


అవునండోయి. వాళ్ళ ఇంటికెళ్తేనే సరిగా మాట్లాడని ఆయన గారు ప్రత్యేకం తనంతట తానే ఫోన్ చేశాడంటే మీరన్నట్లు తుఫానే వస్తుందో లేక మీరు ఆయనకు పెట్టిన పేరుకు తగ్గట్లు సీజనల్గా మంచు తుఫాన్లో వడగాల్పులో కూడా రావచ్చేమో.


"ఇంతకీ మీ సీజన్ అన్నయ్య ఫోన్ ఎందుకు చేశాడో చెప్పలేదు. ఏంటిటా సంగతీ?"


"ఏమో, ఫోన్ చెయ్యడం వరకు చేశాడు గానీ సరిగ్గా మాట్లాడితే కదా? 

"హలో, నేను, బుజ్జినీ" అన్నాడు అంతే! ఆ తరవాత "బాగున్నావా అన్నయ్యా దగ్గర్నుంచి ఉంటాను అన్నయ్యా వరకూ నేను మాట్లాడడమే. నేను అడిగిన వాటికి ఊ, ఆ అని ఏకాక్షర శబ్దాలు చేశాడు అంతే. కొన్నిటికి అయితే ఆ శబ్దాలు కూడా లేవు. రామ సోది వాళ్ళ లాగా ప్రశ్నా నాదే, సమాధానం నాదే . అసలు లైన్లో ఉన్నాడో ఫోన్ పెట్టాశాడో తెలియక దేభ్యం మొహంలా ఫోన్ స్క్రీన్ చూసుకోవాల్సి వచ్చింది మధ్యలో" అని తల కొట్టుకుంది సునీత.

"ఈసారి మీ సీజన్ అన్నయ్యకు నెంబర్ డయల్ చేసాక నువ్వు ఫోన్ ఎత్తే లోపే సీజన్ మారి మాట్లాడే మూడ్ పోయిందేమో.

భలే వాడే!" అన్నాడు ప్రకాష్.


ఆ తర్వాత వారం రోజుల పాటు సునీత, తన కజిన్ అక్క చెల్లెళ్లు నలుగురి ఫోన్లు ఒకరినుండి ఒకరికి మ్రోగుతూనే ఉన్నాయి.

ఎందుకంటే వాళ్ళు నలుగురికీ, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికీ కూడా బుజ్జి అన్నయ్య ఫోన్ చేశాడు. 

పెదనాన్నను చూడటం కోసం వాళ్ళ ఇంటికెళ్ళినా, పరాయి ఖండపు అపరిచిత వ్యక్తులను చూసినట్లు మొహం త్రిప్పుకు పోయే బుజ్జన్నయ్య తనంతట తానుగా తమకు ఫోన్ ఎందుకు చేశాడు అనేది వాళ్ళందరికీ బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం లాగా అంతు చిక్కలేదు.

"నీకూ చేశాడా!" అంటే "నీకూ చేశాడా?" అని వాళ్ళంతా విడి విడిగా మాట్లాడుకుని ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యం తీరక అందరూ కాన్ఫరెన్స్ కాల్ చేసుకుని మరీ సంఘటితంగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.


ముగ్గురు అన్నదమ్ముల సంతానం వీళ్లందరూ. బుజ్జి అందరి కంటే పెద్దాయన కొడుకు. తనకో స్వంత అక్క!


సునీత 2 వ ఆయన కూతురు, తనకో చెల్లి.

3 వ ఆయన కు పుట్టిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి, సునీత వాళ్ళు, వీళ్ళు ఐదుగురూ దగ్గర దగ్గర వయసు వాళ్లవ్వడంతో చిన్నప్పటి నుండి స్నేహంగా. చనువుగా ఉంటారు.


అందుకే వాళ్ళ ఐదుగురి మధ్య ఆ ఆశ్చర్యార్ధక ఫోన్ కాల్స్ ఒకటి కాదు రెండు కాదు ఓ వారం జరిగాయి..

జరగవు మరీ, చెప్తే నమ్మరు కానీ బుజ్జి అలాంటి వాడే! చిన్నప్పటి నుంచీ ఎవరితో కలవకుండా తేడాగానే ప్రవర్తించేవాడు. ఎప్పుడో ఒకసారి తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రం మాట్లాడేవాడు. అదే పండుగ అందరికీ!

పాపం అందరి కన్నా పెద్ద అన్నయ్య అనీ, తమ ప్రియతమ పెద్ద పెదనాన్న కొడుకనీ వదులుకోలేక, ఆ అన్నదమ్ముల పిల్లలంతా

" ఏదోలే తన మూడ్ బాలేదు. ఇప్పుడు మాట్లాడే సీజన్ కాదు" అని అదో నవ్వులాట గా చేసి తమకు తాము సరిపెట్టుకున్నారు కానీ బుజ్జి సీజన్ నూటికి తొంభై తొమ్మిది సార్లూ బాగోదు. తను ఎవరి ఇంటికి వెళ్ళడు, ఎవరైనా తమ ఇంటికి వచ్చినా తను మాట్లాడించక పోగా వాళ్లకు తనను మాట్లాడిచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చరచరా మొహం త్రిప్పుకు వెళ్ళి పోతాడు. పోనీ చిన్నప్పుడంటే తెలియదు అనుకుంటే పెద్దయ్యాక పెళ్ళయ్యి పిల్లల తండ్రి అయినా తన తీరు అంతే! పెద్దవాడైన పెదనాన్నను చూడటం కోసం సునీత వాళ్ళు వెళితే వీళ్ళని మంచి నీళ్ళు కూడా అడగకుండా వాళ్ళు మాత్రం అతిథుల ముందే కిచెన్ నుంచి వయా హాలు బెడ్రూంలోకి కాఫీలు, టిఫిన్లూ, భోజనాలు సమయానుకూలంగా తీసుకెళ్లి తలుపులు వేసుకుని మరీ ఆరగిస్తారు... బుజ్జన్నయ్య , ఆయన గారి అనుకూలవతి అయిన భార్య లలిత!

ఆ చర్యలు చూసి అసహాయంగా మొహం చిన్నబుచ్చుకున్న పెదనాన్నను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ముఖం మీద నవ్వు పులుముకుని,

ఏమీ జరగనట్టు నటించి వస్తుంటారు సునీత వాళ్ళు.

ఎప్పుడో ఒకసారి ఏ బంధువుల పెళ్ళిలోనో కలిసినప్పుడు మాత్రం తనకు బోర్ కొడితే మాట్లాడే బుజ్జన్నయ్యను చూసి ఆనంద పడిపోయి, "పాపం బుజ్జన్నయ్యకు మనమంటే అభిమానమే! కానీ ఇంటికెళ్తే ఇలా ఉండడేమిటో? . పోనీలే ఇవ్వాళ తన సీజన్ బాగుంది" అని సరిబుచ్చుకుంటారు ఆ అల్ప సంతోషులు. అందుకే ఉన్నట్లుండి తనంతట తానుగా బుజ్జన్నయ్య అందరికీ ఫోన్ చేయటం గురించి అంత చర్చ!


సరే, ఒక వారం పాటు అందరూ బుజ్జన్నయ్య ఫోన్ గురించి మాట్లాడుకుని అలసిపోయాక మరుసటి వారంలో రోజుకొకరికి చొప్పున మళ్ళీ బుజ్జి నుండి ఫోన్ లు వచ్చాయి.

ఫోన్ చేస్తాడు , ఏమీ మాట్లాడడు. మౌనం పాలే ఎక్కువ విషయం అసలుకే ఉండదు. మళ్ళీ అందరూ ఫోన్లలో తమ జుట్టు తామే పీక్కున్నారు.


ఈ తతంగం అంతా చూస్తున్న ప్రకాష్ ఓ రోజు విసుగు పుట్టి "అబ్బా! ఆయన ఫోన్ చెయ్యటం, మీరేదో పెద్ద బ్రహ్మ రహస్యం కనుక్కోవాలి అన్నట్లు ఆపకుండా ఆన్లైన్ మీటింగ్ లు పెట్టడం, విసుగు పుడుతోంది. తిక్క బాచీ మీరూనూ.

అంత విశ్లేషించటానికి ఏముంది, మీ బుజ్జన్నయ్య పిల్లలు పెద్దవాళ్ళయ్యారుగా. వాళ్ళకీ పెళ్ళిళ్ళు చెయ్యాలిగా, ఇప్పటి దాకా పొట్ల చెట్టుకు పొరుగు గిట్టదన్నట్లు ఎవరితో కలవకుండా ఉన్నాడు, ఇప్పుడు నలుగురితో మంచిగా ఉండకపోతే తన పిల్లలకి మంచి సంబంధాలు రావని అందరితో కలవాలని ప్రయత్నిస్తూ ఉంటాడులే" అని తేల్చేశాడు ప్రకాష్.


ప్రకాశ్ మాటలకు "నిజమే అంతే అయ్యుంటుంది" అనుకున్నారు అందరూ.

అయితే కథ అక్కడితో ఆగితే కమామీషు ఏముంటుంది?

ఆ తర్వాత నెలలో పెద్ద మలుపు తిరిగింది.

ఓ నెల పాటు పచారీ కొట్టు సామాన్ల లిస్ట్ లో ఒక్కొక్కదానికీ టిక్కులు పెట్టుకు పోయినట్లు, ప్రతివారం తన తమ్ముళ్ళు చెల్లిళ్ళకు వరసగా ఫోన్ చేసిన బుజ్జి రెండో నెల నుంచి మిగిలిన వాళ్లకు తగ్గించి సునీతకు మాత్రం ఫోన్ల డోస్ పెంచాడు.


ఆ అంశం మీద మళ్ళీ సర్వ సభ్య సమావేశం చేసిన సునీతా వాళ్ళ కమిటీ సభ్యులకు ఒక అనుమానం వచ్చింది, కొంపదీసి బుజ్జన్నయ్య తన కూతురిని సునీత కొడుకు ధీరజ్ కి సంబంధం అడుగుదామని అనుకుంటున్నాడా అని!


ఆ అనుమానం రాగానే అందరూ ఆ ఆలోచనను ఖండించి, ఆ ఊహకే ఖేదం వ్యక్తం చేసి, సునీతకు ముందస్తు సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు.


"వామ్మో, ఇంకేమైనా ఉందా, ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కొంపకెళ్తే సరిగ్గా మంచి నీళ్ళు కూడా మొహాన పొయ్యరు, అలాంటి పెంపకంలో పెరిగిన పిల్లని చేసుకుంటే ఇక నువ్వు, బావగారు కాశీకి పోవాల్సిందే" అని ఒకరంటే..


"అవును, ఆ పిల్లల్ని కూడా ఎవరితో కలవనీకుండా ఓ మంచి, మర్యాద నేర్పకుండా పెంచారు బుజ్జన్నయ్య వాళ్ళు. పైగా బుజ్జన్నయ్య భార్య , అత్తగారు ఎవ్వరిని గెలవనిచ్చే రకం కాదు, రేపు పెళ్లవ్వగానే ఆ పిల్ల అరణం లా అమ్మమ్మని గానీ తోడు తెచ్చుకుందంటే నువ్వు, బావ గారు కాశీ వెళ్ళటానికి కూడా డబ్బులుండవు మీ దగ్గర, ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో మడతమంచాలు వేసుకొని పడుకోవాలి ఇద్దరూ," అని ఇంకొకళ్ళు అన్నారు.


అసలే తన కొడుకు ఈ ప్రపంచోత్తమ బ్రహ్మచారి అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని భావించే సునీత

"ఎందుకులే తల్లి, అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిన్నారి కొడుకు వాడు! అభం శుభం తెలియని అమాయకుడు.

ఉన్న ఒక్కగానొక్క పిల్లాడికి అలాంటి సంబంధం చేయడమూ వద్దు, మేము గుళ్ళల్లో గొబ్బెల్లో పడుకోనూ వద్దు, అంతదాకా వచ్చి అన్నయ్య సంబంధం అడిగితే ఏదో ఒక వంక చెప్పి ఎగర గొట్టేస్తాలే" అంది .


పోనీ కథ ఇక్కడితో ఆగినా బాగుండేది. కానీ ఈ కథకి ఘాట్ రోడ్డులో లాగా ఓ హెయిర్ పిన్ కర్వ్ వచ్చింది.


ఆ తర్వాత కొద్ది రోజులకే సీజన్ అన్నయ్య నుండి ఒక ఆకస్మిక, అనూహ్య, ఆశ్చర్యకర ఫోన్ కాల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే బుజ్జి తన భార్యా బిడ్డా సమేతంగా మరీ సునీత వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు.

ఆ హఠాత్ సంఘటనకు ఏమీ తోచలేదు సునీతా వాళ్ళ కు.

"ఇంకేముంది, సంబంధం అడగటానికే వస్తున్నాడు. అందుకే అందరినీ తీసుకు వస్తున్నాడు" అనుకుని ఎలా కాదనాలో ఏమి కారణాలు చెప్పాలో తెగ రిహార్సల్స్ వేసుకుంది సునీత.


కానీ బుజ్జన్నయ్య వాళ్ళని చూడగానే ఒక్క మాట రాకుండా సిరివెన్నెల సినిమాలో సుహాసినిలా అయిపోయింది సునీత పరిస్థితి.

దానికి కారణం బుజ్జన్నయ్య కూతురు అనన్య. ఎన్నాళ్ల తర్వాతో చూసారేమో, ఆ అమ్మాయి అందం చూడటానికి రెండు కళ్ళూ చాలలేదు సునీత వాళ్లకు. ముఖం చూస్తే ముద్ద మందారంలా, కళ్ళను చూస్తే కలువ రేకుల్లా,

వంటి తీరు చూస్తే సన్నజాజి పువ్వులా మొత్తానికి ఓ నడిచే పూల బుట్టలా సునీతను విస్మయ పరిచింది. 

ఇంక ధీరజ్ సంగతి చెప్పక్కర్లేదు. వాడికైతే ఆ పిల్ల మనసున్న మిఠాయి పొట్లంలా అనిపించిందేమో... వాళ్ళున్నంత సేపు మతిభ్రమించిన ఈగలాగా అక్కడక్కడే తిరిగాడు.

  బుజ్జి బోలెడన్ని కబుర్లు చెప్పాడు, తెగ జోకులు వేశాడు. చనువుగా భోజనం చేసాడు. బుజ్జి భార్య లలిత కూడా భర్తను అనుసరించింది. ఆయన పిల్లలు కూడా చాలా పొందిగ్గా మాట్లాడారు. సునీతా వాళ్ళతో ఎన్నెన్నో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.

 అత్తయ్య వాళ్లకు పాట పాడి వినిపించమ్మా అని అనన్యతో పాట పాడించాడు బుజ్జి. వెళ్ళేటప్పుడు అత్తయ్య మామయ్య కాళ్ళకు దణ్ణం పెట్టమని పెట్టించాడు. ఆ పిల్ల కూడా ఎంతో ముచ్చటగా చెప్పినవన్నీ చేసింది. 

 పెళ్ళి సంబంధం మాట మాత్రం ఏమీ ఎత్తలేదు. 

హఠాత్తుగా ఆ ఊరి ఆంజనేయస్వామి గుడిలో ఎప్పుడో మొక్కుకున్న మొక్కు గుర్తొచ్చిందనీ అందుకే దర్శనం కోసం వచ్చామని చెప్పాడు. 

అలా ఒక పూట అంతా హడావిడి చేసి వెళ్ళాక వాళ్ళు అటు వెళ్ళీ వెళ్ళక ముందే ధీరజ్ బుజ్జీ వాళ్ళని, ముఖ్యంగా అనన్యనూ పొగడటం మొదలు పెట్టాడు. మీరంతా అంత మంచి వాళ్ళ మీద అనవసరంగా చెడు అభిప్రాయం పెట్టుకున్నారేమో అని అనుమానం వ్యక్తం చేసాడు. అనన్యను కోడలిగా తెచ్చుకోవటం ఎన్ని రకాలుగా ఆ ఇంటికి మంచిదో వర్ణించాడు. 

మొత్తానికి ఆ అబ్బాయి అనన్య అందానికి బొక్కబోర్లా పడ్డాడని అర్థమైపోయింది సునీత కు. 

అభం శుభం తెలియని చిన్నారి అనుకున్న తన కొడుకు అనన్య కు పెళ్ళి కొడుకుగా మారటానికి పడుతున్న తాపత్రయం తెలిసిపోయింది.


ప్రకాష్ కూడా "ఆ అమ్మాయి నడిస్తేనే నాట్యం చేసినంత అందంగా, మాట్లాడితేనే మంత్రం చదివినంత పద్ధతిగా ఉంది అలాంటి పిల్లను ఎలా వదులుకుంటాం సునీతా?" అన్నాడు. 


ఇక సునీత పరిస్థితి కూడా అంతే!


దానికి తోడు ధీరజ్ ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా, ఎంత ఆస్తి పరుడు , కళ గల ముఖం అయినా

పిల్లాడు ఓ గుప్పెడు ఎత్తు తక్కువ ఉండటం,  

వాళ్ళ గోత్రం వాళ్ళే ఎక్కువ ఉండి, సగోత్రీకులన్న కారణంతో మంచి సంబంధాలన్నీ తప్పిపోవడం..

ఈ రెండు కారణాలతో ధీరజ్ కి సంబంధం వెతకటం తను అనుకున్నంత సులభం కాదని సునీతకు ఈ మధ్యే అర్థమయ్యింది. 

అందుకే అన్నీ కుదిరిన కుందనపు బొమ్మ లాంటి అనన్య ను వదులుకోవడానికి మనసొప్పలేదు !


ఇక ఆ తర్వాత జరిగిన తమ కజిన్ల శిఖరాగ్ర సమావేశంలో బుజ్జన్నయ్య మారిపోయాడని అందరికీ నచ్చ జెప్పింది సునీత!

ఒక వేళ ఆ ఇంట్లో పెంపకం సరిగా లేకపోయినా తన ఇంటికి వచ్చాక అనన్యకు మంచీ చెడూ నేర్పి తమ ఇంటి పద్ధతులు తనే అలవాటు చేసుకోగలను అంది. మొత్తానికి కిందా మీదా పడి అన్నయ్యతో సంబంధం కలుపుకోవడానికి 

అక్కచెల్లెళ్ళు అందరితో ఔను అనిపించుకుంది.


కానీ బుజ్జన్నయ్య నుండి ఏ చడీ చప్పుడు లేకపోవటంతో ఒక చెల్లెలి తో "ధీరజ్ కి సంబంధాలు చూస్తున్నారు, నీకేమైనా ఉద్దేశ్యాలు ఉంటే అనన్య కోసం అడగమని అన్యాపదేశంగా చెప్పించింది".

అలా చేసినా కూడా ఆ తర్వాత రెండు నెలలయినా బుజ్జన్నయ్య నుండి ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

పైగా అంతకు ముందు వచ్చే ఫోన్లు కూడా ఆగిపోయాయి.

 

ఇంట్లో ఓ పక్క తన కొడుకు ధీరజ్ గోల ఎక్కువైపోయింది సునీతకు. 

ఎప్పుడు చూసినా అనన్య గురించే ఆలోచించటం ,ఏదో ఒక రకంగా ఆ అమ్మాయి మాటే ఎత్తడం.. త్వరగా సంబంధం కుదర్చమని పీక్కు తినటం. దేవుడా! చిన్నప్పుడు చాక్లెట్ లు ఐస్ క్రీమ్ లు కొనమని కూడా ఇంత పేచీ పెట్టలేదు , ఇప్పుడీ వయసులో పెళ్ళి కొడుకు అవటం కోసం చిన్న పిల్లలలా మంకు చేస్తున్నాడు ఈ చిన్నారి పెళ్ళి కొడుకు అనుకుంది సునీత.


 ఇక ఆ గోల తట్టుకోలేక ఒక రోజు "మనమే వెళ్ళి సంబంధం అడుగుదా"మని తీర్మానించింది. 

"అదేంటి సునీతా, సంప్రదాయం ప్రకారం అమ్మాయి తరపు వాళ్ళే ముందు అడగాలిగా" అన్నాడు ప్రకాష్.

"ఆ, సంప్రదాయం లేదు, సాంబారన్నం లేదు, సమయం సందర్భాల బట్టే సంప్రదాయాలు.

మనసు ఉన్నా ముందడుగు వెయ్యటానికి మొహమాట పడుతున్నాడు మా బుజ్జన్నయ్య. 

ఆ రోజు మనింటికి వచ్చినప్పుడు చూసారుగా ప్రత్యేకించి పిల్లను మనకెలా చూపించాడో. ఇన్నాళ్ళ నుండి కలవకుండా ఒక్కసారి సంబంధం అడగాలంటే తనకూ బెరుకుగా ఉంటుందిగా పాపం, అందునా మనలాంటి అన్ని రకాలుగా హై లెవెల్ సంబంధం అడగటానికి ధైర్యం చాలాలిగా. 

అందుకే, మగ పిల్లాడి తల్లిని అయినా నేనే పెద్ద మనసు చేసుకుందాం అనుకున్నా. మన మధ్యలో పేద గొప్ప తేడాలేంటి అన్నయ్య, అని తనకు ధైర్యం చెప్పి సంబంధం కలుపుకుంటా" అంది సునీత. 


ఓ శుభముహూర్తాన ఉన్న నగలన్నీ అలంకరించుకుని, ఆపసోపాలు పడుతూనే బరువైన పట్టు చీర కట్టుకుని, కావల్సినన్ని హంగులు ప్రదర్శిస్తూ సంబంధం మాట్లాడడానికి ప్రకాష్, ధీరజ్ లతో కలిసి బుజ్జి వాళ్ళ ఇంటికి బయలుదేరింది సునీత.


ఇక ధీరజ్ హడావిడి అయితే చెప్పక్కర్లేదు, ఆ రోజే పెళ్ళి అన్నట్లు తలనుండి కాళ్ళ వరకూ రక రకాల 

వేసుకునేవి, పూసుకునేవి, పోసుకునేవి కొనుక్కుని మరీ ఆ రోజు కోసం తయారయ్యాడు.

ఆ గలాటా చూసి "వార్నీ, నా పెళ్ళి మొత్తం కలిపి కూడా ఈ రోజు వీడు పెట్టినంత ఖర్చు అవ్వలేదుగా, ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్ళికి ఏ ఆస్థి అమ్మించి ముస్తాబవుతాడో?" అనుకున్నాడు ప్రకాష్.

మొత్తానికి సునీత, ప్రకాష్ తమ కారులో, ధీరజ్ మాత్రం ఊహల పల్లకిలో ఎక్కి బుజ్జి వాళ్ళింటికి చేరారు.


 

....


తలుపు తియ్యంగానే ఎదురుగానే ఉన్న బుజ్జన్నయ్య సునీతా వాళ్ళ వైపు చిరాకుగా ఓ చూపు విసిరి గిరుక్కున లోపలికి వెళ్ళిపోయాడు అచ్చూ అదివరకులా.

ఆయన భార్య కూర్చోడానికి కుర్చీ చూపించినా ఏమీ మాట్లాడకుండా ఎటో చూస్తూ నిలబడి మీరు వెళితే నేను తలుపేసుకుంటా అన్నట్లుగా బాడీ లాంగ్వేజ్ ప్రదర్శిస్తోంది.

 ఓ పక్క సునీత పరిస్థితి పెనం పై పరచిన దోశలా అట్టుడుకుతున్నా ఏదో ఒక మాట కలపాలని "పిల్లలు లేరా? అనన్య ఏది?" అని అడిగింది.

"అదా, లోపల పడుకుంది సునీతా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పటినుండి తనకు ఆ వాతావరణం పడక ఒకటే ఎలర్జీ .  

"ఇంకెప్పుడూ ఆ పల్లెటూరి మాట ఎత్తకండి, ఆ పల్లెటూరి వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళకండి" అని తేల్చి చెప్పేసింది అంటూ నర్మగర్భంగా నవ్వింది లలిత. 

తను అడగాలనుకున్న విషయం ముందే గ్రహించి ఆ మాట చెప్పింది వదిన అని గ్రహించి 

"ఔను వదినా పడని చోటికి రాకపోవడమే మీకూ మాకు మంచిది" అని లేచి వచ్చేసింది సునీత. ఆమె వెనకనే ప్రకాష్, ధీరజ్. 

"మొన్న మన ఇంటికి వచ్చి అంత ప్రేమగా గడిపి వెళ్లింది వీళ్లేనా అసలు?!" అని దిగ్భ్రాంతికి లోనయ్యారు ముగ్గురూ.


అప్పుడే అనన్యతో కలిసి పెళ్ళి పల్లకి ఎక్కి ఊహా విహారం చేస్తున్న ధీరజ్ అయితే....

అదే పెళ్ళిలో ఎక్కించిన గుర్రం పిచ్చి పిచ్చిగా పరుగెత్తి తనను తీసుకెళ్లి ముళ్ళ కంపల్లో పడేసినట్లు దేభ్యం మొహం పెట్టాడు.


బయల్దేరిన కొంచెం సేపటికి వీళ్ళ మొహాల్లో లాగే జీవం పోయి నీరసపడ్డ కార్ ను పెట్రోల్ బంక్ కు తీసుకెళ్తే అక్కడ బుజ్జన్నయ్య వాళ్ళ మేనమామ కొడుకు మహేష్ కనబడ్డాడు. 

కుశల ప్రశ్నలు అయ్యాక బుజ్జి సంగతి ఏంటో తెలుసుకుని ఆ పజిల్ సాల్వ్ చేద్దామని, "ఏంటో ఈ మధ్య మీ బుజ్జి బావ అందరితో తెగ కలిసిపోతున్నట్లు ఉన్నాడు" అన్నాడు ప్రకాష్.


"కలిసిపోవటమా నా పిండాకూడా, అదేం లేదు. ఆయన గారు వాళ్ళ బావమరిది ఒక్కడితో తప్ప ఎవరితో మాట్లాడడుగా. ఎంత అణచుకున్నా లోపలున్న సహజ తిక్క ఎప్పుడొకప్పుడు తోక తొక్కిన నక్కలా లేవకపోదుగా. ఆ బావ మరిది తో కూడా మిగిలిన వాళ్ల తోలానే ప్రవర్తిస్తే మొన్నీ మధ్య ఇద్దరికీ చెడి మాటా మాటా అనుకున్నారట.  

 ఆ కోపంలో ఆ బావమరిది

" నువ్విలాంటి వాడివి కనుకే నీ బంధువులు ఎవ్వరూ నీ మొహం చూడరు, మా అక్కయ్యని ఇచ్చాం కనుక నా ఖర్మ కాలి ఇన్నాళ్ళూ నేనయినా మాట్లాడాను. నీ మూలాన అత్తింటి వైపు నుండి మాట్లాడించే దిక్కు లేక మా అక్క అల్లాడుతోంది" అని తిట్టి పోసి, తనూ బుజ్జి బావతో మాట్లాడడం మానేశాడట.

ఆ ఉక్రోషంతోనే ఈయన గారు తనకూ బంధువులు ఉన్నారని ఆ బావమరిది కి చూపించుకోవటం కోసం ఇటు మా వైపూ అటు మీ వైపూ అందరి వెంటా పడ్డాడు. 


అందరికీ ఫోన్ చేసి, మాట కలిపి, మంచిగా మాట్లాడిన వారి ఇళ్ళకు సపరివార సమేతంగా వెళ్ళి, ఫోటోలు తీసుకొని వాటిని వాట్సప్ స్టేటస్లుగా పెట్టి .. "చూసావా నాకు ఎంత మంది బంధువులు ఉన్నారో" అని తన బావ మరిదికి చూపించుకున్నాడు.

అలా ఇటు అమ్మ వైపు చుట్టాలని, అటు నాన్న వైపు వాళ్ళనీ ఒకేసారి ఓ పట్టు పట్టాడన్నమాట మా బుజ్జి బావ .

ఏదో ఆయన మారాడనుకున్నాం కానీ అంతా మన భ్రమ.

ఇప్పుడు ఆ బావ మరిది, తనూ మళ్ళీ కలిసిపోయారట! అందుకే మళ్ళీ ఇక మన మొహం చూడటం మానేశాడు" అన్నాడు మహేష్.


"ఏంటీ నీకూ అయ్యిందా మళ్ళీ ఆ సత్కారం" నీరసంగా అడిగింది సునీత.

"ఆహా, మొన్న రోడ్డు మీద కనిపిస్తే బావా! అని భుజం మీద చెయ్యేస్తే పురుగుని విదిలించినట్లు విదిలించి పొయ్యాడు. వారంలో ఇంత మార్పు ఏమిటా అని నేను నివ్వెరపోయి వాళ్ళక్కకు ఫోన్ చేస్తే ఇదంతా తను చెప్పింది. తను మనకన్నా ఎక్కువగా తప్పించుకోలేని బాధితురాలుగా!


ఆ విధంగా

అయిన వాళ్ళని పట్టు- సెల్ఫీ కొట్టు, 

స్టేటస్ పెట్టు - బామ్మర్ది కి చూపెట్టు.


 అనబడే యజ్ఞంలో మనందరం సమిధలము కాబడ్డామన్న మాట."

అని పెద్దగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మహేష్.


"అయ్యో రామ! వీళ్ళంతా ఉట్టిగా ఆయన మాటల మీదే ఆశ పెట్టుకున్నారు కనుక ఇంత సులభంగా దులిపేసుకుంటున్నారు, మనమేమో ఏవేవో ఊహించుకుని పిల్లాడిని కలుపుకుని మరీ ఎక్కడికో వెళ్లి పోయాం , మనం ఇంత సులభంగా వెనక్కిరాలేం, టైమ్ పడుతుంది." అని నిట్టూర్చాడు ప్రకాష్.


"హ్మ్మ్... ఇంత ఘోరంగా మనుషులను తన స్వార్థం కోసం వాడుకుంటాడా , మనుషుల మనసులు- అనుబంధాలకు విలువే ఇవ్వడా అసలు! ఏదో ఒక రోజు భగవంతుడు గుణ పాఠం నేర్పకపోడు" అని విరుచుకు పడింది సునీత.


" దేవుడు తనకు గుణపాఠం నేర్పినప్పుడు తను నేర్చుకుంటాడులే కానీ భగవంతుడు ఇప్పుడు మనకు నేర్పిన గుణపాఠాన్ని మనం నేర్చుకుందాం ముందు" అన్నాడు ప్రకాష్.


"మనకు గుణపాఠమా, మనమేం తప్పు చేశాం ఇందులో?" కోపంగా అడిగింది సునీత..


"ఏం చేశామా? మీ అన్నయ్య తన అందమైన కూతుర్ని ఇస్తాడన్న నమ్మకంతో ఈ మధ్యలో వచ్చిన ఎంతమంది అమ్మాయిలకు ఎన్ని వంకలు పెట్టి తిరస్కరించారు మీ అమ్మా కొడుకులు?

మొన్నొక ఉద్యోగం చేసే అమ్మాయి సంబంధం వస్తే ఏమన్నావు నువ్వు?

"ఆ, అమ్మాయిలు పెళ్ళికి ముందు నాకింత ప్యాకేజ్ నాకంత ప్యాకేజ్ అని చెప్పుకుంటారు కానీ పెళ్లవ్వగానే కడుపనీ, బాలింతననీ ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చుంటారు" అన్నావా లేదా?

ఆడదానివి అయ్యుండి సాటి స్త్రీ గురించి, అందునా మాతృత్వం గురించి అంత తేలిగ్గా ఎలా మాట్లాడ గలిగావ్?

పోనీ నీ కొడుకే కడుపుతో ఉండి, పిల్లల్ని కనగలదేమో చూడు, అప్పుడా అమ్మాయి ఖచ్చితంగా ఉద్యోగం మానెయ్యకుండా ఉండగలదు. అందామనిపించింది నాకు.


నీ కొడుకు కూడా ఏమీ తక్కువ తినలేదు. అందాల భరిణ లాంటి అమ్మాయిని చూసి ఆశ పడటం తప్పని నేను అనను. కానీ ఆ సంబంధానికి నువ్వు ఒప్పుకోవేమో అని నిన్ను ఒప్పించటానికి ఏమని అన్నాడు?

" బుజ్జి మామయ్య వాళ్ళు మనతో పోలిస్తే లేనివాళ్ళే కదా అమ్మా, పేదింటి పిల్లని చేసుకుంటే మనం చెప్పినట్లు పడి ఉంటుంది అనలా?

అంటే అదేదో సినిమాలో చెప్పినట్లు, ఆ అమ్మాయి పట్ల గౌరవాన్ని కాదు, చిన్నతనాన్ని సృష్టించి వివాహ బంధానికి పునాది వేద్దామనుకున్నాడు, ఎంత తప్పు?"


"ఏదో నేను వాళ్ళ సంబంధం ఇష్టపడనేమోనని, పాపం నన్ను ఒప్పించడం కోసం లౌక్యంగా మాట్లాడాడులేండి పిల్ల సన్నాసి, అదీ తప్పేనా?"


"లౌక్యం అంటే ఎదుటి మనిషిని నొప్పించకుండా నిజాయితీ నిలుపుకోవడానికి సాధనం అవ్వాలి కానీ నిజాన్ని అబద్ధంతో అపభ్రంశం చేసే ఆయుధం కాకూడదు సునీతా .

ఇవన్నీ నేనూ ముందే చెప్పాలి కానీ మీ ఇద్దరి ఆరాటంలో నాకు మాట్లాడే అవకాశం ఏదీ! సరేలే ఇప్పటికైనా దారిలోకి వద్దాం, పద" అని సునీత భుజం తట్టాడు ప్రకాష్.


సునీత కార్లోకి ఎక్కేటప్పటికీ వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్న ధీరజ్ ధైర్యం కోల్పోయి డీలపడిపోయి దిక్కుల వంక తిక్క తిక్కగా చూస్తూ ఉన్నాడు.

"రామచంద్రా! ' మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలకబోసుకున్నారని' సామెత చెప్పినట్లు మా సీజన్ అన్నయ్య మీద ఆశ పెట్టుకుని మధ్యలో వచ్చిన మంచి మంచి సంబంధాలన్నీ వదులుకున్నాం.

చిన్నప్పటి నుంచీ అలవాటయిన నేనే తట్టుకోలేక పోతున్నాను. ఇంక ఈ సీజన్ మామయ్య వేసిన సీజనింగ్ ఘాటు నుండి నా చిన్నారి పెళ్ళి కొడుకు ఎప్పటికి తేరుకుంటాడో" అని తల బాదుకుంది సునీత.

No comments:

Post a Comment